అదే స్ఫూర్తి కొనసాగించండి: విజయమ్మ

హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందే ప్రజల కోసం అని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. దివంగత మహానేత నిరంతరమూ ప్రజల శ్రేయస్సు కోసమే కృషిచేశారని గుర్తుచేశారు. ప్రజల కోసమే తన జీవితాన్ని ఆయన అంకితం చేశారన్నారు. ఆయన వారసుడిగా, ఆ మహానేత వారసత్వ పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భవించిందన్నారు. ప్రజల కోసమే జీవించాలని, వారి మేలు కోసమే కృషి చేయాలనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆశలు, ఆశయాలు ఉన్నాయన్నారు.

మహానేత వైయస్ఆర్‌ జీవించి ఉన్నప్పుడు కూడా భావి తరాల బాగు, సంక్షేమం కోసమే నిరంతరం శ్రమించారని శ్రీమతి విజయమ్మ వివరించారు. ఏ జిల్లాకు, ఏ గ్రామానికి వెళ్ళి అయినా ప్రజలను ఓటు వేయమని, మనతో కలిసి రమ్మని అడిగే హక్కు ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఉందని అన్నారు. రాజశేఖరరెడ్డిగారు చేసిన మంచి పనుల కారణంగా అందరి ఆయన అందరి హృదయాల్లో ఉన్నందున మన పార్టీకి మద్దతుగా ఉండమని అడిగే హక్కు మనకే ఉందన్నారు. మనుషులు, ప్రాంతాలను వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏనాడూ వేరుగా చూడలేదన్నారు. అందర్నీ సమానంగా ప్రేమించారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు అందించారని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌ నుంచి చిత్తూరు వరకూ, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అందరూ తన వారే అనుకుని మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు.

రాజశేఖరరెడ్డి పరిపాలించిన ఐదేళ్ళ మూడు నెలల కాలం రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే సంక్షేమంలో సువర్ణయుగంగా వెలిగిందని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. మూడు ప్రాంతాల్లోని 23 జిల్లాల్లో ప్రతి మనిషికీ మేలు చేసిన ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఒక ప్రాంతానికి మేలు చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేయాలని ఆయన ఏనాడూ భావించలేదన్నారు. ప్రజల మీద ఒక్క పైసా కూడా భారం వేయకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్, రెండు రూపాయల కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్ళు, పావలా వడ్డీ రుణాలు, అభయ హస్తం లాంటి అద్భుతమైన పథకాలను సంతృప్త స్థాయిలో కొనసాగించారన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి లేని సమయంలో, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్న తరుణంలో తమ కుటుంబానికి అండదండలుగా ఉన్న ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోతారని శ్రీమతి విజయమ్మ అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడంలో నాయకులు, కార్యకర్తలందరి కృషి ఉందని ఆమె ప్రశంసించారు. పార్టీ ఏర్పాటై మూడేళ్ళు కూడా పూర్తికాని అనతి కాలంలోనే ఏ పార్టీకీ తీసిపోని విధంగా విజయాలు సాధించడం సామాన్యమైన విషయం కాదన్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి, బాధ్యతను కొనసాగించాలని మహానేత వైయస్ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా, ప్రజలకు మేలు చేసే విధంగా ముందడుగు వేయాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకు కార్యోన్ముఖులు కావాలని ఆమె సూచించారు. ప్రజల పక్షాన పోరాటాలు చేయడానికి ప్రతి నిమిషమూ సర్వసన్నద్ధులుగా ఉండాలని అన్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెందిన సుమారు నాలుగైదు వందల మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన, జఠిలమైన విభజన నేపథ్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ భేటికి పార్టీ ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నాయకులు హాజరయ్యారు. పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సూచనల మేరకు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ ‌నాయకులకు దిశానిర్దేశం చేశారు.

తాజా వీడియోలు

Back to Top