జగన్‌ వల్లే మళ్లీ సువర్ణ పాలన

కర్నూలు:

మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేసీ కాల్వల పరిధిలో‌ని అన్నదాతలు ఏడాదికి రెండేసి పంటలు పండించుకున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురావు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుర్తుచేశారు. రైతులు ధర్నా చేసే అవకాశమే రాకుండా ఆయన పాలన సాగించారన్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. గుడిసే లేని రాష్ట్రం చేయాలన్న తలంపుతో వైయస్ఆర్ ఒక్క‌ మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి పేదల సొంతింటి కల నెరవేర్చారన్నారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌బాబు కూడా తన తండ్రి లాగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. జగన్‌బాబు వల్లే మన రాష్ట్రంలో మళ్ళీ సువర్ణయుగం సాధ్యం అవుతుందన్నారు. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నుంచి శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, వెంకటాపురం, నంద్యాలలో విజయమ్మ రోడ్‌షో, బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వైయస్ఆర్ ప్రతి నెలా 1నే పింఛ‌న్ అందించా‌రని శ్రీమతి విజయమ్మ తెలిపారు. అభయహస్తం పథకం పేరుతో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చారన్నారు. ఆ మహానేత వైయస్ మరణంతో ఈ పథకంతో‌ పాటు ఎన్నో పథకాలు మూలనపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ఆర్ సంక్షేమ పథకా‌లను జగన్‌బాబు నిర్విఘ్నంగా అమలు చేస్తారని శ్రీమతి విజయమ్మ అన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రంలో వైయస్ఆర్ సువర్ణ పాలనను తిరిగి తీసుకొద్దామని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. అమ్మ ఒడి, వృద్ధులకు రూ.700 పింఛన్, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ పథకాలపై జగన్‌బాబు హామీ ఇచ్చారన్నారు.

వేల కోట్లు ఎలా సంపాదించావు బాబూ?:

‘రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు చంద్రబాబూ? తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేయకపోయినా నువ్వు.. రామోజీరావు, సీఎం రమేశ్, మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి వంటి వారికి మాత్రం రాష్ట్రాన్ని దోచిపెట్టావు. చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని తెహల్కా డాట్ కా‌మ్ ఏనాడో చెప్పింది. నాడు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బె‌ల్టుషాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటం అడిన ఘనత చంద్రబాబుదే. ఆడపిల్లలు పుడితే రూ. 5వేలు, మహిళలకు బంగారు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయని నీకు ఓటు అడిగే దమ్ము, ధైర్యం ఉందా చంద్రబాబూ?' అని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు.

Back to Top