ప్రజల నుంచి త్వరలో ఓట్ల విప్లవం

ఖమ్మం:

‘మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను తుంగలో తొక్కిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలికా‌రని ఆరోపించారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, ప్రతిపక్షంగా విఫలమైన చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతి ఇంటి నుంచీ ఓటు హక్కుతో విప్లవం రాబోతోంది’ అని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నగర పంచాయతీ, ఇల్లెందు మున్సిపాలిటీలలో ఆమె సోమవారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మధిర, ఇల్లెందులలో జనవాహినిని ఉద్దేశించి పలుచోట్ల ఆమె ప్రసంగించారు.

‘మనం ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నాం. మనసున్న నేతను, మంచి పాలకుడిని ఎన్నుకోవాలి. అది రాజన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన బిడ్డ జగన్‌బాబుతోనే సాధ్యం’ అని శ్రీమతి విజయమ్మ పునరుద్ఘాటించారు. ఈ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు నడిపేవారికి గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన, వైయస్ఆర్ ఐదున్నరేళ్ల పాలన, వై‌యస్ తర్వాత నాలుగున్నరేళ్ల కాంగ్రె‌స్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై విజయమ్మ పేరు పేరునా ప్రశ్నించినప్పుడు ప్రజలు అనూహ్యంగా స్పందించారు.‌ మహానేత వైయస్ఆర్ మరణించిన తర్వాత తమకు సంక్షేమ పథకాలేవీ అందలేదని ‌బిగ్గరగా నినదించారు. చంద్రబాబు పాలన రాక్షస పాలన అంటూ ధ్వజమెత్తారు.

ఆ తొమ్మిదేళ్లూ ఏం చేశారు బాబూ? :
- ఎన్నికలయ్యాక మర్చిపోయే హామీలను చంద్రబాబు చాలా ఇస్తున్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే తన తొమ్మిదేళ్ల పాలనను తిరిగి తీసుకువస్తానని ప్రజలకు చెప్పాలి. 34 ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏనాడూ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రజలను వంచించడమే ఆయన ధ్యేయం. తొమ్మిదేళ్ల పాలనలో ఏంచేశారని చంద్రబాబు ఓటడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు?

- హైదరాబాద్ అభివృద్ధి‌ తన హయాంలోనే జరిగిందని, ఐటీని తానే హైదరాబాద్‌కు తెచ్చానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నిక్కర్ వేసుకున్నపుడే అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబా‌ద్ ఉంది. చంద్రబాబు పాలనలో దాని అభివృద్ధి పడిపోయింది.
- చంద్రబాబు తన పాలన లో అన్ని వ్యవస్థలనూ మేనే‌జ్ చేశానని చెప్పుకునే వారు. ఆయన మీడియాను మేనే‌జ్ చేశారే తప్ప ఇంకే ప్రభుత్వ వ్యవస్థనూ మేనే‌జ్ చేయలేదు. కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకున్న‌ చంద్రబాబు కేంద్రం నుంచి ఏ ఒక్క పరిశ్రమనయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా? ప్రధాని పదవిని త్యాగం చేశానని చెప్పుకునే బాబుకు ఆ పదవిని ఎవరు ఆఫర్ చేశారో ‌వెల్లడించాలి.
- రాష్ట్రంలో 54 పరిశ్రమలను అప్పుడు తెలుగు తమ్ముళ్లకు రాసిచ్చి వేలాది మంది ఉద్యోగుల పొట్టకొట్టి వారికి కనీసం పెన్షన్ కూడా అందకుండా చేసిన ఘనుడు చంద్రబాబు. వై‌యస్‌ పథకాలనే తన పథకాలంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు.

పేదల హృదయాల్లో వైయస్ఆర్‌ చిరస్మరణీయుడు :
- రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండాలని, బీడు భూములను సస్యశ్యామలం చేయాలని వైయస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథునిలా ప్రతిష్టాత్మకంగా‌ జలయజ్ఞం చేపట్టారు. ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యు‌త్‌ పైనే చేశారు. దీంతో తెలంగాణలోనే 31 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ‌సదుపాయం కల్పించి మెట్ట రైతులకు వై‌యస్ఆర్ అండగా నిలిచారు.
- దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయలేనంత అభివృద్ధి చేసిన వైయస్ఆర్ పాలన ప్రపంచంలోనే రికార్డు పాలనగా నిలిచిపోయింది. 108, 104, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఇందిర ప్రభ, ఫీజు రీయింబ‌ర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ కల్పించి పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

గీత గీసి‌ మన ప్రేమలు చెరపలేరు :

గీతలు గీసి భూములు విడదీసినా.. మనుషుల మధ్య ప్రేమను చెరిపేయలేరు. ఈ ప్రాంతం వారికి కష్టం వస్తే ఆ ప్రాంతం వారు, ఆ ప్రాంతం వారికి కష్టం వస్తే ఈ ప్రాంతం వారు ఎప్పటికీ అండగా ఉంటారు. తెలుగుజాతి ఒక్కటేనని చాటుతారు. మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ 23 జిల్లాలను ప్రాంతాలకు అతీతంగా సమానంగా ప్రేమించారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశారు. ఏ జిల్లాకు ఏ ప్రాజెక్టు కావాలన్న దూరదృష్టితో ఆలోచన చేశారు. తెలంగాణలోని దేవాదుల, ఎల్లంపల్లి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులన్నీ ఆ మహానేత పాలనలోనే చేపట్టారు. ఆ మహానేత బతికి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదని శ్రీమతి విజయమ్మ తెలిపారు.

Back to Top