చంద్రబాబు తీరుతోనే రాష్ట్రానికి అన్యాయం


పులిచింతల (గుంటూరు జిల్లా),

4 డిసెంబర్ 2013: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమా‌ర్ ఇచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురా‌లు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వైఖరి వల్లే ట్రిబ్యున‌ల్ తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు.‌ రైతుల నోట్లో మట్టికొడుతూ, రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిన బ్రిజేష్ కుమా‌ర్ ట్రిబ్యున‌ల్ తీర్పును నిరసిస్తూ‌ శ్రీమతి విజయమ్మ గుంటూరు జిల్లా అచ్చంపేటలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ‘నీటి పోరు’ పేరిట
ధర్నా నిర్వమించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ధర్నా మధ్యాహ్నం 3.00 గంటల
వరకు కొనసాగింది. పార్టీ రాష్ర్ట నేతలతో పాటు గుంటూరు, కృష్ణా, నల్లగొండ
జిల్లాల నుంచి రైతులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్ శ్రేణులు ‌ఈ ధర్నాకు భారీ
స్థాయిలో తరలివచ్చారు. పులిచింతల బ్యారేజ్‌తో పాటు గుంటూరు, నల్లగొండ
జిల్లాల సరిహద్దుల వరకూ ప్రజలు నిలబడి శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం
ఆలకించారు.

‘తెలుగు ప్రజల మధ్య అనైక్య వాతావరణం సృష్టించి, మన నీటి వాటాను విభజన ముసుగులో యూపీఏ ప్రభుత్వం లాగేసుకోవడం దుర్మార్గం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి కోసం తాపత్రయపడుతున్న యూపీఏ ఇక్కడ ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తోంది’ అని శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళా రైతులు, కూలీలు, వృద్ధులు, చంటి బిడ్డలతో తల్లులు కూడా తరలిరావడంతో పులిచింతల ప్రాజెక్టు ప్రాంతం జనసంద్రంగా మారింది. గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తిరగబడి కలబడటానికి తెలుగు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదే‌శ్ కు శరాఘాతమ‌ని ఆవేదన వ్యక్తంచేశారు. భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన చెందారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే జలయజ్ఞం పూర్తయ్యేదని శ్రీమతి విజయమ్మ అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి పాలనలో ఒక్క ప్రాజెక్టుకూ పునాది పడలేదని, ఆయన తీరు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఇంకుడుగుంతలను ప్రోత్సహించి, ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబుకు దీక్ష చేసే నైతిక అర్హత లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూనే మరింత అన్యాయం జరిగేలా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చేలా ప్రభావితం చేసిందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే ఇంతటి అన్యాయం జరుగుతోందని, విడిపోతే అసలు పట్టించుకునే దిక్కే ఉండబోదని ఆవేదన వ్యక్తంచేశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుతో మనకు భావితరాలకు కూడా తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పు ప్రకారం మిగులు జలాల్లో మనకు జరుగుతున్న అన్యాయంపై అవసరమైతే ప్రజలంతా ఒక్కటై తిరగబడాలని, మన వాటా మనం సాధించుకుందామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు.

కృష్ణానదికి దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలు వాడుకోవచ్చని బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పిందని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు.‌ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలను పై రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల టెండర్లను కూడా చంద్రబాబు నాయుడు రద్దుచేశారని ప్రస్తావించారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్‌ మీద ధర్నా చేసి కృష్ణా డెల్టాకు ఏమి న్యాయం చేస్తారని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో 86 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. రూ. 40 వేల కోట్లు ఖర్చుపెట్టి హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. మహానేత వెళ్ళిపోయిన తరువాత ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విచారం వ్యక్తంచేశారు. రాజశేఖరరెడ్డిగారు మొదలుపెట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు పులిచింతల అన్నారు. తెలంగాణలో జలయజ్ఞానికి ఆయన రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. రాష్ట్రం విడిపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చుకునే బలం ఉందబోదని ఆమె హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడేందుకే జగన్‌బాబు అన్ని రాష్ట్రాలూ తిరిగి మద్దతు కూడగడుతున్నారని తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టును ఈ నెల 7న ప్రారంభించడానికి వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముందుగా ముంపు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు పూర్తిచేయకుండా ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయితే.. ఆయన ప్రారంభిస్తారేమో అనే అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును కిరణ్‌ ముందే ప్రారంభిస్తున్నారా? అని ఆమె ఎద్దేవా చేశారు. నాలుగేళ్ళుగా ప్రజలు, విద్యార్థులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల తాయిలాలు వేస్తోందని విమర్శించారు.

సమైక్య రాష్ట్రంతోనే అన్ని సమస్యల పరిష్కారం :
యూపీఏ, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేస్తున్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ, రాయల తెలంగాణ అంటూ పూటకోమాట మాట్లాడుతున్న ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అర్థరహితం అన్నారు. పెద్ద రాష్ట్రంగా ఉంటే పెద్ద పరిశ్రమలు వస్తాయని, విడగొడితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పు నీళ్లే శరణ్యమని అన్నారు. అడ్డగోలు విభజనపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే అలుపెరగని పోరాటం చేస్తున్నారని, అన్ని రాజకీయ కూటముల సహకారం కోరుతున్నారని గుర్తు చేశారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు.

చంద్రబాబూ! సిగ్గు.. సిగ్గు :

నీటి పారుదలపై ధర్నా చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్ నేతలు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడలో బాబు ధర్నా చేపట్టినందుకు కృష్ణమ్మ సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. ట్రిబ్యున‌ల్ తీర్పుపై వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుదివరకు న్యాయ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కృష్ణా, నల్లగొండ జిల్లాల పార్టీ కన్వీనర్లు సామినేని ఉదయభాను, బీరవోలు సోమిరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రావి వెంకటరమణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర కన్వీన‌ర్ నాగిరెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నేతలు మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కొడాలి నాని, జోగి రమేష్, జలీ‌ల్ ఖాన్, వంగవీటి రాధ,  గౌతంరెడ్డి, జ్యేష్ట రమే‌ష్‌బాబు, ఉప్పులేటి కల్పన తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top