సంక్షేమాన్ని గాలికొదిలిన చేతకాని ప్రభుత్వం

హైదరాబాద్ :

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలను ఈ చేతకాని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం నాయకురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఈ అసమర్థ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించివేసిందని మండిపడ్డారు. నీటి పారుదల, గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ వంటి పథకాలకు ఈ బడ్జె‌ట్‌లో భారీగా కోతలు వేశారని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో సోమవారం ఆమె సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో బడ్జెట్‌పై స్పందించారు.

ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జె‌ట్‌లో 2013-14 ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలే ఇవ్వలేదని, పాత అంచనాలనే మళ్లీ తిరగేసి 2014-15 బడ్జెట్‌పై మాట్లాడడానికేమీ లేకుండా చేశారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను ఆమె తుర్పారబట్టారు.
2012-13లో రూ. లక్షా 16 వేల కోట్ల మేరకు రాబడిని అంచనా వేయగా రూ. లక్షా 3 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 13 వేల కోట్ల లోటు ఏర్పడింది. దాంతో పాటు రూ. 22,850 కోట్ల రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండగా రూ. 17,850 కోట్లు మాత్రమే సేకరించారు. మొత్తంగా రుణాలు తీసుకోవడంలో 5,300 కోట్లు, రాబడిలో రూ. 13,000 కోట్ల తగ్గుదల కలుపుకొని రూ. 18,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం కోల్పోయాం అని శ్రీమతి విజయమ్మ విశ్లేషించారు. కేంద్రం నుంచి మనకు రూ. 14,940 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయి‌డ్ రావాల్సి ఉండగా.. 7,687 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు.

2012-13 సంవత్సరానికి రూ. 54 వేల కోట్ల ప్రణాళికా వ్యయం అంచనాలుండగా సవరించిన ప్రకారం ఆ మొత్తం రూ. 48 వేల కోట్లకు వచ్చింది. అందులోనూ ఖర్చు చేసింది రూ. 43 వేల కో‌ట్లు మాత్రమే. ఇక పెట్టుబడి వ్యయం రూ. 19,972 కోట్లయితే ఖర్చు చేసింది మాత్రం రూ. 15,137 కోట్లు మాత్రమే అని చెప్పారు. 2004-09 మధ్య కాలంలో 11 నుంచి 12 శాతంగా ఉన్న రాష్ట్ర అభివృద్ధి రేటు ఇప్పుడు 5.29 శాతానికి పడిపోయిందని విచారం వ్యక్తంచేశారు. వీటన్నింటి కారణంగా సంక్షేమ, ప్రజోపయోగ పథకాలకు తక్కువ నిధులు కేటాయించే పరిస్థితులు తలెత్తాయని, దీనికి ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం అన్నారు.

రాష్ట్రంలో 1994 వరకూ ఆస్తులు, అప్పుల నిష్పత్తి 101: 100గా ఉంటే 1994-2004 మధ్య కాలంలో (చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కూడా) ఆస్తులు, అప్పుల నిష్పత్తి 50 : 100గా ఉండేది. అలాంటిది మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆస్తులు గణనీయంగా పెరిగాయని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. 2004-09 మధ్యలో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 130 : 100 గా ఉందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్నీ ఉండి కూడా గ్రాంట్ ఇ‌న్ ఎయి‌డ్ తక్కువగా తెచ్చుకుంద‌న్నారు. ప్రణాళికా వ్యయాన్ని కూడా సరిగా ఖర్చు పెట్టలేకపోయిందని విమర్శించారు.

ఇదంతా ప్రభుత్వం వైఫల్యం, చేతగానితనమే అని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ఇది చేతగాని ప్రభుత్వమని, చేతగాని పాలన అని వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని కూడా పూర్తిగా చదవలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందని శ్రీమతి విజయమ్మ అన్నారు.

Back to Top