ధనుపురం (శ్రీకాకుళం జిల్లా), 29 జూలై 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర సృష్టించింది. ఆమె చేసిన పాదయాత్ర సువర్ణాక్షరాలతో రాయవలసిన ఘట్టంగా నిలిచింఇ. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఉదయం మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని ధనుపురం గ్రామం ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ప్రపంచ చరిత్రలో ఒక మహిళా నాయకురాలు ఇన్ని వేల కిలోమీటర్లు నడిచిన దాఖలా ఎక్కడా లేదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని శ్రీమతి షర్మిల నిరూపించారు.
రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, ప్రజల పక్షాన కాకుండా ప్రజా కంటక కాంగ్రెస్‌తో అంట కాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ, చరిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ధనుపురంలో జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల టిడిపి - కాంగ్రెస్ పార్టీల కుట్రలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు.
కాగా, రాజన్న తనయ, జగనన్న సోదరిని చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అంతకు ముందు శ్రీమతి షర్మిల మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పదేళ్ళ క్రితం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 1476 కిలో మీటర్లు పాదయాత్ర చేయగా.. ఆయన తనయ శ్రీమతి షర్మిల అంతకు రెండింతలకు పైగా దూరం నడిచి రికార్డు సృష్టించారు.