రాజన్న స్వప్నమే జగనన్న యజ్ఞం

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా),

2 ఫిబ్రవరి 2014: 'నేను జగనన్న వదిలిన బాణాన్ని. జగనన్న సంధిస్తే లక్ష్యం సాధించడానికి ఎక్కడి దాకా అయినా దూసుకుపోతా. రాజన్న స్వప్నమే జగనన్న యజ్ఞం. అదే మన కర్తవ్యం' అని స్పష్టంచేశారు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్‌సీపీ అధినే శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల. రైతులు, పేదలు, వికలాంగులు, వృద్ధులు, విద్యార్థులంతా ఆనందంగా ఉండాలని,  మళ్లీ రాజన్న రాజ్యం రావాలని,  జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం అన్నారు. వైఎస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో వైయస్ఆర్‌సీపీ రెండో ప్లీనరీ 'ప్రజా ప్రస్థానం'లో ఆదివారంనాడు ఆమె ప్రసంగించారు. శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డిని పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వైయస్ కుటుంబం తరపున అందరికీ‌ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న హయాంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారో, ఇప్పుడెంత కష్టపడుతున్నారో చూస్తుంటే కడుపు తరుక్కు పోతోందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని, అది ఒక్క జగనన్నతోనే సాధ్యం అన్నారు. అందుకు పార్టీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సింహంలా మారి జగనన్నను బలపరచాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వెళ్లిపోవడం ‌మన రాష్ట్రం చేసుకున్న దురదృష్ణం అన్నారు. వైయస్ఆర్ ‌మరణిస్తే బాధపడుతున్నది తమ ఒక్క కుటుంబం మాత్రమే కాదన్నారు. రాష్ట్రంలోని కోట్ల మంది పేదలు కన్నీరు పెట్టుకుంటున్నారని చెప్పారు. రాజన్న ఆశయ సాధన కోసం జగనన్నకృషిచేస్తున్నారని చెప్పారు. ఇది ధర్మం కోసం, మంచి కోసం చేస్తున్న సమరం అని తెలిపారు. అంతిమ విజయం కోసం అలుపెరుగని పోరాటం చేయాలని కార్యకర్తలకు శ్రీమతి షర్మిల పిలుపు ఇచ్చారు.

కాంగ్రెస్‌ పెద్దలు ఈ నాలుగేళ్ళలో మా కుటుంబాన్ని ఎంతగా వేధించారో, ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసన్నారు. జగనన్నను జైలుకు కూడా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వార్థం కోసం కేసులు పెట్టారన్నారు. నాన్న చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని అవమానించారని చెప్పారు. సిబిఐ పేరుతో కక్షసాధించారన్నారు. అయితే కష్టాలకు జగనన్న కృంగిపోలేదు. భయపడలేదన్నారు. అధికారం, మందీ మార్బలం, రాజ్యాంగ విభాగాలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్న శక్తులు తన మీద దాడులు చేస్తున్నా తొణకలేదు, బెణకలేదన్నా. ఇంతగా ఒడుదుడుకులు ఉన్నా వెనుకంజ వేయలేదని చెప్పారు. నిద్రపోతున్న పౌరుషాన్ని తట్టిలేపాలని, కాంగ్రెస్ నాయకుల గూబ గు‌య్యిమనిపించాలని అన్నారు. ప్రత్యర్థులకు అధికార బలం, కండ బలం, ధన బలం ఉన్నాయని, వారికి లేనిది, మనకు ఉన్నది ప్రజా బలం, దేవుని దయ అని ఆమె తెలిపారు.

బోనులో ఉన్నా సింహం సింహమేనని జగనన్న నిరూపించుకున్నారన్నారు. అన్న ఇంత నిబ్బరం కలిగినవాడని తనకు కూడా తెలియదన్నారు. దమ్ము, ధైర్యం నిజాయితీ, విశ్వసనీయత ప్రజాదరణతో ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. నాన్న మరణించిన ఈ నాలుగేళ్లో అమ్మ విజయమ్మ ఎంతో నేర్చుకున్నారని,  ఆమెలో  ఎంతో మార్పు వచ్చిందని శ్రీమతి షర్మిల తెలిపారు. అంతకు ముందు నాన్నే లోకంగా బతికిన అమ్మేనా అని తనకు అనిపించిందని చెప్పారు.

పాదయాత్ర చేస్తున్నప్పడు లక్షలాది మంది ప్రజల కళ్ళల్లో తాను వారి ప్రేమను మాత్రమే చూడలేదని, మనం గెలుస్తామన్న ఆనందాన్ని చూశానన్నారు. వచ్చే ఎన్నికలు తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల భవితను మార్చే ఎన్నికలని, వాటిలో మనం తప్పకుండా గెలుస్తాం అని పేర్కొన్నారు. రాజన్న అంతటి నాయకుడ్ని జగనన్నలో మనం చూస్తామన్నారు. పేదలు, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్ళు తుడిచే నాయకుడు జనగన్న అన్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండే రోజు రావాలని శ్రీమతి షర్మిల ఆకాంక్షించారు.

వైవీ సుబ్బారెడ్డిని, నన్ను జగనన్న తొక్కేస్తున్నారని, మాకు అన్యాయం చేసేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి  రాధాకృష్ణ ఎంతో బాధపడిపోతున్నారు. అయితే ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని శ్రీమతి షర్మిల ఖండించారు. తమ ఇద్దరినీ పోటీలో ఉండమని జగనన్న ఏనాడో అడిగారన్నారు. ఇలాంటి విషయాలు అసత్యాలు ప్రసారం చేసే వీళ్ళకు అర్థం కావు. దున్నపోతుకూ అర్థం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన రాష్ట్రాన్ని విడదీస్తున్నది సోనియా గాంధీ అయితే... ఆమెకు అన్ని విధాలా సహాయపడుతున్నది కిరణ్, చంద్రబాబు అని ఆరోపించారు. జగనన్న, అమ్మ, 175 మంది పార్టీ కో ఆర్డినేటర్లు అందరూ సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షలు చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం జగనన్న పనిచేయడంలేదన్న సబ్బం హరి సిగ్గు లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం జగనన్న సరిగా పనిచేయడం లేదన్న రఘురామ కృష్ణంరాజు తెలంగాణకు మద్దతు ఇస్తున్న బీజీపీలో సిగ్గు లేకుండా ఎందుకు చేరారని నిలదీశారు.

'రాజన్న కలల్ని నిజం చేయడానికి నడుంబిగించిన అందరికీ, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యుద్ధం చేస్తున్న అందరికీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు నమస్కరిస్తోంది' అంటూ శ్రీమతి షర్మిల ప్రసంగం ప్రారంభించారు. రాజశేఖరెడ్డి కుటుంబానికి వచ్చిన ప్రతి కష్టంలోనూ, నష్టంలోనూ మీరంతా పాలు పంచుకున్నారని ధన్యవాదాలు చెప్పారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్కరించుకుంటున్నాం అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top