పాకిస్తాన్‌లో ఉన్నట్లు సీమాంధ్రులు బ్రతకాలా?

ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)

, 8 సెప్టెంబర్ 2013: 'మానవహారంగా ఏర్పాటవ్వాలనుకున్న న్యాయవాదులపై సాక్షాత్తూ హైకోర్టు ఆవరణలోనే తెలంగాణా లాయర్లు దాడి చేశారు. నిన్న సమైక్య వాదాన్ని వినిపించాలనుకున్న ఎపి ఎన్జీవోల మీద కూడా తెలంగాణ వాదులు రాళ్ళతో దాడి చేశారు. సీమాంధ్రులు తమకు అన్యాయం జరుగుతుందని గొంతు విప్పి చెప్పాలనుకుంటే.. విభజన జరగక ముందే వారి మీద దాడి చేస్తుంటే.. ఇక విభజన జరిగిన తరువాత అన్యాయం జరుగుతుందని చెబితేనే వారి మీద కేసులు పెట్టరా? జైలులో పెట్టరా?' అనే అనుమానాన్ని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినాయకుడు శ్రీ వైయస్‌ రాజశేఖరరెడ్డి సోదరి శ్రీమతి షర్మిల వ్యక్తంచేశారు. 'విభజన జరగక ముందే సీమాంధ్రులను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారే.. విభజనంటూ జరిగితే సీమాంధ్రులను పరదేశీయుల్లాగా చూడరా?' అని ఆందోళన వ్యక్తంచేశారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

'హైదరాబాద్‌ రావాలంటే.. మా అనుమతి ఉండాలి.. మీరు పాస్‌పోర్టులు తీసుకుని రావాలి అని తెలంగాణ నాయకులు ఆంక్షలు పెట్టరా?' అని ప్రశ్నించారు. 'హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల ఆస్తులు లాగేసుకుంటామని టిఆర్ఎస్‌ నాయకులు అన్నది వాస్తవం కాదా?' అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను వెళ్ళగొడతామని తెలంగాణ వారు అనడం వాస్తవం కాదా? అన్నారు. విభజన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్లో బతకగలరా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులు బ్రతకడం అంటే భారతీయుడు పాకిస్తాన్‌లో బ్రతికినంత కష్టంగా అయిపోదా అని శ్రీమతి షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్రులను ఎప్పుడెప్పుడు వెళ్ళగొడదామా? అని చూస్తున్న వారి మధ్య బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకడం అంటే.. వారికి గాని వారి బిడ్డలకు గాని, ఆస్తులకు గాని భద్రత ఉంటుందా? కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి అని శ్రీమతి షర్మిల నిలదీశారు.

ఆర్టికల్‌ 3ను కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగం చేస్తున్నదని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఆర్టికల్‌ 3 ప్రకారం విభజించే అధికారం ఉంది కదా అని తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తామని, నాలుగు సీట్ల కోసం కోట్ల మంది తెలుగువారికి తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌ వారిని పాలకులు అనాలా? లేక రాక్షసులు అనాలా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో 8 కోట్ల మంది జనాభా ఉంటే.. 5 కోట్ల మంది సీమాంధ్రులే ఉన్నారని ఆమె తెలిపారు. ఇన్ని కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలర్‌ పట్టుకుని నిలదీయాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ చంద్రబాబులో ఏమైనా చలనం ఉందా? అని ప్రశ్నించారు. విభజనకు అంగీకరిస్తూ బ్లాంక్ చెక్కు లాంటి లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చారని, అసలు రాష్ట్ర విభనకు కారకుడు చంద్రబాబేనని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. మన రాష్ట్రాన్ని విభజించే సాహసం కాంగ్రెస్‌ పార్టీ చేయడానికి చంద్రబాబు పలికిన మద్దతే కారణం అన్నారు.

పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆత్మగౌరవ యాత్ర అంటూ తిరుగుతున్నారు చంద్రబాబూ అని ప్రజలు ఎక్కడికక్కడ ఆయనను నిలదీయాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎందుకు రాజీనామా చేయడంలేదని నిలదీయాన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎందుకిచ్చారు, ఎవరినడిగి ఇచ్చారని ప్రజలంతా ఎక్కడికక్కడ ప్రశ్నించాలన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్, టిడిపి నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోయేదన్నారు.

గతంలో మద్రాసును తీసుకున్నారు, ఇప్పుడు సీమాంధ్రులకు హైదరాబాద్ను దూరం చేస్తామంటున్నారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ఒక్క హైదరాబా‌ద్ నుంచే సగం ఆదాయం వస్తోంది. హైదరాబా‌ద్పై హక్కు‌ లేదంటే సంక్షేమ పథకాలు అమలయ్యేది ఎలా? పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మాణం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల అభివృద్ధికి నిదర్శనం హైదరాబా‌ద్ అని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి లేదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో నీరు రాకపోతే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని శ్రీమతి షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. సీమాంధ్ర గ్రామాలన్నీ స్మశానాలుగా మారిపోవా? కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సంక్షేమ పథకాలు ఆగిపోవా అని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డిగారు ఉండగా గోదావరి నీటిని కృష్ణానదిలోకి అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనుకున్నారని, ఇప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్ళను అడ్డుకుంటే ఆ కల అసాధ్యంగా మిగిలిపోదా? కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకునేందుకు నాలుగు సీట్ల కోసం కోట్ల మంది తెలుగు ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్ర ఆదాయంలో సగం హైదరాబాద్‌ నుంచే వస్తుంటే దానిని సీమాంధ్రులకు దూరం చేస్తే.. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి? ఉద్యోగుల జీతాలు ఏ విధంగా ఇవ్వాలి? కాంగ్రెస్‌ పార్టీ జవాబు చెప్పాలన్నారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రధాని, రాష్ట్ర ప్రజలంతా చెబుతుంటే విభజనకు వైయస్ఆర్‌ కారణం అంటున్నారంటే చంద్రబాబుకు మనస్సాక్షి లేదనుకోవాలా.. లేకపోతే ఆయన వంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. కళ్ళార్పకుండానే చంద్రబాబుగారు ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరన్నారు. ఓట్లు, సీట్ల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనపై మాట్లాడడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి మన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి వెనుకాడడంలేదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. కోట్లాది మందికి తీరని అన్యాయం చేస్తున్నారని, తరతరాలూ క్షమించలేని ఘోర పాపం చేస్తున్నాయన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నామని‌ కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా సంకేతాలు ఇచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసి, తమ నిరసన తెలియజేశారని ఆమె ప్రస్తావించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేయడమే కాకుండా నిరాహార దీక్షలు కూడా చేశారన్నారు. కానీ కాంగ్రెస్, టిడిపిలకు చెందిన ఎంతమంది ప్రజా ప్రతినిధులు సమైక్యాంధ్ర పక్షాన రాజీనామాలు చేశారు? ఎంతమంది నిలబడ్డారని ప్రశ్నించారు. పదవుల మత్తులో మునిగిపోయిన కాంగ్రెస్, టిడిపి నాయకులు తమకు ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్ళీ నిరూపించుకున్నారని దుయ్యబట్టారు.

న్యాయం చేసే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేకపోతే.. రాష్ట్రాన్ని విభజించే బాధ్యతను గాని ఎందుకు తీసుకుందని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడ ఉందన్నారు. న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. న్యాయం చేయడం మీకు చేతకాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. న్యాయం జరిగే దాకా జగనన్న నాయకత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

Back to Top