సీమ నుంచి చంద్రబాబును తరిమి కొట్టండి

మైదుకూరు (వైయస్ఆర్‌ జిల్లా),

7 సెప్టెంబర్ 2013: వెన్నుపోటుదారు చంద్రబాబు నాయుడిని సీమాంధ్ర నుంచి తరిమి.. తరిమి కొట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పిలుపు ఇచ్చారు. రాష్ట్ర విభజన చేసుకోండని కేంద్రానికి బ్లాంక్‌ చెక్కులా లేఖ ఇచ్చిన చంద్రబాబు దాన్ని వెనక్కి తీసుకుని, చెంపలేసుకుని పశ్చాత్తాపం ప్రకటించే వరకూ రాయలసీమలో అడుగుపెడితే తరిమి తరిమి కొట్టమని పిలుపునిచ్చారు. పట్టపగలు సీమాంధ్రుల గొంతు కోసి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారని ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెబుతారు చంద్రబాబూ అని నిలదీశారు.

పుట్టిన గడ్డకు, తెలుగు తల్లికి కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. ఈయనను నారా చంద్రబాబు అనాలా? లేక వెన్నుపోటు చంద్రబాబు అనాలా? వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు అసలు ఆత్మ అంటూ ఉందా? అని ప్రశ్నించారు. వెన్నుపోటు ఆత్మకు గౌరవం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్ర 6వ రోజు శనివారంనాడు శ్రీమతి షర్మిల వైయస్ఆర్‌ జిల్లా మైదుకూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

చంద్రబాబు ఏమి చేసినా తన చేతగాని కొడుకు కోసమే చేస్తారని విమర్శించారు. అయితే.. ఇతరుల కొడుకుల గురించి అసభ్యంగా మాట్లాడాతారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన చేతకాని కొడుకు కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తొక్కిపెట్టారని శ్రీమతి షర్మిల విమర్శించారు. పార్టీలో ఎవ్వరు పైకి వచ్చినా చంద్రబాబు సహించరన్నారు. హైదరాబాద్ చు‌ట్టూ ఉన్న విలువైన భూములను తన వారికి అప్పనంగా కట్టబెకున్నారన్నారు. చార్మినార్‌ను మీరే కట్టారా?, హుస్సేస్‌సాగర్‌ను మీరే తవ్వించారా చంద్రబాబూ అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుతున్నారంటే.. ఆయన దృష్టిలో ప్రజలు గొర్రెలని అర్థమా అని ప్రశ్నించారు. లేకపోతే పిచ్చివాళ్ళు అనేది ఆయన అభిప్రాయమా అన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ చుట్టుపక్కల వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబు తన బినామీలకు అప్పనంగా రాసిచ్చేశారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఆయన భార్య స్థలాన్ని కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వ భూములను అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా కారు చౌకగా రాసిచ్చేశారు చంద్రబాబు అన్నారు. కేవలం లక్ష రూపాయలతో ఏర్పాటైన మూడు రోజుల్లోనే తన బినామీ సంస్థ ఐఎంజికి హైదరాబాద్‌ నడిబొడ్డున 850 ఎకరాలను రాసిచ్చారు చంద్రబాబు అని విమర్శించారు. ఆ రోజుల్లోనే అది రూ. 2,500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 3.5 కోట్లకు రాసేశారన్నారు. ఈ రోజున అది రూ. 10 వేల కోట్ల కంటే ఎక్కువ విలువ చేస్తుందన్నారు. హైదరాబాద్‌పై తనకే హక్కుందని ఆ హక్కుతోనే నాలుగైదు లక్షల కోట్లకు తెలంగాణకు అమ్మేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మన రాష్ట్రంలోని రైతులందరినీ తన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ సహా అనేక విషయాల్లో వారికి అండగా నిలబడ్డారని తెలిపారు. విద్యార్థులను ఒక కన్న తండ్రిలా ఆలోచించి ఆదరించారన్నారు. ఉచితంగా చదువుకునే భరోసా ఆయన కలిగించారు కనుకే లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యలు చదివి గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. పేదవాడైనా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగానే పొందేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారన్నారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ళు సహా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాజశేఖరరెడ్డిగారు అద్భతంగా చేసి చూపించారన్నారు. ప్రతి ఇంటినీ తట్టి మరీ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిగారు అన్నారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఒక్క చార్జీని, ధరనూ పెంచకుండా ఆయన రికార్డు సృష్టించారన్నారు.

అయితే రాజశేఖరరెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన ప్రతి పథకానికీ తూట్లు పెట్టింది, ఆయన ప్రతి ఉద్దేశాన్నీ విమర్శించిందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రైతులను విస్మరించింది, విద్యార్థులకు మొండిచేయి చూపించిందని, మహిళలను పూర్తిగా గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అన్ని చార్జీలు, పన్నులు పెంచేసిందన్నారు. తాను పెంచిన చార్జీలు, ధరల భారంతో సామాన్యుడు అప్పులపాలైపోయి ఇబ్బందులు పడుతుంటే.. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వం చూసి నవ్వుకుంటోందని విమర్శించారు.

ఈ పాపాలు, ఘోరాలు సరిపోవన్నట్టు ఇప్పుడు మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి, అన్నదమ్ముల మధ్యే అగ్గిపెట్టి, చలి కాచుకుంటోంది ఈ కాంగ్రెస్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం టిఆర్ఎస్‌ను తనలో కలుపుకుని అయినా సరే రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కోట్ల మంది తెలుగువారికి అన్యాయం చేయడానికి పూనుకుందన్నారు.

ఇన్ని కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడులో మాత్రం ఎలాంటి చలనమూ లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ విభజించే సాహసం చేయడానికి కారణం చంద్రబాబు బ్లాంక్‌చెక్కులా రాసి ఇచ్చిన మద్దతు లేఖే కారణం అన్నారు. ఎఫ్‌డిఐ బిల్లు మొదలు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో నిస్సిగ్గుగా కలిసిపోయింది చంద్రబాబే అన్నారు. కరెంటు చార్జీలు పెంచేసి రాష్ట్ర ప్రజల నెత్తిన ఏకంగా రూ. 32 వేల కోట్ల భారాన్ని వేసినందుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా విప్‌ జారీ చేసి మరీ ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్నికాపాడారని అన్నారు. కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడి ఉండకపోతే.. ఇప్పుడు మన రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.

ఇంత అన్యాయం జరుగుతుంటే.. చంద్రబాబు గాని.. టిడిపి ఎమ్మెల్యేలు గాని నిరసన తెలియజేసి రాజీనామాలు ఎందుకు తెలియజేయలేదని ప్రజలంగా నిలదీయాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎందుకు ఇచ్చారు? ఎవరిని అడిగి ఇచ్చారని ప్రజలంతా ప్రశ్నించాలన్నారు. తెలంగాణను విడగొట్టవద్దు, తప్పయిపోయింది, మా రాష్ట్రాన్ని విడగొట్టవద్దని చెప్పి, చెంపలు వేసుకుని కోట్ల మంది సీమాంధ్రులకు క్షమాపణ చెప్పే వరకూ రాయలసీమలో అడుగు పెట్టకుండా చంద్రబాబును తరిమితరిమి కొట్టాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. విభజన నిర్ణయం రావడానికి ముందే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ప్రధానికి లేఖలు రాసి పోరాటాలు కూడా చేస్తున్నారని తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులంతా ఒక్కుమ్మడిగా రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయేదన్నారు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా కన్న తండ్రిలాగా ఆలోచన చేయమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ముందు నుంచీ ఒకే మాట చెబుతోందన్నారు.

న్యాయం జరిగేంత వరకూ జగనన్న నేతృత్వంలో ప్రజలతో కలసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని శ్రీమతి షర్మిల తెలిపారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి లేదని తేలిపోయింది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని శ్రీమతి షర్మిల స్పష్టం చేశారు. జైల్లో ఉన్నా జగనన్న ఎప్పటికీ జననేతే అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. విలువలతో పోరాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టిడిపిలకు లేదని ఆమె అన్నారు. ఆ రెండు పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో జగనన్నను జైలులో పెట్టించాయన్నారు. జగనన్న జైలులో ఉన్నా సింహమే అన్నారు.

Back to Top