కాకరాపల్లిలో నేడు షర్మిల బహిరంగ సభ

ప్రత్తిపాడు (తూ.గో.జిల్లా),

23 జూన్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 188వ రోజు ఆదివారం మరో సరికొత్త ఘట్టాన్ని ఆవిష్కరించనున్నది. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కాకరాపల్లిలో ఆమె పాదయాత్ర 2500 కిలో మీటర్ల మైలురైయిని పూర్తిచేసుకోనున్నది. శ్రీమతి షర్మిల ఆదివారం చేసే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు.

‌జిల్లాలోని రౌతులపూడి మండలం రాజవరం సమీపంలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కె.ఇ.చిన్నయ్యపాలెం, తిమ్మరాజుపేట, కె.ఎస్.కొత్తూరు, పాత కొట్టాం, కోటనందూరు మండలం కొత్త కొట్టాం వరకూ పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర లక్ష్మీదేవిపేట, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకూ నడుస్తారు.

శ్రీమతి షర్మిల పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కాకరాపల్లిలో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తారు. అనంతరం కాకరాపల్లిలో నిర్వహించే బహిరంగసభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారని రఘురాం, చిట్టబ్బాయి వివరించారు. సభ అనంతరం కాకరాపల్లి సమీపంలోనే ఆదివారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారు. ఆదివారం మొత్తం 14.1 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

తాజా వీడియోలు

Back to Top