కైకలూరు (కృష్ణా జిల్లా), 12 సెప్టెంబర్ 2013: అడ్డగోలు రాష్ట్ర విభజనకు వైయస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ అనుకూలంగా లేవని శ్రీమతి షర్మిల స్పష్టంచేశారు. కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, బిజెపిలు విభజనకు అనుకూలం అని ఆమె తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడానికి కోట్లాది మంది తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల పాలు చేసిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. కోట్లాది మంది తెలుగువారికి కష్టం వచ్చినా.. వారంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో చలనం లేదని ఆమె నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేసిన రోజునే సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పదవులను వదిలిపెట్టి ఉంటే విభజన ప్రక్రియ మొదలయ్యేది కాదన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల గురువారం కృష్ణా జిల్లా కైకలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషిచేశారని గుర్తుచేశారు.తెలంగాణ, సీమాంధ్రుల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్ పార్టీ చలి కాచుకుంటోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్కు లాంటి లేఖ ఇచ్చిన చంద్రబాబే ప్రధాన కారకుడని దుయ్యబట్టారు. ఒక వ్యక్తిని హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చిన చందంగా ఉందని చంద్రబాబు బస్సుయాత్ర తీరు, ఆయన మాట్లాడుతున్న విధానం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పుడైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీమతి షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబు తాను రాజీనామా చేయాలని, టిడిపి నాయకుల చేత కూడా రాజీనామా చేయించాలని శ్రీమతి షర్మిల డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు పదవులకు రాజీనామాలు చేసేంతవరకు సీమాంధ్రలో అడుగు పెట్టనివ్వవద్దని ఆమె పిలుపునిచ్చారు.రాష్ట్ర విభజనకు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కారణం అని చెబుతున్నారని, అయితే మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎంతగా కృషిచేశారో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అని శ్రీమతి షర్మిల చెప్పారు. ఆ మహానేత ఉండి ఉంటే మన రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదని స్వయంగా ప్రధానమంత్రే అన్నారని గుర్తుచేశారు. విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు ఆ నెపాన్ని రాజశేఖరరెడ్డి మీదకు నెడుతున్నారంటే.. చంద్రబాబుకు మనస్సాక్షి లేదనుకోవాలా? లేక ఆయన శరీరంలో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? అన్నారు. చంద్రబాబుగారు నిస్సిగ్గుగా కళ్ళార్పకుండానే ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరన్నారు. చంద్రబాబు నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలైపోతుందని మునీశ్వరుడి శాపం ఉందని రాజశేఖరరెడ్డిగారు చెప్పేవారన్నారు. అందుకేనేమో చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరని ఎద్దేవా చేశారు.ఏ పరిష్కారాలూ చూపించకుండానే మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని సంకేతాలు పంపించిన వెంటనే వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసిన వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేయడమే కాక నిరాహార దీక్షలు కూడా చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాటాలు చేస్తున్నారని, మన రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చవద్దని ఈ రోజు వరకూ ప్రధాని సహా కేంద్ర మంత్రులకు కూడా లేఖలు రాస్తున్నారని తెలిపారు. కానీ ఎంత మంది సీమాంధ్ర టిడిపి, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డారని నిలదీశారు. ఉన్న వారంతా తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కంటే పదవులే ముఖ్యమనే మత్తులో ఉన్నారని దుయ్యబట్టారు.విభజన విషయం ముందే తెలిసినా కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డు చెప్పలేదని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తామంటున్నారు సరే దానికి నీళ్ళెక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నీళ్ళివ్వరట.. హైదరాబాద్‌ను కూడా దూరం చేస్తారట.. ఇదెక్కడి న్యాయం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని చీల్చాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇవ్వలేదన్నారు.ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచన చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఒక్కటే మాట చెబుతోందని శ్రీమతి షర్మిల తెలిపారు. విభజన విషయంలో కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటో అందరినీ పిలిచి, చర్చించాలని డిమాండ్ చేసిందన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా కాంగ్రెస్ మర్చిపోయి వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. మీకు న్యాయం చేసే ఉద్దేశం లేదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెబుతోందన్నారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌కు చేతకాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు ముడుచుకుని కూర్చోరని శ్రీమతి షర్మిల అన్నారు. 16 నెలలుగా జైలులో మగ్గిపోతున్నా, తన కష్టాలను పక్కన పెట్టి ప్రజల కోసం జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేశారని చెప్పారు. అప్పటి దాకా జగనన్న నాయకత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని మాట ఇస్తున్నానన్నారు.విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టిడిపి నాయకులకు లేవు కనుకే కుట్రలు పన్ని, అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలు పాలు చేశారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని ఎవ్వరూ ఆపలేరని, జగనన్నను కూడా ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. జగనన్న జైలులో ఉన్నా జననేతే అని చెప్పారు. త్వరలోనే జగనన్న వస్తారు.. మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని చెప్పారు. అప్పటి వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.