‌రామోజీరావు కబ్జాకోరు, దగాకోరు

ఒంగోలు:

ఈనాడు రామోజీరావు గురించి తాను ఏనాడూ మాట్లాడలేదని, కానీ ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి వైయస్‌ షర్మిల అన్నారు. బయ్యారం గనులతో తనకు సంబంధం ఉన్నట్లు ఈనాడు పేపర్‌లో రామోజీరావు రాసిన అడ్డగోలు రాతలపై స్పందించక తప్పడంలేదన్నారు. ఆ గనులకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఎన్నిసార్లు చెప్పినా రామోజీరావుకు దున్నపోతుమీద వర్షం కురిసినట్టే ఉందని దుయ్యబట్టారు. వైయస్ఆర్ జనభేరిలో భాగంగా  ఆమె మంగళవారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రసంగించారు.‌ చంద్రబాబు నాయుడు, రామోజీరావు నీతి నిజాయితీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

బయ్యారం గనులు మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే కొత్తగా పుట్టలే‌దని శ్రీమతి షర్మిల అన్నారు. దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే బయ్యారం గనులు ఉన్నాయి. అవి నాసిరకం గనులు కనుకనే చంద్రబాబు వాటిని వదిలేశాడన్నారు. అవే నాణ్యమైన గనులైతే ఈ పాటికి తన అనుచరులు నామా నాగేశ్వరరావుకో, సుజనాచౌదరికో, సీఎం రమేశ్‌కో అప్పగించేవారని ఆరోపించారు. ఎందుకూ పనికిరాని భూముల్లో పరిశ్రమలు వస్తే.. అక్కడ పెట్టుబడులకు ఆహ్వానిస్తే వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే సదుద్దేశంతో దివంగత వైయస్ఆర్ ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయింపులు జరిపా‌రన్నారు.

రక్షణ  స్టీల్‌కు కేటాయింపుపై గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పుడు.. దానికి కేటాయించిన విధి విధానాలు, ఒప్పందాలపై సంబంధిత యాజమాన్యాలు వివరణ ఇచ్చుకున్నాయి. రక్షణ  స్టీల్సుకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన కేటాయింపులు, ఒప్పందాలతో తనకేమీ సంబంధం లేదని గతంలోనే తాను చెప్పానని శ్రీమతి షర్మిల అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కిందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు ఒక్కపైసా పన్ను కూడా పెంచకుండా పాలించి రికార్డు సృష్టించింది రాజన్న మాత్రమేనని చెప్పారు. మళ్లీ ఆ రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైయస్ఆర్‌సీపీని గెలిపించి జగనన్నకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లాలో  వైయస్‌ఆర్ చేపట్టిన ‘వెలిగొండ’ ప్రాజెక్టును పూర్తిచేస్తారని చెప్పారు.

‌రామోజీ గురించి అందరూ తెలుసుకోవాలి :

- రామోజీరావు ఎలాంటి దొంగో, ఎంత కేడీయో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈనాడు పత్రిక, ఉషోదయ సంస్థ, ఉషాకిరణ్ బ్యాన‌ర్‌పై సినిమాలు, సీరియల్సు వీటన్నిటి వెనుక బాగోతం అందరికీ తెలిసిందే. నీ దొంగ లెక్కలు, గ్రామాలకు గ్రామాలు స్వాహా చేయడం, కొండలు గుట్టలను కూడా ఆక్రమించిన భూదందాను నీ ఈనాడు పత్రికలో రాస్తే రాష్ట్రం మొత్తం ప్రజలు చదువుతారు కదా. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను స్వాహా చేయడమే కాకుండా బైపాస్ రోడ్డు విస్తరణలో అదే భూమిని పోగొట్టుకున్నాడంటూ నష్టపరిహారం తీసుకున్న నీచమైన వ్యక్తి రామోజీరావుది. దానిపై క్రిమిన‌ల్ కేసు నమోదు కాలేదా?

-‌ రామోజీరావు ఎంతటి 420, దగాకోరో రాష్ట్రమంతటికీ తెలుసు. మార్గదర్శి చిట్‌ఫండ్సు పేరుతో రూ.2,600 కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజల దగ్గర నుంచి సేకరించినట్లు ఆర్‌బీఐ హైకోర్టుకు వివరించిన విషయం నిజం కాదా? కళాంజలి అనే ఒక దొంగ దుకాణాన్ని తెరచి దొంగ వస్తువులు స్మగ్లింగ్ చేయడంపై కేసులు నమోదు కాలేదా? సుమారు 200కు పైగా కేసులున్న వ్యక్తి రామోజీరావు. హైకోర్టు చరిత్రలోనే ఏ ఒక్క వ్యక్తిపై ఇన్ని కేసులు నమోదవడం ప్రజలు విన్నారా?

‌- ఆస్తులు కాజేసి సొంత బంధువులనే రోడ్డు పాలు చేసిన నీచాతి నీచుడు రామోజీరావు. ఆయన తోడల్లుడు అప్పారావును కదిలిస్తే రామోజీరావు దొంగ పురాణం ఎలా ఉంటుందో వినిపిస్తారు. ‌కన్న కొడుకు సుమన్ మాట్లాడుతూ... తన తండ్రి వట్టి డబ్బు పిచ్చి కలవాడని, తన ఒంట్లో రోగం కంటే రామోజీ డబ్బు పిచ్చితో చేస్తున్న చేష్టలపై బాధ కలుగుతుందన్నారు. ఇన్ని తప్పులు చేస్తూ బురదను అంటించుకున్న రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా సమాజానికి ఏం చెబుతాడు?

చంద్రబాబు బాగోతాలపై అక్షరం రాయరేం? :
- పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్లు చంద్రబాబు అవినీతి, దగాకోరని తెలిసి అదే బురదను దివంగత వైయస్ఆర్‌పై, ఆయన కుటుంబంపై చల్లాలనే ప్రయత్నిస్తున్న రామోజీరావు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

- అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు చంద్రబాబు హయాంలో 65 ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, తన అనుచరులకు పప్పుబెల్లాల్లా అప్పగిస్తే రామోజీరావు కళ్లు మూసుకున్నాడా? ఐఎంజీ కుంభకోణంపై ఈనాడులో వార్తలు ఎందుకు రాయరు. హైదరాబాద్‌లో 8,500 ఎకరాలను ఎకరా రూ.50వేల చొప్పున అప్పగిస్తే అడిగేవారే లేరా? తడిగుడ్డతో గొంతు కోసే చంద్రబాబుకు రామోజీరావు వత్తాసు పలకడం ప్రజలు గమనిస్తున్నారు.

- కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడదీస్తే, ఆ పాపంలో కాంగ్రె‌స్‌కి ఎంత భాగం ఉందో చంద్రబాబుకు, టీడీపీకి అంతే భాగస్వామ్యం ఉంది. కాంగ్రెస్‌ను కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు నాలుగేళ్లుగా కౌగిలించుకుని తిరుగుతున్నాడు. రెండెకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు, ఆయన కొడుకుకు దేశ విదేశాల్లో కోట్లాది విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని రామోజీరావు ఈనాడులో రాయచ్చుగదా?

‌- నీతి, నిజాయితీలతో పాటు విలువలతో నా తండ్రి పెంచారు. విశ్వసనీయతతో బతుకుతున్న కుటుంబం మాది. మాకు ప్రజా అండదండలు ఉన్నంత కాలం ఏ శక్తులూ మమ్మల్నేం చేయలేవు. రామోజీరావు మామీద ఎన్ని రోత రాతలు రాసినా... వైయస్ఆర్ కుటుంబం ఎలాంటిదో ప్రజలకు బాగా తెలుసు.

చంద్రబాబును‌ఎన్టీఆ‌ర్ అభిమానులు క్షమించరు :
ఎంతో ప్రయాసపడి పార్టీని స్థాపించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడు ఎన్టీరామారావుపై చెప్పులేయించి పార్టీ నుంచే బయటకు వెళ్లగొట్టిన నీచమైన రాజకీయ నేత చంద్రబాబు అని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. పిల్లనిచ్చి పెళ్లిచేయడమే కాకుండా, రాజకీయ భిక్ష పెట్టిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు జీవితాంతం నమ్మరని, తెలుగు ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆమె హెచ్చరించారు.

Back to Top