ఒక్క మంచిపనీ చేయకుండా ఓట్లెలా అడుగుతారు

ఖమ్మం:

ఐదేళ్ళు అధికారంలో ఉండి ప్రజల సమస్యలు అస్సలు పట్టించుకోకుండా విస్మరించిన కాంగ్రెస్‌ను కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు..‌ దాన్ని భుజాన వేసుకుని మోసి రక్షణ కవచంలా కాపాడారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. స్వయంగా తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్క మంచి పథకమైనా ప్రవేశపెట్టారా? అని నిలదీశారు. ప్రజలకు ఏ ఒక్క మంచిపనీ చేయని చంద్రబాబు తన పాలనను తిరిగి తీసుకువస్తానని చెప్పుకుని ఓట్లు అడిగే ధైర్యం ఉందా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ‌'వైయస్ఆర్ జనభేరి' ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా మూడవ రోజు మంగళవారం ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మళ్లీ శుష్క వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనేమైనా మహానేత డాక్టర్ వై‌యస్ఆర్‌లా పేదల కోసం ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చారా? 108, 104, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, జలయజ్ఞం, ఉచిత విద్యు‌త్ లాంటి అద్భుత‌మైన పథకాలు ప్రవేశపెట్టారా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. పేనుకు పెత్తనం ఇస్తే.. తలంతా గొరిగినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మన గొయ్యి మనం తీసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు.

ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటేసే ముందు ఒక్క నిమిషం మీ గుండెల్లో గూడుకట్టుకున్న రాజన్నను గుర్తు తెచ్చుకోండని ప్రజలకు శ్రీమతి షర్మిల సూచించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.‌ ఈ ప్రచారయాత్రలో శ్రీమతి షర్మిల వెంట ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల వై‌యస్ఆర్‌సీపీ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైయస్ఆర్‌సీపీ మద్దతుతో భద్రాచలం సీపీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న సున్నం రాజయ్య పాల్గొన్నారు.

Back to Top