సీమాంధ్ర నుంచి వారిని తరిమికొట్టండి

నెల్లూరు:

చంద్రబాబు నాయుడికి పెత్తనం ఇస్తే రాష్ట్రంలో మళ్ళీ చంద్రగ్రహణం పడుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హెచ్చరించారు. జగనన్న నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుదామని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి ఓట్లేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్లను చేసి మంత్రి పదవి కోసం చిరంజీవి తన పార్టీని బహిరంగంగా కాంగ్రెస్‌కు అమ్మేస్తే, చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని అదే కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు.

మంచివాడనుకుని ఎన్‌టీఆర్ పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి కుర్చీని, పార్టీని, అధికారాన్ని లాక్కున్నా‌రని అన్నారు. చివరకు ఆయన మీద చెప్పులు కూడా వేయించారన్నారు. చంద్రబాబుకు మించిన సైకో ఎవరైనా ఉన్నారా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగుతల్లి గొంతు కోసిన చంద్రబాబు నాయుడు, చివరి క్షణం వరకు సీఎం పదవి వదలకుండా విభజనకు సహకరించి తెలుగుతల్లికి వెన్నుపోటు పొడిచిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ తెలుగుజాతి ద్రోహులు, చరిత్రహీనులని విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులు సీమాంధ్రలో కనపడితే తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

ప్రజా సంక్షేమానికి పాడె కట్టిన కిరణ్ :
- ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, సీఎం అంటే ప్రజల గురించి ఎలా ఆలోచన చేయాలి.. తన ప్రజల కోసం ఎలాంటి పథకాలు రూపొందించాలని ఆలోచించిన వైయస్ఆర్ అ‌నే ఒక్క పదం భావితరాలకు మార్గదర్శకంగా నిలిచింది. అప్పటి వరకు సుభిక్షంగా ఉన్న రాష్ర్టం ఆ ఒక్క మనిషి వెళ్లిపోవడంతో అతలాకుతలమైంది. ఆ తర్వాత  ప్రభుత్వం బతికుందా చచ్చిందా అనేలా కిరణ్ వ్యవహరించారు. సంక్షేమ పథకాలకు పాడె కట్టారు.
‌- రైతులను కిరణ్ ఏనాడూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలిస్తానన్న కిర‌ణ్ ఆ పథకం మీద తన బొమ్మ పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవడానికే వాడుకున్నారు. పేద విద్యార్థులకు ఫీజు కట్టకుండా ఆ పథకం కింద వారికి డబ్బులు ఎగ్గొట్టడానికి ఎన్నో మార్గాలు వెదుక్కున్నారు.
‌- ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలను, 97 ఆస్పత్రులను తొలగించారు. పక్కా ఇళ్ల పథకానికి పాడె కట్టిన కిరణ్ ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయకపోగా,‌ మహానేత వైయస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లకే బిల్లులు చెల్లించలేదు.

 తొమ్మిదే‌ళ్ళేం చేశావ్ బాబూ.. :
- చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన రాక్షస రాజ్యాన్ని తలపిస్తుంది. అంగన్‌వాడీ మహిళలు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పెంచాలని కోరితే కనీసం మెస్‌చార్జీలు కూడా పెంచలేదు. ఊళ్లో పింఛన్ పొందుతున్న వారిలో ఎవరైనా చనిపోతేనే.. వారి స్థానంలో కొత్తవారికి పింఛ‌న్ ఇచ్చేవారు.
‌- చంద్రబాబు ఎనిమిదేళ్ళలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కరవు కాలంలో తాము కట్టలేమంటూ ఎవరైనా అంటే.. చార్జీలు వసూలు చేయడానికి ప్రత్యేక కోర్టులు పెట్టి, రైతుల మీద కేసులు పెట్టారు. కరెంటు చార్జీలు కట్టలేని వారి ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయారు. రైతులు ఇంట్లో లేకపోతే ఆడవాళ్లను పోలీసు స్టేషన్లకు తీసుకుపోతే అవమానంతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
- కరెంటు చార్జీలు తగ్గించాలని వైయస్ఆర్ ‌ఎనిమిది రోజులు నిరాహార దీక్షలు చేస్తే చంద్రబాబు పోలీసు కాల్పులు జరిపించారు. కాల్పుల్లో నలుగురు సామాన్యులు చనిపోతే వారి కుటుంబాలను కాకుండా కాల్పులు జరిపిన పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుది.

ప్రజల ఉసురు సోనియాకు తగులుతుంది :
- సోనియాగాంధీ తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరుకోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఈ ప్రజల ఉసురు తగిలి నీవు బాగుపడతావా? శ్రీకృష్ణ కమిటీ విభజన వద్దని చెప్పినా ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారు? రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు, కొత్త రాజధాని ఎక్కడ ఇస్తారో కూడా చెప్పకుండా పార్లమెంటు తలుపులు వేసుకుని రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే బీజేపీ కూడా మద్దతు పలికింది‌... అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

Back to Top