చంద్రబాబులో అబద్ధాల కళ పుష్కలం

నెల్లూరు:

అబద్ధాలు చెప్పే కళలో చంద్రబాబు నాయుడు ఆరితేరిపోయారని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. ప్రధాని పదవి తీసుకోమని చెప్పినా రాష్ట్రానికి సేవ చేయడానికి తనకొద్దనిని చెప్పానంటూ ఆయన బిల్డప్ ఇస్తున్నా‌రని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ఎవరు పిలిచి ప్రధాని పదవి తీసుకోమంటే మీకొద్దని చెప్పారు? చంద్రబాబుకు అంత సీను లేదని టీడీపీ వాళ్లకు తెలియదు అన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను ఆశీర్వదించండి అని ప్రజలకు ఆమె విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గూడూరు, నెల్లూరు నగరాలలో ఆమె రోడ్‌షోలు నిర్వహించారు. నెల్లూరు, చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డులో నిర్వహించిన ‘వై‌యస్ఆర్ జనభేరి’ బహిరంగ సభల్లో‌ శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

'మహానేత డాక్టర్ వై‌య‌స్ రాజశేఖరరెడ్డి పేరు‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, ఆయన కొడుకును అన్యాయంగా జైలుపాలు చేసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మన రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి, దానికి‌ మద్దతు ఇచ్చిన టీడీపీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వీరందరికీ తగిన బుద్ధి చెప్పండి' అని శ్రీమతి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు అవకాశం ఇస్తే మళ్లీ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన తెస్తామని ధైర్యంగా చెప్పగలమని, కానీ చంద్రబాబు మళ్లీ తన పాలన తెస్తానని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.

ఓటేసే ముందు ఒక్కసారి వైయస్‌ను తలచుకోండి :
'కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు పట్టం క‌ట్టిన తెలుగు ప్రజలను నట్టేట ముంచింది సోనియాగాంధీ. రాష్ట్రాన్ని సోనియా గాంధీ విడదీస్తే బీజేపీ దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ప్రజలు ఓటేసే ముందు రాజశేఖరరెడ్డిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా కాకుండా రాష్ట్ర ప్రజల కన్నతండ్రిలా ఆలోచించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై.. వై‌యస్‌ని ప్రజల మనసుల్లో దోషిగా నిలపడానికి ఐదేళ్లుగా ప్రయత్నించి ఆయన కొడుకు మీద కేసులు కూడా పెట్టించాయ'ని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

మహానేత పథకాలకు చంద్రబాబు కాపీ:
'రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని‌ మహానేత రాజశేఖరరెడ్డి అడిగితే.. కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావన్నారు చంద్రబాబు. వైయస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యు‌త్ అమలు చేశారు కాబట్టి బాబు ఇప్పుడు తాను కూడా ఇస్తానంటున్నారు. పేదలకు ఉచిత వైద్యం కూడా అందివ్వకుండా యూజ‌ర్ చార్జీలు వసూలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆరోగ్యశ్రీ తాను కూడా అమలు చేస్తానని చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి రైతులకు రుణాలు మాఫీ చేసినందువల్ల ఇప్పుడు తాను కూడా చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు రాజశేఖరరెడ్డి పథకాలన్నీ కాపీ కొడుతున్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే. పులి పులే‌' అన్నారు.

'లోక కల్యాణం కోసం రాజకీయాల్లో ఉన్నా అని చంద్రబాబు అంటున్నారు. ఆయన దృష్టిలో లోక కల్యాణం అంటే లోకేశ్‌ కల్యాణం అని అర్థం. తన కొడుకును పైకి తెచ్చుకోవడానికి ఎన్‌టీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అణగతొక్కే‌స్తున్నారు. ఆ కుటుంబంలో ఏ ఒక్కరినీ పైకి రానీయకుండా చేశా'ని శ్రీమతి షర్మిల అన్నారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత సీల్డు కవర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఊడిపడ్డారన్నారు. ఆయన ఏరోజూ రైతులకు నీళ్లివ్వలేదు. కొత్త ఇల్లు ఇవ్వలేదు. రేషన్‌కార్డు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, రైతులకు మద్దతు ధర ఇవ్వలేదని ఆరోపించారు. సొంతంగా ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ప్రజల మీద పన్నులు వేసి, చార్జీలు పెంచి సంక్షేమానికి పాతర వేసి, అభివృద్ధిని అటకెక్కించారు. ఆర్టీసీ చార్జీలు ఐదు సార్లు పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టకపోతే  కేసులు పెడతామని, కనెక్షన్లు కత్తిరిస్తామని బెదిరించి వసూలు చేశారు. పదవిలో ఉండగా ప్రజలను పట్టించుకోని కిరణ్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ప్రజలను ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

సమైక్య పోరాటం చేసింది వైయస్ఆర్‌సీపీయే :
సమైక్య రాష్ర్టం కోసం చివరి వరకు పోరాడింది వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీయే అని శ్రీమతి షర్మిల అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డితో పాటు, సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు సమైక్య రాష్ర్టం కోసం ధర్నాలు చేశారన్నారు. దీక్షలు చేశారు. జగనన్న అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 3 దుర్వినియోగం చేస్తోందనీ, దీన్ని అడ్డుకోవాలని జాతీయ పార్టీల నేతల తలుపులు తట్టారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడా‌రన్నారు.

రాబోయే రోజుల్లో జగనన్న పాలనలో మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును మన చేతుల్తో మనమే నిర్మించుకుందామని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి మీరిచ్చే విజయంతో కేంద్రంలో ప్రధానిని నిర్దేశించి, అవసరమైతే మెడలు వంచి సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైనవన్నీ సాధించుకుందామని అన్నారు.

Back to Top