గబ్బిలంలా వేలాడుతున్న కిరణ్: షర్మిల

మదనపల్లె, 3 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజన చేస్తున్నామని కేంద్రం సంకేతాలు ఇచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒక్కసారిగా రాజీనామాలు చేసి నిరసన తెలిసిప వైనాన్ని శ్రీమతి వైయస్‌ షర్మిల గుర్తుచేశారు. సీమాంధ్రలోని కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులంతా కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మాదిరిగా ఒకేసారి రాజీనామాలు చేసి ఉంటే విభజన నిర్ణయం ఆగిపోయిది కాదా అని ఆమె ప్రశ్నించారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయినా, ప్రజలంతా 33 రోజులుగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గబ్బిలంలా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్, టిడిపి నాయకులంతా పదవుల కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. 'సమైక్య శంఖారావం' బస్సు యాత్ర రెండవ రోజు మంగళవారం రాత్రి ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

అందరికీ సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. న్యాయం చేయలేకపోతే విభజన చేసే అధికారం కాంగ్రెస్‌కు ఎక్కడిదన్నారు. ఆ హక్కు కాంగ్రెస్‌కు ఎలా వస్తుందని నిలదీశారు. న్యాయం చేయలేరని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. అంత వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ చేసిన పాపాలు చాలవన్నట్లు ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి చలిమంట కాచుకుంటోందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. కర్నాటక నుంచి ఇప్పటికే కృష్ణా నీరు మనకు సరిగా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే కృష్ణా డెల్టాకు నీరు ఎలా వస్తుందన్నారు. అలా జరిగితే కృష్ణా డిల్టాలోని రైతు కుటుంబాల్లో ఆత్మహత్యలు పెరిగిపోవా? గ్రామాలు వల్లకాడులు మారిపోవా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ మన రాజధాని కదా అని అందరం కృషి చేస్తే ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి కనుక చదువుకున్న వారంతా ఉపాధి కోసం చూసేది హైదరాబాద్‌ వైపే అన్నారు. రాష్ట్ర ఆదాయంలో సగ భాగం వచ్చే హైదరాబాద్‌ ఒక్కరికే ఇచ్చేస్తే సీమాంధ్రలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం సీమాంధ్రను వల్లకాడు చేసేస్తారా? అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు.

తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన రోజే చంద్రబాబు గారు సీమాంధ్రులకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ సాహసం చేయడానికి కారణం చంద్రబాబు ఇచ్చిన బ్లాంక్‌ చెక్కులాంటి లేఖే అన్నారు. సీమాంధ్రుల గొంతు పట్టపగలే కోసేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ విభజనకు వైయస్‌ కారణం అని చంద్రబాబు అంటున్నారంటే ఆయన అబద్ధాలకు హద్దూ పద్దూ ఉందా? అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది మీరు కాదా? చంద్రబాబుగారూ అన్నారు. నిజం చెబితే తన తల వెయ్యి ముక్కలైపోతుందన్న మునీశ్వరుడి శాప భయంతోనే చంద్రబాబు నిజాలు చెప్పరని వైయస్ఆర్‌ చెప్పేవారన్నారు.

రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారని శ్రీమతి షర్మిల అన్నారు. 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు గనకే ఆయన 7 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, పేదలు ఇలా ప్రతి వర్గానికీ ఆయన లబ్ధి చేకూర్చారన్నారు. ప్రజలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచించారు గనుకే పేదలకు ఎన్నెన్నో పథకాలను రూపొందించి, బ్రహ్మాండంగా అమలు చేశారన్నారు.

జగనన్న త్వరలోనే వస్తారని, మనందరినీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని తెలిపారు. అంతవరకూ జగనన్నను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు. శ్రీమతి షర్మిల సభా ప్రాంగణంలో ప్రజలు ఇసుక వేస్తే రాలనంత అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆమె చెప్పే ప్రతి మాటకూ ఆహూతుల నుంచి విశేష స్పందన వచ్చింది. శ్రీమతి షర్మిల రాక కోసం సుమారు నాలుగైదు గంటల పాటు అభిమానులు, పార్టీ శ్రేణులు సభా ప్రాంగణంలోనే ఎదురు చూశారు.

Back to Top