సీమాంధ్రుల అభిప్రాయాలు పట్టించుకోరేం?

హిందూపురం (అనంతపురం జిల్లా),

4 సెప్టెంబర్ 2013: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి ఎందుకు తీసువడం లేదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌అధినాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్ర బుధవారం సాయంత్రం హిందూపురం చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి ఆగిపోదా? విభజనతో ఈ రాష్ట్రం ఎడారిగా మారిపోదా? అని నిలదీశారు. కృష్ణా, గోదావరి నదుల ఎగువన ఉన్న రాష్ట్రాల ప్రాజెక్టులతో ఇప్పటికే మన రాష్ట్రం నీళ్లు లేక సతమతం అవుతున్నామని ఆమె విచారం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్ళు వదలని పరిస్థితి ఉందన్నారు.

పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలు ఒక లెక్కా అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.  సీమాంధ్రుల గొంతు పట్టపగలే కోసిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోరా అన్నారు. ఈ విభజనకు కారణమే చంద్రబాబుగారు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటికీ రాష్ట్ర విభజనకు బ్లాంక్ చె‌క్కు లాంటి లేఖ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలనిని చంద్రబాబును ఆమె కోరారు. తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని దండగ చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు అధికారం ఇమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక వైపున రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చెబుతూనే మరో పక్కన బస్సు యాత్ర చేస్తున్నారని చంద్రబాబుపై శ్రీమతి షర్మిల మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడికి నిజంగా నిజాయితీ ఉంటే.. నిజంగానే మనిషైతే.. సీమాంధ్ర గడ్డ మీద పుట్టిన వాడైతే.. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం పార్టీలతో పాటు నాలుగవ పార్టీగా నిలబడాలని సూచించారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించాలి, తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అనంతపురం జిల్లా ప్రజలకు సాగునీరు కాదు కదా కనీసం తాగునీటి ఇక్కట్లు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పనక్కర్లేదు. మన రాష్ట్ర చరిత్రలో ఇంత మంది ముఖ్యమంత్రులు ఉండి కూడా ఏ ఒక్కరైనా అనంతపురం జిల్లా నీటి సమస్య గురించి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఈ జిల్లాలోని 70 శాతం మందికి తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపించారని గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డిగారు బ్రతికే ఉంటే మిగిలిన 30 శాతం మందికి కూడా పరిష్కారం చూపించేవారన్నారు.

హిందూపురం ప్రాంతానికి సంబంధించి రూ. 600 కోట్లు ఖర్చు పెట్టి నీటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేశారని తెలిపారు. ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్టుకు కొన్ని ట్రయల్‌ రన్లు కూడా చేశారన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతులు చేస్తుండగానే రాజశేఖరరెడ్డిగారు మన మధ్య నుంచి వెళ్శిపోయారన్నారు. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ పనులు పూర్తిచేయలేదన్నారు. దానితో సాగునీరు, తాగునీరు రావడం లేదన్నారు. ఈ పాపం కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాదా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత కళకళలాడిందో, ఎంత సుభిక్షంగా ఉండేదో తాను చెప్పనక్కరలేదని శ్రీమతి షర్మిల అన్నారు. ఆయన వెళ్ళిపోయిన ఈ నాలుగేళ్ళలో మన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎలా తయారైందో ప్రజలు చూస్తున్నారన్నారు. రైతులకు నీళ్ళు లేవు, ఉచిత విద్యుత్‌ లేదు, మద్దతు ధర అంతకన్నా లేదని విచారం వ్యక్తంచేశారు. మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు అన్ని వర్గాల ప్రజలు బ్రతకడానికి కష్టంగా ఉందని బావురుమంటున్నారన్నారు. వైయస్‌ పథకాలకు తూట్లు పొడుస్తున్న వీళ్ళు అసలు మనుషులేనా? అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాలనలో సువర్ణయుగం నడిచిందని‌ శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. ఏ ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన చేశారన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వైయస్ఆర్ అద్భుతంగా అమలు చేశారని తెలిపారు. ఇప్పుడున్న కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అన్ని ఛార్జీలు అడ్డదిడ్డంగా పెంచేసిందన్నారు.  పేదవాడు ఛార్జీలు కట్టలేక చతికిలపడుతుంటే కాంగ్రెస్‌ పార్టీ వారిని చూసి నవ్వుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిప్పు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ చలి కాచుకుంటోందని శ్రీమతి షర్మిల మండిపడ్డారు.

చేసిన పాపాలు సరిపోనట్లు ఇప్పుడు మన రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్లు రెండు ముక్కలు నరుకుతోంది కాంగ్రెస్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటోందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెబుతోందని, అయితే, మధ్యలో మరో రాష్ట్రం వస్తే.. గోదావరి నీళ్ళను అడ్డుకుంటే ఆ ప్రాజెక్టును ఏ నీళ్ళతో నింపుతుందో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలన్నారు.

గతంలో మద్రాసును తీసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా సీమాంధ్రులకు దూరం చేస్తామని చెప్పడం న్యాయమా? అని శ్రీమతి షర్మిల నిలదీశారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా? అని ప్రశ్నించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉంటే సీమాంధ్రులకు భాగం లేదు వెళ్ళిపొండి అనడం న్యాయమా అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి 60 ఏళ్ళు పట్టిందని, సీమాంధ్రలు కొత్త రాజధానిని పదేళ్ళలో కట్టుకుని వెళ్ళిపొమ్మంటే అదెలా సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యే పదవులను వదిలిపెట్టి ఉంటే రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చేది కాదని శ్రీమతి షర్మిల అన్నారు. అప్పుడు దేశం అంతా మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసేదని, విభజన ప్రక్రియ ఆగిపోయేదన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుందామన్న ఇంగితం, జ్ఞానం కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులకు లేకపోయిందని దుమ్మెత్తిపోశారు.

ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలాగా అందరికీ న్యాయం చేసే నిర్ణయం ఉండాలనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మొట్ట మొదటి నుంచీ ఒకే మాట చెబుతున్నదని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. కాంగ్రెస్‌ వైఖరేమిటని, అందరితో చర్చించాలని లేఖలు రాస్తూనే ఉన్నామని, చెబుతూనే ఉన్నామన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ మర్చిపోయి వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. న్యాయం చేయలేకపోతే.. విభజించే అధికారాన్ని, బాధ్యతను ఎందుకు తీసుకున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తోందన్నారు. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే.. విభజించే హక్కు మీకు ఎక్కడ ఉందని కాంగ్రెస్‌ను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నిలదీస్తోందన్నారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌కు చేతకాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

సమైక్య ఉద్యమం మొదలయ్యింది అనంతపురం జిల్లాలోనే అని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. జిల్లాలో ఆందోళనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామని చెప్పారు.

Back to Top