దమ్ము లేకే గుర్తులపై ఎన్నికలు పెట్టలేదు

ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా),

25 జూలై 2013 : కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తు‌లతో నిర్వహించేదని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అన్నారు. తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఉంటే పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తుల మీద నిర్వహించాలని డిమాండ్ చేసి ఉండేదన్నారు. తన ప్రసంగం ఆసాంతమూ ఆమె కాంగ్రెస్, టిడిపిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు తాము ఎక్కువ పంచాయతీలు గెలిచామంటే తాము ఎక్కువ గెలిచామంటూ తమ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటున్నారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. పార్టీ గుర్తుల మీద జరగని పంచాయతీ ఎన్నికల్లో ఎవరెన్ని గెలుచుకున్నారో చెప్పడం చాలా కష్టం అన్నారు. అందుకే కాంగ్రెస్, టిడిపి నాయకులు ఉబ్బితబ్బిబ్బైపోయి ఎవరికి వారే తామే ఎక్కువ గెలిచామని చెప్పుకుంటున్నారని అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల గురువారం నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్‌ సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

అసలు ఎన్నికలంటేనే చంద్రబాబుకు, కాంగ్రెస్‌ వాళ్ళకూ వెన్నులో వణుకు పుడుతోందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజా న్యాయస్థానంలో ప్రజలు ఇచ్చే తీర్పును వినే సాహసం కూడా వీరికి లేదన్నారు. అందుకే 15 మంది ఎమ్మెల్యేలు గత మార్చి నెలలో తమ పార్టీల విప్‌ను ధిక్కరించి, జగనన్న పిలుపు మేరకు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తే.. వారిని ఆ నెలలోనే అనర్హులుగా చేయకుండా జూన్‌ వరకూ లాగదీసి, సాగదీశాయని ఎద్దేవా చేశారు. ఇక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలిశాక వేటు వేశారని చెప్పారు. ఉప ఎన్నికలు పెడితే అన్ని సీట్లూ వైయస్ఆర్‌ కాంగ్రెస్సే కైవసం చేసుకుంటుందని వారికి తెలుసన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు కనీసం డిపాజిట్లు కూడా రావని వారికి తెలుసన్నారు. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు కూడా భయపడే వీరిని నాయకులంటారా? లేక పిరికిపందలు అంటారా? అన్నారు.

ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.  ప్రతి ఎకరాకూ నీళ్ళివ్వాలని ఆయన కలలు కన్నారని చెప్పారు. వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చారని అన్నారు. రైతులకు మద్దతు ధర, ఇన్‌పుట్‌ సబ్సిడీ, అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 1200 కోట్ల విద్యుత్‌ బకాయిలు మాఫీ చేశారన్నారు. రైతుల రుణాలపై ఉన్న రూ. 1300 కోట్ల వడ్డీని మాఫీ చేశారన్నారు. ఆ తరువాత రైతులకు రూ. 12,000 కోట్ల రుణ మాఫీ కూడా చేశారన్నారు.

రైతులు, మహిళలకు చంద్రబాబు రూపాయి వడ్డీకి రుణాలు ఇప్పించేవారని, మహానేత వైయస్ఆర్ అధికారంలోకి వచ్చాక పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆయన ఆసరాతో లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా స్థిరపడ్డారని అన్నారు. డబ్బు లేని కారణంగా ఏ విద్యార్థి చదువూ ఆగిపోకూడదని ఓపెన్‌ కేటగిరీలో ఉన్న వారిని కూడా ఆర్థికంగా వెనుకబడిన వారిగా ప్రకటించి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని అమలు చేశారన్నారు. ఆ పథకం ద్వారా ఉన్నత విద్యలను ఉచితంగా చదువుకున్న ఎందరో ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్దారని, తమ తమ కుటుంబాలకు ఆసరాగా ఉన్నారని చెప్పారు. నిరుపేదలు కూడా గొప్ప వైద్యాన్ని ఉచితంగానే చేయించుకోవాలని వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారన్నారు. దానితో రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పేద రోగులు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఖరీదైన శస్త్ర చికిత్సలు కూడా చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారని చెప్పారు. ఏ పథకాన్ని చూసినా రాజశేఖరరెడ్డి అద్భుతంగా చేసి చూపించారన్నారు.

ఎన్నెన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఒక్క పన్నుగాని, చార్జీ గాని పెంచలేదని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. ఏది పెంచినా తన అక్క చెల్లెళ్ళ మీద భారం పడుతుందని రాజశేఖరరెడ్డి చెప్పేవారన్నారు. గ్యాస్‌, విద్యుత్‌ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్‌ పన్నులు పెంచలేదన్నారు. మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం అంటే చిన్నచూపు అని ఆరోపించారు. ఈ దుర్మార్గపు పాలనలో రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్‌ లేదు.. సాగునీరు లేదు.. మద్దతు ధరా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క రైతుకైనా కిరణ్‌ ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదని విచారం వ్యక్తంచేశారు. వేసిన పంటకు నష్టం వచ్చిందని, అప్పుల పాలైపోయామని ప్రతి జిల్లా రైతులూ గగ్గోలు పెడుతున్నారన్నారు. అన్ని ధరలూ, చార్జీలూ పెరిగిపోయాయని మహిళలు ఆవేదన చెందుతున్నారన్నారు.

‌ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్సుమెంటు కుంటుపడిందని, ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందని, 108, 104 కనుమరుగైపోయాయి, పక్కా ఇళ్ళ పథకానికి పాడెకట్టారని, జలయజ్ఞాన్ని అటకెక్కించిందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 7.67 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. కానీ లెక్కలు చూస్తే.. మహానేత వైయస్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలో నాలుగు విడతలుగా 6 లక్షల ఎకరాలను పంపిణీ చేశారని, ఐదవ విడత కోసం లక్ష ఎకరాలను సేకరించారని గుర్తుచేశారు. ఈ లెక్కన వైయస్ఆర్‌ హయాంలో 7 లక్షల ఎకరాలు పంపిణీ అయితే.. ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వం పంపిణీ చేసిందెంత అని ఆమె ప్రశ్నించారు. కేవలం 67 వేల ఎకరాలను మాత్రమే పంపిణీ చేయగా మంత్రి గొప్పలు ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. పేదలంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ఆమె అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 22.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిందని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన విషయం నిజానికి శుద్ధ తప్పు అని శ్రీమతి షర్మిల తెలిపారు. రికార్డుల ప్రకారం చూస్తే.. రాజశేఖరరెడ్డి ఉండగానే 21 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చారని చెప్పారు. అంటే వీళ్ళిచ్చింది కేవలం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే అని వివరించారు. ఎవరూ సంపాదించిన కుర్చీ మీద కూర్చుని అధికారం అనుభవించడం, ఎవరో చేసిన మంచి పనులకు తాము గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘన కార్యమని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు.

వైయస్ఆర్‌ బ్రతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఉండేవారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగా మన రాష్ట్రంలో అసలు కరెంటే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కనీసం మూడు గంటలు కూడా ఉచిత విద్యుత్‌ను ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదని ఆరోపించారు. అది కూడా ఒక్కసారిగా కాకుండా ఎప్పుడెప్పుడు ఇస్తారో చెప్పలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. లేని కరెంటుకు మూడు రెట్లు బిల్లులు వేస్తున్నది కిరణ్‌ ప్రభుత్వం అని చెప్పారు. కరెంటు నిల్లు.. బిల్లు ఫుల్లు అనే రీతిలో మన పరిస్థితి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కరెంటు ఇవ్వకుండా బిల్లులు పెంచి వసూలు చేయడం భావ్యం కాదని ముఖ్యమంత్రికి ఇంగితం లేదో, అర్థం చేసుకోవడంలేదో అర్థం కావడం లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఏకంగా రూ. 32 వేల కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో కిరణ్‌ ప్రభుత్వం ప్రజల రక్తం పిండి మరీ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు.

ఈ దుర్మార్గపు పాలన, చార్జీల మోత, కరెంటు కోతలకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విప్‌ జారీ చేసి మరీ ఈ ప్రభుత్వాన్ని కాపాడారని శ్రీమతి షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల పక్షాన కాకుండా ప్రభుత్వానికి అండగా నిలిచారని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసి తీరా సమయం వచ్చినప్పుడు ప్లేటు ఫిరాయించి దుర్మార్గపు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోకుండా చేతులు అడ్డం పెట్టి కాపాడారని నిప్పులు చెరిగారు. ఇలాంటి చంద్రబాబును నాయకుడనాలా? ఊసరవెల్లి అనాలా? అని ప్రశ్నించారు.

ఒక్క మంత్రి పదవి కోసం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు రాసిచ్చేశారని, మరి చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీని తెర వెనుక రాసిచ్చేశారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, ప్రాజెక్టులు కడితే నష్టం అని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు.. సబ్సిడీలు ఇస్తే సోమరిపోతులవుతారని హేళన చేశారన్నారు. రూ. 50 ఉన్న హార్సు పవర్‌ విద్యుత్‌ను రూ. 625 చేశారన్నారు. అన్ని చార్జీలూ పెంచడమే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదల నుంచి కూడా యూజర్‌ చార్జీలు వసూలు చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. స్కాలర్‌షిప్పులు ఇమ్మని కోరిన విద్యార్థులను లాఠీలతో కొట్టించారన్నారు.

చంద్రబాబు చేసిన అవమానాలను తట్టుకోలేక వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక లక్షన్నర రూపాయలు నష్టపరిహారంగా అందజేశారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చేసినవి గానీ, చంద్రబాబు స్వయంగా ఇచ్చిన వాగ్దానాలను గాని ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఆడపిల్ల పుడితే రెండు లక్షలిస్తానని, ఉచిత విద్యుత్‌ ఇస్తానని, ఫీజు రీయింబర్సుమెంటు చేస్తానని, రుణ మాఫీ చేస్తానని, ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని అవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అంటే ఆయన సమాధానం చెప్పడం లేదన్నారు. దున్నపోతా.. దున్నపోతా.. ఎందుకు దున్నలేదు.. అంటే... పగలు ఎండ.. రాత్రి చీకటి అందట. ఇదే చందంగా ఉంది చంద్రబాబ తీరు అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న పనిచేయరు.. అధికారం ఇచ్చినా పనిచేయరని విమర్శించారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టిడిపి నాయకులకు లేవని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. అందుకే ప్రతి ఎన్నికలలోనూ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కవుతూనే ఉన్నాయన్నారు. చివరికి జగనన్న విషయంలో కూడా కుమ్మక్కై, కుట్రలు పన్ని, అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి అక్రమంగా జైలుపాలు చేశారని ఆరోపించారు. బోనులో ఉన్నా సింహం సింహమే అని, సూర్యుడ్ని, జగనన్నను ఆపడం కాంగ్రెస్, టిడిపి నాయకుల తరం కాదని ధీమాగా చెప్పారు.

జగనన్న త్వరలోనే వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారని శ్రీమతి షర్మిల తెలిపారు. రాజన్న ప్రతి కలనూ జగనన్న నెరవేరుస్తారన్నారు. రాజన్న అమలు చేసిన ప్రతి పథకాన్నీ జగనన్న అమలు చేస్తారని హామీ ఇచ్చారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చిన తరువాత అమలు చేసే పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి శ్రీమతి షర్మిల వివరించారు. అంత వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని, ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలోను, త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలోనూ, మరి కొన్ని నెలల్లో రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్ళీ సువర్ణయుగాన్ని తెచ్చుకోవాలంటే.. ప్రజలు తమ ఓటుతో నాంది పలకాలని పిలుపునిచ్చారు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని వృథా చేయవద్దని అన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌కు, టిడిపికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

ఈ బహిరంగ సభకు వైయస్ అభిమానులు, కార్యకర్తలు‌ స్థానికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీమతి షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభా ప్రాంగణం 'జై జగన్‌' నినాదాలతో మార్మోగిపోయింది.

Back to Top