మీది కాని పదవిపై అంత మోజెందుకు?

కనిగిరి (ప్రకాశం జిల్లా),

10 సెప్టెంబర్ 2013: మన రాష్ట్రాన్ని చీలుస్తున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం మీకు చెప్పి చేసిందా? లేక చెప్పకుండా? చేసిందా? అని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఆ విషయం తెలిస్తే.. మీరు ఎందుకు గోప్యంగా ఉంచారో సమాధానం చెప్పండని నిలదీశారు. మీతో చర్చలు జరపకుండానే, మీకు చెప్పకుండానే కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చాలని నిర్ణయం తీసుకుందా? అని ప్రశ్నించారు. అంటే మీ అధిష్టానం దృష్టిలో మీరు అంత పనికిమాలిన వారా? అని ఎద్దేవా చేశారు. మీకు అంత సీన్‌ లేదని మీ పార్టీ అభిప్రాయమా? అన్నారు. లేకపోతే మీతో సంప్రదించిన తరువాతే.. మీ ఆమోదంతోనే మన రాష్ట్రాన్ని చీల్చాలని నిర్ణయం తీసుకుందా? సమాధానం చెప్పండి ముఖ్యమంత్రిగారూ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి చర్చి సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీది కాని పదవిపై మీకు అంత మక్కువ ఎందుకు కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీలుస్తున్న విషయం మీకు తెలుసా? తెలియదా? సిఎం సమాధానం చెప్పాలన్నారు. కన్నతల్లి లాంటి తెలుగుతల్లికి వెన్నుపోటు పొడుస్తుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ సంకేతాలిచ్చిన రోజునే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేశారన్నారు. మరి ముఖ్యమంత్రిగారూ మీరేం చేశారని నిలదీశారు. దిష్టిబొమ్మలాగా కళ్ళప్పగించి అలాగే చూసింది మీరు కాదా ముఖ్యమంత్రి గారూ అని ఎద్దేవా చేశారు. చేసిన అన్యాయమంతా చేసేసి తరువాత ఎప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టి అన్యాయం జరిగిపోతోందంటూ చెప్పిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే మీరూ చేసి ఉంటే.. విభజన ప్రక్రియ అప్పుడే ఆగిపోయేది కాదా? అన్నారు. సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుందని ఒక్క క్షణమైనా బాధ కలిగి ఉంటే.. ఆ రోజే రాజీనామా చేసి ఉండేవారు కాదా? ముఖ్యమంత్రిగారూ అన్నారు. సిగ్గులేకుండా ఇంకా పదవిని పట్టుకుని వేళ్ళాడుతున్నారేమిటని తూర్పారపట్టారు.

ముఖ్యమంత్రి పదవి కిరణ్‌కుమార్‌రెడ్డి సంపాదించుకుంటే వచ్చిందా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్‌ పదవిని మీకు మంచి మనసుతో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చారని, ఆ తరువాతే సోనియా దృష్టిలో మీరు పడ్డారని ఆమె తెలిపారు. మీరు సంపాదించుకోని పదవి మీద ఎందుకంత మోజు? అని కిరణ్‌కుమార్‌రెడ్డిని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఇంత అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాల మీద, మీ అధిష్టానం మీద ఒక్క క్షణమైనా విరక్తి కలగలేదా కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌రెడ్డి ఉండడం మన రాష్ట్రం చేసుకున్న కర్మ కాకపోతే మరేమిటన్నారు. ఒక పక్క ఇంత చేతగాని సిఎం ఉంటే... మరో పక్కన అంతే అసమర్థుడైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.

రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అని, బంగారుతల్లి అని ప్రజల కోసం కాకుండా ప్రచారం కోసమే పథకాలు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అని శ్రీమతి షర్మిల ఆరోపించారు. మన రాష్ట్రంలో ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే మీరైనా సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రిగారూ అని నిలదీశారు.

రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు కన్నా నీచుడు, దుర్మార్గుడు మరొకరుండరని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్‌ చెక్కులాగా లేఖను చంద్రబాబు రాసి ఇచ్చారని విమర్శించారు. మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ విభజించే సాహసానికి పూనుకున్నదంటే దానికి చంద్రబాబు లేఖ, ఆయన ఇచ్చిన మద్దతే కారణం అన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు ఆత్మ అనేది ఉందా? అన్నారు. ఆ వెన్నుపోటు ఆత్మకు గౌరవం అంటూ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో అడుగుపెట్టారని చంద్రబాబును ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు రాజీనామా చేయాలని, తన పార్టీ ప్రజాప్రతినిధుల చేత రాజీనామా చేయించాలని, ఆ తరువాతే సీమాంధ్రలోకి రానివ్వాలని అన్నారు. సీమాంధ్ర గడ్డ మీద చంద్రబాబు పుట్టి ఉంటే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు. ఆ లేఖను వెక్కి తీసుకోనంత వరకూ చంద్రబాబును సీమాంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

నీళ్ళు, రాజధాని సమస్యలను పరిష్కరించకుండానే రాష్ట్రాన్ని ఘోరంగా విభజిస్తున్నారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాహుల్‌ను ప్రధానిని చేసుకోవడానికి, టిఆర్ఎస్‌ను తనలో కలుపుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రంలో చిచ్చుపెట్టిందని దుయ్యబట్టారు. ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్ట్రాని గొడ్డలితో నరికినట్లు రెండు ముక్కలు చేస్తోందని విమర్శించారు. సీమాంధ్రను కాంగ్రెస్‌ పార్టీ వల్లకాడు చేయాలనుకుంటోందా... సిఎం సమాధానం చెప్పాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల నుంచి ఎన్నికైన సిఎం కాదని, సోనియా ఎంపిక చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన రోజునే సిఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి ఉంటే విభజన నిర్ణయం ఆగిపోయేదన్నారు.

ఎన్నోపథకాలను రాజశేఖరరెడ్డిగారు తన గుండెల్లో నుంచి రూపొందించారని శ్రీమతి షర్మిల తెలిపారు. ఇంటింటి తలుపు తట్టి మరీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ అన్నారు. అనేక అద్భమైన పథకాలను అమలు చేస్తూ కూడా ఆయన ఒక్క రోజున కూడా ఒక్క చార్జీని గాని, ఒక్క ధరను కానీ పెంచని వైనాన్ని ప్రస్తవించారు. కొత్త పన్నులు వేయకుండానే అభివృద్ధి పథకాలు గొప్పగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా వైయస్ఆర్‌ నిలిచారన్నారు. మన దురదృష్టం కొద్దీ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన ప్రతి పథకానికీ తూట్లు పెట్టిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆయన ప్రతి ఉద్దేశాన్నీ విమర్శించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని చార్జీలు, ధరలు పెంచడమే కాకుండా పేదవారు నలిగిపోతుంటే చూసి నవ్వుకుంటోందని దుయ్యబట్టారు. చేసిన తప్పులు చాలవన్నట్లు ఇప్పుడు రాష్ట్ర విభజన పేరుతో తెలంగాణ, సీమాంధ్రలోని అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి, దానిలో చలికాచుకుంటోందని తూర్పారపట్టారు. నీళ్ళు ఇవ్వరట... హైదరాబాద్‌ను తీసేసుకుంటారట.. సంక్షేమ పథకాలు ఎలా నిర్వహించాలో చెప్పరట.. కానీ రాష్ట్రాన్ని మాత్రం అడ్డగోలుగా ముక్కలు చేస్తారట అని నిప్పులు చెరిగారు. స్వార్ధ రాజకీయం కోసం సీమాంధ్రనంతా ఒక మహా వల్లకాడు చేస్తారా? అని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు.

ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే.. జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని శ్రీమతి షర్మిల తెలిపారు. తాను నిర్బంధంలో ఉన్నా.. కష్టాలు పడుతున్నా ప్రజల కోసం జైలులో కూడా ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైనాన్ని శ్రీమతి షర్మిల చెప్పారు. త్వరలో జగనన్న వస్తారని, రాజన్న రాజ్యం దిశగా మనందరినీ నడిపిస్తారని ఆమె తెలిపారు. జగనన్నను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

Back to Top