ఇటలీతో లింకు మీదా? మాదా? బాబూ!

డోన్ (కర్నూలు జిల్లా),

5 సెప్టెంబర్ 2013: రాహుల్‌ను ప్రధానిని చేసుకోవాలనే స్వార్ధంతోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విమర్శించారు. కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుందని విమర్శించారు. ఇటలీకి ఇడుపులపాయకు లింకు ఉందని నిన్న చంద్రబాబు చేసిన ఆరోపణలపై శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. సోనియాతో లింకు పెట్టుకున్నది మీరా? మేమా? అన్నది ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. కాంగ్రెస్‌కు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు లింకే ఉంటే 15 నెలలుగా జగనన్న జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ హయాంలో కళకళలాడిన మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు సర్వనాశనం చేసిందని ఆమె విమర్శించారు. వైయస్ఆర్ పెట్టిన పథకాలన్నింటినీ తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా డోన్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా డోన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

రాజశేఖరరెడ్డిగారు ఒక్క రూపాయి కూడా ధరలు‌ గాని, చార్జీలు గాని పెంచకుండానే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలనూ విజయవంతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నింటి ధరలూ, చార్జీలూ విపరీతంగా పెరిగాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించిందని, సంక్షేమానికి పాడె కట్టిందని విమర్శించారు. ఈ పాలనలో రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు అన్ని వర్గాల వారూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేయడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు చదువులను మధ్యలోనే మానేసేలా చేసిన పాపం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. అన్ని ధరలూ పెంచేసి సామాన్యులు కొనలేక చతికిల పడుతుంటే చూసి నవ్వుకుంటోంది ఈ కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు.

ఇంతవరకూ చేసిన పాపాలు సరిపోలేదని మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు గొడ్డలితో నరికినట్టు అడ్డంగా రెండు ముక్కలుగా నరుకుతోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్‌ పార్టీ చలి కాచుకుంటోందని నిప్పులు చెరిగారు. తెలుగువారి ఓట్లు దండుకుని వారికే వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. తెలుగువారి భిక్షతో రాష్ట్రంలో, కేంద్రంలో గద్దెనెక్కి వారికే దగా చేయాలని చూస్తోందన్నారు.

మహారాష్ట్ర అవసరాలు తీరితో తప్ప గోదావరి నీటిని, ఆల్మట్టి, నారాయణపూర్‌ నిండితే గాని కృష్ణా నీటిని కర్నాటక కిందికి వదలని పరిస్థితిని ఇప్పుటికే మనం చూస్తున్నాం అని శ్రీమతి షర్మిల అన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే కృష్ణా నీటికి అడ్డుకుంటే సీమాంధ్ర మహా ఎడారిగా మారిపోదా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా మధ్యలో మరో రాష్ట్ర వచ్చి గోదావరి నీటిని కిందికి రానివ్వకుంటే ఆ ప్రాజెక్టును ఏ నీటితో నింపుతుందని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. గతంలో మద్రాసును లాగేసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపొమ్మంటున్నారని దుయ్యబట్టారు. అరవై ఏళ్ళపాటు కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భాగం లేదంటున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి లేదా? అన్నారు. కేవలం పదేళ్ళలో కొత్త రాజధానిని కట్టుకుని వెళ్ళిపొమ్మనడంలో న్యాయం ఎక్కడ ఉందన్నారు. పదేళ్ళలో హైదరాబాద్‌ లాంటి రాజధానిని కట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో సగభాగం వచ్చే హైదరాబాద్‌ లేక పోతే సీమాంధ్రలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి? ఉద్యోగుల జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలని నిలదీశారు.

ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిలో ఏమాత్రం చలనం లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఈ విభజనకు కారణమే చంద్రబాబుగారు అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టమని బ్లాంక్‌ చెక్కు లాంటి లేఖను చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చేశారు. ఆయన లేఖ వల్లే రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సాహసించిందన్నారు. రాష్ట్రం విభజన పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగం ఉందో టిడిపికి అంతే ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, సీమాంధ్రకు కట్టుబడి ఉండాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా విభజనను వ్యతిరేకిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎంల దారిలోకి చంద్రబాబు కూడా రావాలని అన్నారు. చంద్రబాబు, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Smt. Sharmila public meeting speach in Done in Kurnul Dist.పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు ఇప్పుడు బస్సు యాత్రకు ఏ విధంగా వస్తున్నారని ప్రశ్నించారు. ఆత్మ గౌరవ యాత్ర పేరు పెట్టుకుని వస్తున్న చంద్రబాబుకు అసలు ఆత్మ అంటూ ఉందా? అని నిలదీశారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీని లాగేసుకున్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకే కూడా వెన్నుపోటు పొడిచారు. నిజం చెప్పిన రోజునే చంద్రబాబు తల వేయి ముక్కలైపోతుందన్న మునీశ్వరుడి శాపం వల్ల ఎప్పుడూ అబద్ధాలే చెబుతారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య లింకే ఉంటే జగనన్న ఈ పాటికి ఏ ముఖ్యమంత్రో, కేంద్ర మంత్రో అయి ఉండేవారని శ్రీమతి షర్మిల అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యింది వైయస్ఆర్‌ కాంగ్రెస్సో లేక టిడిపినో ప్రజలకు బాగా తెలుసన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా లింకు పెట్టుకున్నది చంద్రబాబు అని అనేకసార్లు స్పష్టంగా వెల్లడైందన్నారు. చీకట్లో చిదంబరంతో కలిసి తన మీద ఉన్న ఐఎంజి సహా అనేక కేసులపై విచారణ జరగకుండా మేనేజ్‌ చేసుకున్నది చంద్రబాబే అన్నారు. కోట్ల మంది ప్రజలు సీమాంధ్ర ఉద్యమంలో రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేస్తుంటే.. కోట్ల మందికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తున్నా చంద్రబాబు నోరు మూసుకుని కూర్చున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికేస్తున్నామంటూ కేంద్రం సంకేతాలిచ్చిన మరుక్షణం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఒక్కుమ్మడిగా రాజీనామాలు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్‌కు లేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూ ధైర్యం ఈ కాంగ్రెస్, టిడిపిలకు లేవన్నారు. అందుకే అబద్ధపు కేసులు పెట్టి, ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై జగనన్నను జైలులో పెట్టించాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు వెన్నుదన్నుగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర సాధించే వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top