మంచినీరన్నా ఇవ్వని ప్రభుత్వం మనకెందుకు?

చోడవరం (విశాఖ జిల్లా) :

మంచినీటి కోసం వడ్డాది గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను కళ్ళారా చూసిన శ్రీమతి షర్మిల తీవ్రంగా చలించిపోయారు. తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వలేని కిరణ్ ప్రభుత్వంపై‌ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఓ ప్రధాన కేంద్రం వడ్డాది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల శనివారం వడ్డాది సమీపంలోని పెద్దేరు కాలవలో మహిళలు చెలమల నుంచి నీరు తోడుతున్న ప్రాంతాల్ని పరిశీలించారు. అక్కడకు వచ్చిన గ్రామస్తులు శ్రీమతి షర్మిలకు తమ కష్టాలను వివరించారు.

మొత్తం 15 వేల మంది జనాభా ఉన్న తమ ఊరిలో లక్ష లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకు ఒకటే ఉం‌దని, 40 శాతం మందికి మాత్రమే ఆ ట్యాంకు నుంచి నీరు సరఫరా అవుతోందని చెప్పారు. మిగతా వారంతా సమీపంలోని వ్యవసాయ బోర్లు, పెద్దేరులోని చెలమల ద్వారానే తెచ్చుకుంటున్నారని వారంతా చెప్పారు. ఉన్న ట్యాంకు ద్వారా కూడా ఉప్పునీరు, ఎర్రనీరు వస్తోందని స్థానికులు వాపోయారు. వడ్డాది గ్రామస్తుల మంచినీటి సమస్యలను విన్న శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. మంచినీరు కూడా ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం మనకు ఎందుకని ప్రశ్నించారు. త్వరలో మన ప్రభుత్వమే రానున్నదని, సమస్యలు తీరిపోతాయని, మంచిరోజులు వస్తాయని, జగనన్నను ఆశీర్వదించండని కోరారు.

Back to Top