కాంగ్రెస్‌, టిడిపిల ద్రోహం ఇకపై సాగదు

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా),

4 ఆగస్టు 2013: కాంగ్రెస్, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహం ఇక ఎంతో కాలం కొనసాగదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హెచ్చరించారు. మండే ఎండలో మహా యజ్ఞంలా రోజుకు 20, 25 కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్రలో రాజశేఖరరెడ్డిగారు ఆ రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాను, నిరీక్షణను కలిగించారు. అదే ఉద్దేశంతో.. ఆయన పాదయాత్రకు కొనసాగింపుగా మేం రైతులు, రైతు కూలీలకు, కార్మికులు, చేనేత కార్మికులకు, పేదలు, మహిళలకు, విద్యార్థులు, వృద్ధులకు, ఉద్యోగులు, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ ఈ కాంగ్రెస్‌, టిడిపిలు ప్రజలకు చేస్తున్న ద్రోహం ఎంతో కాలం కొనసాగదని చెప్పడానికి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశాం. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అవుతుందని ఒక నిరీక్షణ కల్పించడానికి చేసిన పాదయాత్ర అన్నారు. ఇది విజయ యాత్ర కాదు. నిరసన యాత్ర అని తెలిపారు. కాంగ్రెస్, టిడిపిల పాలనను ఎండగట్టడం, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల జీవితాలకు భరోసా కల్పించడమే తన  పాదయాత్ర లక్ష్యం అని స్పష్టంచేశారు. 2012 అక్టోబర్‌ 18న వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర 2013 ఆగస్టు 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన భారీ ముగింపు సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

శ్రీమతి షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే...
ఇచ్ఛాపురం ప్రజలకు, మా కోసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలను, నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి దానితోనే కుమ్మక్కై నిస్సిగ్గుగా చేస్తున్న నీచమైన రాజకీయాలను ఎండగట్టడానికి దేవుని దీవెనలతో.. నాన్న ఆశీస్సులతో.. ఇడుపులపాయ నుంచి జగనన్న వదిలిన ఈ బాణం 3,000 కిలోమీటర్లకు పైగా పయనించి ఇచ్ఛాపురంలో నాన్న పాదయాత్రకు గుర్తుగా నిలిచిన ఈ విజయ విజయ స్తూపం సాక్షిగా, సభకు హాజరైన అందరి సాక్షిగా ఈ రోజు గమ్యం చేరుకుంది. జగనన్న తరఫున చేస్తున్న ఈ మరో ప్రజాప్రస్థానానికి స్ఫూర్తి రాజశేఖరరెడ్డిగారు చేసిన ప్రజా ప్రస్థానమే.

రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమైన రోజునే మనందరికీ పండగ. ఈ కుట్రలను, కుతంత్రాలను, ఈ రాక్షసులను ఓటు అనే ఆయుధంతో మీరు సంహరించిన రోజే మనందరికీ నిజమైన పండగ. 2009 సెప్టెంబర్‌ 2న రాజశేఖరరెడ్డిగారు పయనిస్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైందని వార్త వినగానే మన రాష్ట్రంలో కోట్ల కొలదీ గుండెలు తమ ఆత్మ బంధువు కోసం తల్లడిల్లిపోయాయి. రాజశేఖరరెడ్డిగారు క్షేమంగా తిరిగి రావాలని మతాలకు అతీతంగా ఎన్నో ప్రార్థనలు జరిగాయి. గుండెలు చిక్కబట్టుకుని, నిద్రాహారాలు మాని, మళ్ళీ ఆ మనసున్న మారాజు చేనేతన్నల నేసిన తెల్లని పంచెకట్టులో... చిక్కని చిరునవ్వుతో.. చెయ్యి ఊపుతూ ప్రజల మధ్యకు రావాలని, అది తమ కళ్ళారా చూడాలని లక్షల గుండెలు ఎదురు చూశాయి. ఎక్కడి నుంచి పుట్టిందీ అంతటి ఆప్యాయత! ఎక్కడి నుంచి పొంగిందీ అంతటి అభిమానం! ఆయన ఎవరి బంధువు! గుండె గుండెలో.. గడప గడపలో రాజశేఖరరెడ్డిగారి మీద ఎందుకంత ప్రేమ? ఇక ఆయన లేడని తెలిసి, ఇక రాడు అన్న నిజం తట్టుకోలేక మన రాష్ట్రంలో వందల గుండెలు బద్దలైపోయాయి? ప్రజలకు - పాలకుడికి మధ్య ఈ స్థాయి అనుబంధం ఎలా సాధ్యమైంది? ఒక్క మనిషి మీద రాష్ట్ర ప్రజలు ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు?

వైయస్‌ మరణం తరువాత ఇక తమకు దిక్కు లేదని రాష్ట్ర ప్రజలు అనుకోవడం ఏమిటీ... ఆయన మరణంతో వారి హృదయాల్లో రేగిన ప్రతి భయమూ నిజం కావడం ఏమిటీ.. ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఏ మనిషిని చూసినా నాలుగేళ్ళ క్రితం కంటే దిగజారిపోవడం ఏమిటీ.. ఒకే ఒక్క మనిషి వెళ్ళిపోతే.. ఆంధ్ర రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోవడం ఏమిటి? రాజశేఖరరెడ్డిగారు బ్రతికే ఉంటే మన రాష్ట్రం ఇలా కుక్కలు చింపిన విస్తరిలా అయ్యేది కాదని సామాన్యుడి నమ్మకం. రాజశేఖరరెడ్డిగారు జీవించి ఉంటే.. ఈ నాలుగేళ్ళలో ఇంకెన్నెన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఉండేవారో అని రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడి ఆలోచన.

మన రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులను చూశాం. కానీ ఒక్క రాజశేఖరరెడ్డిగారి మీదనే ప్రజలు ఎందుకంత విశ్వాసం పెట్టుకున్నారు? ఒక్క రాజశేఖరరెడ్డిగారు మాత్రమే మనసున్న మహానేతగా, ఎవరెస్టు శిఖరంలా ఎందుకని నిలిచారు? ఎందుకంటే.. రాజశేఖరరెడ్డిగారు తాను ప్రజల కోసమే పుట్టాను అని నమ్మి.. అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన జీవిత లక్ష్యం అనుకున్నారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించారు గనుక తనివితీరా సేవ చేశారు. అద్భుతమైన పథకాలు రూపొందించారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ,, 108, 104, ఫీజు రీయింబర్సుమెంటు లాంటి ఎన్నో అద్భుతమైన పథకాల ద్వారా తనకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకున్నారు. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఒక్క పన్నూ పెంచని రికార్డు సిఎంగా రాజశేఖరరెడ్డిగారు నిలిచిపోయారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత వైయస్‌దే అన్నారు. ఆఖరి శ్వాస వరకూ ప్రజాసేవలోనే తరించారు, విశ్వసనీయతకు మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిపోయారు.

కాంగ్రెస్‌ పార్టీకి రాజశేఖరరెడ్డిగారు 30 సంవత్సరాలు సేవ చేశారు. రెండుసార్లు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఏ పథకం పెట్టినా, ఏ ప్రాజెక్టు కట్టినా కాంగ్రెస్‌ నాయకుల పేర్లే పెట్టి విశ్వాసం చాటుకున్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖరరెడ్డిగారికి బహుమానంగా ఏమిచ్చింది? ఆయన పేరును దోషిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఆయన మరణించాక వెన్నుపోటు పొడిచింది. బ్రతికి ఉన్నంత కాలమూ ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడి.. ఆయన పాదయాత్ర, పథకాల నుంచి ఆయన వ్యక్తిగత ఇమేజి నుంచి లబ్ధి పొంది అధికారం అనుభవిస్తూ.. ఆయన చనిపోయిన తరువాత ప్రజల మనసుల్లో ఆయనను దోషిగా నిలబెట్టేందుకు యత్నించింది. ఆ మహానేత కుటుంబం మీద కాంగ్రెస్‌ పార్టీ రాళ్ళు వేసింది.. వేధించింది. ఆఖరికి ఆయన కొడుకుని జైలుపాలు కూడా చేసింది కాంగ్రెస్‌ పార్టీ. చనిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ హత్య చేయవచ్చని నిరూపించింది కాంగ్రెస్‌ పార్టీ. ఆయన పథకాలన్నింటికీ తూట్లు పెట్టింది.. ఆయన ఉద్దేశాలను విమర్శించింది. అన్నింటికీ మించి కనీ వినీ ఎరుగని రీతిలో గత నాలుగేళ్ళుగా టిడిపితో ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కై నీచ రాజకీయాలు నడిపింది.

ఈ నాలుగేళ్ళలో తమకు ఏమి చేశారని కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు అడిగితే.. వారు ఏమని సమాధానం చెబుతారు? వ్యవసాయాన్ని దండగ చేసిన చంద్రబాబు పాలనను మళ్ళీ తీసుకువచ్చామని చెబుతారా? జలయజ్ఞాన్ని అటకెక్కించి ఉచిత విద్యుత్‌ను మూడు గంటలకు కుదించామని చెబుతారా? ఎరువుల ధరలను 300 నుంచి 800 శాతానికి పెంచామని గొప్పగా చెబుతారా? రైతులకు పెట్టుబడులన్నీ పెరిగిపోయినా మద్దతు ధర అందించలేని అసమర్థులం మేమని చెబుతారా? ఇన్‌పుట్‌ సబ్సిడీ గాని, నష్టపరిహారం కానీ అమలు చేయలేదని చెబుతారా? ఉపాధి హామీ కింద కేవలం 20 రూపాయలు చెల్లించి ప్రజల శ్రమను దోపిడీ చేశామని కాగ్‌ తమకు సర్టిఫికెట్‌ కూడా ఇచ్చిందని చెబుతారా? వ్యాట్, రిజిస్ట్రేషన్‌, ఆర్టీసీ చార్జీలు, గ్యాస్‌ ధర.. ఇలా అన్నీ పెంచడం తమ హక్కని చెబుతారా? ఏకంగా రూ. 32 వేల కోట్లు కరెంటు చార్జీలు, సర్‌ చార్జీలంటూ ప్రజల నెత్తిన మోపి, వారి రక్తం పిండి వసూలు చేస్తున్న ఘనులం మేమని చెబుతారా? పని తక్కువ చేసి ప్రచారం ఎక్కువ చేసుకోవడం తమ పద్ధతి అని చెప్పుకుంటారా? 9 గంటలు ఉచిత విద్యుత్, 30 కిలోల బియ్యం ఇస్తామని వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టి నాలుగేళ్ళు గడిచినా సిగ్గులేకుండా దేన్నీ నిలబెట్టుకోలేదని చెబుతారా? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులను తొలగించాం, 97 ఆస్పత్రులను తీసేశాం, ఇప్పుడు సామాన్యులకు జబ్బు వస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి క్యూలో నిలబడండి అని చెబుతారా? 108, 104 సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా కనీసం డీజిల్, మందులకు కూడా డబ్బులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేశామని చెబుతారా? ఫీజు రీయింబర్సుమెంటు పథకం కింద విద్యార్థులను చదివించాల్సింది పోయి వారి జీవితాలతో బేరాలాడి లక్షలాది మందికి మొండి చేయి చూపించామని చెబుతారా?

ఒక పక్క ఇళ్ళు కట్టలేదు, మరో పక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు. కనీసం పెన్షన్‌ కూడా ఇవ్వని రికార్డు మాది అని సిగ్గు లేకుండా చెప్పుకుంటారా? రాజశేఖరరెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చి, ఆయన ప్రతి పథకానికీ తూట్లు పెట్టామని చెబుతారా? లేక ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు అనే తేడా లేకుండా అన్ని ఎన్నికల్లోనూ చంద్రబాబుతో కుమ్మక్కైపోయామని చెప్పుకుంటారా? ఏమని చెప్పుకుంటారు ఈ కాంగ్రెస్‌ నాయకుల అని అడుగుతున్నాం. ఇంతకంటే చెప్పుకోవడానికి వారి దగ్గర ఏముందని అడుగుతున్నాం' అని శ్రీమతి షర్మిల నిలదీశారు.

తాజా ఫోటోలు

Back to Top