ప్రభుత్వం పడకుండా బాబు 'అవిశ్వాసం'

సామర్లకోట (తూ.గో.జిల్లా),

16 జూన్‌ 2013: అవిశ్వాసం పెట్టాలి కాని ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పడిపోకూడదన్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఆలోచన అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను అన్నివిధాలుగా వేధిస్తున్న ఈ దుర్మార్గపు మైనారిటీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోకుండా చంద్రబాబు రక్షణ కవచంలా కాపు కాస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ సెంట‌ర్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, నాయకులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సిఎం కావాలని శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మహానేత డాక్టర్‌ వైఎస్ఆర్ బతికుంటే ఇప్పటికీ 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చేవారని శ్రీమతి షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్న సమయంలో ఏ ఛార్జీలూ పెంచలేదని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేవు, విద్యుత్‌ లేదు, అన్ని ధరలూ పెరిగాయని అన్నారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖరరెడ్డి వెళ్ళిపోయారని, ఇప్పుడున్నది దుర్మార్గపు ప్రభుత్వం అన్నారు.

కిరణ్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు నీళ్ళు లేవు, విద్యుత్‌ లేదు, పంటలకు మద్దతు ధర అంతకన్నాలేవు, అన్ని ధరలూ పెరిగాయని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్‌ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటడంలేదని దుయ్యబట్టారు. విద్యుత్‌ లేక వేలాది పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు ఉండదు కానీ బిల్లులు చూస్తే ఎవరికైనా షాక్‌ కొడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సీల్డుకవర్‌లో ఊడిపడిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని అన్నారు.

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా కంటే ఒక తండ్రిలా ఆలోచించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ప్రతి వర్గానికి మేలు జరగాలని, కులాలు, మతాలు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచించి ప్రతి కుటుంబమూ సంతోషంగా ఉండాలని తపించారన్నారు. ఆ తపనలో నుంచే ఆయన అనేక అద్భుతమైన పథకాలను రూపొందించి, అమలు చేశారన్నారు. రైతును రాజులా చూసుకున్నారన్నారు. ప్రతి ఎకరాకూ నీళ్ళివ్వాలని జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించిన మహానేత వైయస్ ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించిన వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

మహానేత వైయస్‌ కంటే ముందు సిఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు మహిళలు, రైతులకు రూపాయి వడ్డీకి రుణాలిస్తే... రాజన్న ముఖ్యమంత్రి అయ్యాక పావలా వడ్డీకే రుణాలిచ్చారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. మహానేత హయాంలో బ్యాంకు ముఖం కూడా చూడని లక్షలాది మహిళలు పావలా వడ్డీ రుణాలు తీసుకుని చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించారన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువూ ఆగిపోకూడదని ఫీజు రీయింబర్సుమెంటు చేశారని చెప్పారు. రాజన్న ఇచ్చిన భరోసాతోనే లక్షలాది మంది పేద విద్యార్థులు ఉచితంగానే ఉన్నత చదువులు చదివి ఇప్పుడు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారని అన్నారు. కార్పొరేట్‌ వైద్యానికి పేదవాడు కూడా అర్హుడే అని ఉచితంగా వైద్యం చేయించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో 71 లక్షల మందికి వైయస్‌ పింఛన్లు ఇచ్చారన్నారు.

మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు, ఆపైన సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్నాయని శ్రీమతి షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌, టిడిపిలకు ఎందుకు ఓటు వేయాలని ఆమె ప్రశ్నించారు. చిన్నవ్యాపారులకు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఎఫ్.డి.ఐ. విషయంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కయిన విషయం నిజమా కాదా? అని అన్నారు. వ్యవసాయం దండగ అని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని చంద్రబాబు అన్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. పిల్లనిచ్చిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి కుర్చీని లాగేసుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు నిజం చెప్పే గుణం లేదన్నారు. జగనన్న విషయంలో చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కుమ్మక్కయిన మాట వాస్తవమా కాదా? అన్నారు.

కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కాక ముందు కాకుండా విలీనం అయిన తరువాత, కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలోని అసలు ఉద్దేశం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అన్నారు. దారుణంగా పెంచేసిన విద్యుత్‌ చార్జీలు కట్టలేకపోయిన రైతులను చంద్రబాబు దారుణంగా హింసించారన్నారు. స్కాలర్‌షిప్‌లు అడిగిన పాపానికి విద్యార్థులను లాఠీలతో కొట్టించిన ఘనుడు చంద్రబాబు అని శ్రీమతి షర్మిల దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదల నుంచి కూడా యూజర్‌ చార్జీలు వసూలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. కళ్ళార్పకుండానే వెయ్యి అబద్ధాలు చెప్పగల సమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే మన రాష్ట్రం మాడి మసైపోవడం ఖాయమని శ్రీమతి షర్మిల ప్రజలను హెచ్చరించారు.

తనకు ఓట్లు వేసిన ప్రజలను దగా చేసి కాంగ్రెస్‌ పార్టీకి చిరంజీవి బహిరంగంగా అమ్ముడుపోయారని శ్రీమతి షర్మిల విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను పిచ్చివాళ్ళను చేసి, రహస్యంగా అదే కాంగ్రెస్‌కు టిడిపిని గంపగుత్తగా అమ్మేశారని ఆరోపించారు.

ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంటున్నారనే జగనన్నను అబద్ధపు కేసులు పెట్టి జైలులో నిర్బంధించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని ఆపలేనట్లే జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరన్నారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారని, రాజన్న రాజ్యం స్థాపించే దిశగ మనందర్నీ నడిపిస్తారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా అమలు చేయనున్న పథకాలను, రాజన్న పథకాలు కొనసాగించే పథకాలను శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

Back to Top