తెలంగాణకు వ్యతిరేకం కాదు: షర్మిల

శ్రీకాకుళం, 1 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజనపై అభ్యంతరాలు లేవని.. ఇరు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలన్నదే తమ విధానం అని శ్రీమతి వైయస్ షర్మిల‌ అన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం అధికారంలో ఉన్న పాలకులు సంక్షేమం, అభివృద్ధిలో సమతూకం పాటించకపోవడం వల్లనే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. జాతీయ చానల్‌ 'హెడ్‌లైన్సు టుడే' తో శ్రీమతి షర్మిల గురువారంనాడు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో నడుస్తూనే మాట్లాడారు. వైయస్ఆర్ ఆలోచనా విధానం నుంచి బయటికి వచ్చి, ఆయన అమలు చేసిన పథకాలను తుంగలో తొక్కడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి గాడి తప్పకుండా ఉంటే బాగుండేదన్నారు.

డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ఙి మధ్య సమతూకాన్ని చక్కగా పాటించారని అందువల్ల తెలంగాణ, నక్సలిజం వంటి సమస్యలు అణిగిపోయాయని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయనలా సమర్థవంతంగా పనిచేయడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 70 శాతం గ్రామీణ ప్రాంతమేనని, ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని నదీజలాలను కరువు ప్రాంతాలకు మళ్ళించాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించారు. నదీజలాలను వినియోగించుకోకపోతే కరువు వస్తుందని చెప్పారు. అలా కరువు రావడాన్ని ఎవరూ స్వాగతించబోరన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తుందని, సాఫ్టువేర్‌తో పాటు అనే మల్టీ నేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని శ్రీమతి షర్మిల తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా మార్చివేసిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి రెండూ కలిసి డ్రామాలాడాయని, తమ స్వార్థం కోసం ఆ రెండు పార్టీలు డబుల్‌గేమ్ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ఆ పార్టీలది 'మేనేజ్‌ షో' అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పక్షం అని, ఇలాంటి కష్టకాలంలో తాము ప్రజలతోనే ఉంటామన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా తమ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తుందని శ్రీమతి షర్మిల తెలిపారు. టిఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ క్విడ్‌ ప్రో కో కు పాల్పడిందని, వాటి మధ్య డీల్‌ కుదిరిందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

రాజధాని, నీటి వనరులు లాంటి అనేక  సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని శ్రీమతి షర్మిల అన్నారు. ఈ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ మిగతా అన్ని పార్టీలతో కలిసి కూర్చొని చర్చించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని తాము ముందే చెప్పామన్నారు. రాష్ట్ర విభజన పారదర్శకంగా ఉండాలనే తాము కోరుతున్నామన్నారు. మూడుసార్లు అఖిలపక్ష సమావేశాలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తన విధానాన్ని వెల్లడించలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా లేదని దుయ్యబట్టారు. ఏ నిర్ణయమైనా ప్రజలకు మంచి జరిగేలా ఉండాలని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top