జగన్‌పై జనాభిమానం పోలేదనే బాబు బాధ

వినుకొండ (గుంటూరు జిల్లా),

11 సెప్టెంబర్ 2013: పదహారు నెలలుగా జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టినా ప్రజల గుండెల్లో ఆయన మీద ఉన్నఅభిమానం చెక్కు చెదరలేదని చంద్రబాబు నాయుడు గింజుకుంటున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద పడి ఆయన ఏడుస్తారని ఎద్దేవా చేశారు. కలల్లో కూడా జగనన్ననే చంద్రబాబు కచ్చితంగా తలచుకుంటూనే ఉంటారని అన్నారు. వైయస్‌ కుటుంబంపై కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడి ప్రోద్బలంతోనే అన్నారు. అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టింది కాక ఇప్పుడు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని అడుగుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు గారూ సమాధానం చెబుతున్నాం వినండి. 'ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుకే ఒక్క రూపాయిని కూడా ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు' అని ఆమె అన్నారు. నిజానికి చంద్రబాబు గింజుకుంటున్నది అవినీతి జరిగిందని కాదన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల మంగళవారం గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

 శ్రీ జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు రోజూ ఎందుకు గింజుకుంటున్నారని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతి జరిగితే కనీసం ఒక్క రూపాయి అయినా స్వాధీనం చేసుకున్నారా? అని నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను శ్రీమతి షర్మిల ఘాటుగా తిప్పికొట్టారు. ఇంటికి నిప్పు పెట్టి తానే మంట మంట అని అరిచిన చందంగా ఉంది చంద్రబాబు తీరు అని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల అవినీతి అంటూ అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టిందే చంద్రబాబునాయుడు అన్నారు. అప్పుడు టిడిపిలో ఉన్న మైసూరారెడ్డిగారిని అడిగితే చిన్నపిల్లలకు కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెబుతారన్నారు. రాజశేఖరరెడ్డిగారు చనిపోయారన్న ఇంగితం కూడా లేకుండా లక్ష కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు అబద్ధపు ఆరోపణలు చేసి, ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్పించి, ఆయన కొడుకు మీద కేసు పెట్టడంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై, కుట్రలు పన్నారని ఆరోపించారు.

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, ఆయన కుర్చీని లాగేసుకుని, తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని, వ్యవసాయాన్ని దండగ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని తూర్పారపట్టారు. పన్నులు, ధరలు పెంచి పేదల ఉసురుపోసుకున్నది చంద్రబాబు అన్నారు. తొమ్మిదేళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా అధికార పక్షంతో కుమ్మక్కైపోయారని దుమ్మెత్తిపోశారు.

విద్యార్థులకు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి భరోసా కల్పించారు కనుకే లక్షలాది మంది ఉన్నత విద్యలు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రిల్లో ఉచితంగా లక్షల విలువైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించారన్నారు. అనేక అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేసినా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా పన్ను పెంచలేదన్నారు. ధరలేవీ పెంచలేదన్నారు. మన దురదృష్టం కొద్దీ ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన పథకాలన్నింటికీ తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. ఆయన ప్రతి ఆలోచననూ విమర్శించిందన్నారు. మహానేత వైయస్ఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆశించారన్నారు.

ఓట్ల కోసం, సీట్ల కోసం టిఆర్ఎస్‌ను కూడా తనలో కలుపుకుని రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కోట్లాది మంది తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని దుయ్యబట్టారు. అన్నదమ్ముల్లాంటి తెలుగువారి మధ్య విభేదాలు తీసుకువచ్చింది. తెలుగువారి ఓట్లతో గద్దెనెక్కిన క కాంగ్రెస్‌ పార్టీ తెలుగువారికే వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు.

తెలుగువారికి ఇంత అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలా చూస్తూ ఉండిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రమాణం చేశారు ముఖ్యమంత్రిగారూ! మీ అధిష్టానానికి, సోనియాకు విధేయులుగా ఉంటానని ప్రమాణం చేశారా? లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా పనిచేస్తానని చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని ప్రమాణం చేసి ఇప్పుడు ప్రజలకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని నిలదీశారు. కాంగ్రెస్ అధిష్టానానికి, సోనియాకు విధేయుడి లేకపోతే మీ పదవి ఊడిపోతుందని భయమా? కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ అన్నారు.

ముఖ్యమంత్రి పదవిని మీరు కష్టపడి తెచ్చుకున్నారా? మీది కాని పదవి మీద మీకెందుకు ఇంత ఆశ కిరణ్‌ కుమార్‌రెడ్డి గారూ అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మీది అత్యాశ కాదా కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ అన్నారు. మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాం అని దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పిన వెంటనే మీరు అది అన్యాయమని, కోట్ల మందికి అన్యాయం జరుగుతుందని మీరు ఆ రోజే రాజీనామా చేసి ఉంటే.. ఈ విభజన ప్రక్రియ ఆ రోజే ఆగిపోయేది కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తన ఆధ్వర్యంలో కోట్ల మందికి అన్యాయం జరిగిపోతుందని సీమాంధ్ర ప్రజలను క్షమాపణ కోరి మీరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి అని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. మీ ఎంపిల చేత కూడా రాజీనామాలు చేయించండి అప్పుడు విభజన ఎందుకు ఆగిపోదో చూద్దాం అన్నారు.

మన కర్మ ఏమిటంటే.. ఒక వైపున చేతగాని సిఎం ఉన్నారు. మరో వైపున అంతే చేతగాని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నారని విచారం వ్యక్తంచేశారు. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నా చంద్రబాబులో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ విడదీయడానికి చంద్రబాబు నాయుడు పలికిన మద్దతే కారణం అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చేసుకోండంటూ బ్లాంక్‌ చెక్కులా కేంద్రానికి లేఖ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు అని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న చారిత్రక తప్పిదానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, వంత పాడిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పాటు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని నిప్పులు చెరిగారు.

పట్టపగటే సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మ గౌరవ యాత్ర చేయడం ఏమిటని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. యాత్రలు చేస్తున్న చంద్రబాబుకు అసలు ఆత్మ అంటూ ఉందా? అన్నారు. ఆ వెన్నుపోటు ఆత్మకు ఒక గౌరవం అంటూ ఏడ్చిందా? అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎందుకిచ్చారు? ఎవరిని అడిగి ఇచ్చారు? ఎవడబ్బ సొత్తని ఇచ్చారని సీమాంధ్రులు చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసేంతవరకూ సీమాంధ్రలో తరిమి తరిమి కొట్టాలని అన్నారు.

ఓట్లు, సీట్ల కోసం కోట్ల మంది తెలుగువారికి అన్యాయం చేసి తెలంగాణను ఇచ్చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ పూనుకుందని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ఓట్లు, సీట్లు పోతాయని, క్రెడిట్‌ తనకు రాకుండా పోతుందని చంద్రబాబు కూడా నోరు విప్పడంలేదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. తరతరాలూ క్షమించలేని ఘోర పాపం చేస్తున్నాయని అన్నారు. ఏ సమస్యకూ పరిష్కారాలు చూపించకుండానే రాష్ట్రాన్ని విభజిస్తున్నామని సంకేతాలు పంపిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఒక్కుమ్మడిగా రాజీనామాలు చేసిన వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాజీనామాలు చేయడమే కాకుండా నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేశారన్నారు. కానీ ఎంతమంది కాంగ్రెస్, టిడిపి నాయకులు రాజీనామాలు చేసి ప్రజల తరఫున గొంతెత్తారని ప్రశ్నించారు.

'జై సమైక్యాంధ్ర.. జైజై సమైక్యాంధ్ర.. జై సమైక్యాంధ్ర.. జైజై సమైక్యాంధ్ర.. జోహార్‌ వైయస్ఆర్... జై జగన్‌' అంటూ నినాదాలు చేశారు.

తాజా వీడియోలు

Back to Top