'వైయస్‌ కుటుంబం పట్ల ప్రజల ప్రేమ తగ్గదు'

శంఖవరం (తూ.గో.జిల్లా),

22 జూన్‌ 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం సందర్భంగా వైయస్‌ కుటుంబం పట్ల ప్రజల్లో సింపతీ చూడలేదని పాదయాత్రలో తొలి నుంచీ పాల్గొంటున్న భద్రతా సిబ్బంది చెప్పారు. ప్రజల కళ్ళల్లో ఆర్తి, గుండెల్లో ప్రేమ మాత్రమే కనబడిందన్నారు. వైయస్‌ కుటుంబం పట్ల సింపతీ ఎన్నికల వరకూ కొనసాగుతుందా? ఓట్లను రాలుస్తుందా? అని వ్యాఖ్యానించే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్‌ అధికారులకు ఈ మాటలే చక్కని జవాబుగా నిలుస్తాయి. మహానేత వైయస్‌ కుటుంబం పట్ల ఎన్నికల వరకూ మాత్రమే కాదు.. ఆ కుటుంబం ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో అభిమానం కొనసాగుతూనే ఉంటుందని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచీ తనకు రక్షణగా నిలుస్తూ, తనతో పాటుగా నడుస్తున్న వారితో శ్రీమతి షర్మిల తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని శంఖవరంలో శనివారంనాడు ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరేడు గ్రామంలో ఓ తల్లి తన చంటిబిడ్డను ఒక చేతితో ఎత్తుకుని, మరో చేతితో హారతి పట్టుకుని శ్రీమతి షర్మిల కోసం వేసి చూసినప్పటి సంఘటనను భద్రతా సిబ్బంది గుర్తుచేసుకున్నారు. వర్షం కురుస్తున్న ఆ సమయంలో ఆమె హారతి ఆరిపోకుండా తన చెంగుతో కప్పి పెట్టడమే కాకుండా తన బిడ్డను కూడా అదే చెంగుతో వర్షంలో తడవకుండా కాపాడిన సంఘటన తమను ఎంతగానో కదిలించిందని చెప్పారు. కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమం చేసే రోజుల్లో మాత్రమే ఆయనకు హారతి ఇచ్చి ప్రజలు అన్నం పెట్టిన సంఘటనలు చూశామని మళ్ళీ ఇప్పుడు శ్రీమతి షర్మిల పాదయాత్ర సందర్భంగా అంతటి ఆప్యాయత, ఆదరణను చూస్తున్నామన్నారు. వైయస్‌ కుటుంబం పట్ల అభిమానం తరగదు అనడానికి ఇలాంటి సంఘటనలెన్నో తాము ఈ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో చూస్తున్నామని చెప్పారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన చూసిన తరువాత నక్సలైట్లు తమ ఉద్యమ పంథాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారని శ్రీమతి షర్మిల పాదయాత్రలో ఆమెకు రక్షణగా నడుస్తున్న భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, బట్ట అందేలా దివంగత వైయస్‌ పరిపాలన సాగించిన విధానంతో వారు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలనుకున్నారన్నారు. ఈ విషయం రెండేళ్ళ క్రితం చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌ సందర్భంగా బహిర్గతమైన లేఖే దీన్ని రుజువు చేసిందన్నారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కూడు, గూడు, బట్టకు లోటు లేదని, ఇక మీదట ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం చేయాల్సి వస్తే ఉద్యమ పంథాను మార్చుకొని చేయాలని రాసుకున్నట్లు ఆ పత్రంలో ఉందన్నారు.

కాగా, శ్రీమతి షర్మిల ప్రధాన భద్రతా అధికారి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, కావాలని తాము ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించలేదన్నారు. జనం మధ్యలోకి వచ్చిన శ్రీమతి షర్మిల భద్రత కోసమే తాము కచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. తమ బాధ్యతను ప్రేమగా తీసుకోవాలని, దురుసు ప్రవర్తనగా తీసుకోవద్దని ప్రజలను కోరారు.

ప్రజల మనసులలో వైయస్‌ఆర్‌ దేవుడిలా నిలిచిపోయారని పాదయాత్రలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజల గురించి ఆలోచించేది కేవలం వైయస్‌ కుటుంబం ఒక్కటే అని వారంతా ముక్తకంఠంతో పేర్కొన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ప్రజల బ్రతుకులు బజారుపాలైపోయాయని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. పాదయాత్రలో భాగంగా తమను కలిసిన శ్రీమతి షర్మిలకు ప్రజలు తమ బాధలు, కష్టాలు, కడగండ్లను చెప్పుకుని ఆమె నుంచి ఓదార్పు పొందుతున్నారు.

Back to Top