బాబు నల్లధనంపై విచారణ చేయాలి

హైదరాబాద్: ‌

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి (బ్రతికి ఉన్న) కి సంబంధించిన వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని విదేశాలకు తరలించానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ గతంలో సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంపై ఎ‌న్‌డీఏ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ డిమాండ్ చేసింది.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  దేశం సరిహద్దులు దాటి వెళ్లిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం పట్ల తమ పార్టీ హర్షం వ్యక్తంచేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

1995 - 2005 సంవత్సరాల మధ్య కాలంలో ఓ మాజీ ముఖ్యమంత్రికి చెందిన నల్లడబ్బును తాను విదేశాలకు చేరవేశానని హసన్ అలీ సీబీఐకి చెప్పినట్లు‌ గతంలో వార్తలు వచ్చాయని.. ఆ మాజీ ముఖ్యమంత్రి జీవించే ఉన్నారని కూడా అతడు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తు సందర్భంగా హసన్‌ అలీ ఇచ్చినట్టు చెపుతున్న ఈ వాంగ్మూలం మీద ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి విచారణ చేపట్టాలన్నారు. హసన్ అలీ చెప్పిన దానిని బట్టి.. ‌ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని స్పష్టవుతోందన్నారు. అందువల్ల విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ వెల్లడవుతాయని పద్మ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏలో భాగస్వామి కనుక బీజేపీ ప్రభుత్వం విచారణ జరుపకుండా ఉపేక్షిస్తుందా? హసన్ అలీ చెప్పిన విషయాలను మరుగు పరుస్తోందా? అనే  అంశాలను బట్టి వారి నిష్పాక్షికత బయటపడుతుందని ‌పద్మ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం తన నిష్పాక్షికతను రుజువు చేసుకోవడానికి చంద్రబాబుపై విచారణ జరిపించి తీరాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆ 12 వేల కోట్లు ఎలా వచ్చాయి?‌ :
మహానాడులో నీతి సూత్రాలు వల్లించిన చంద్రబాబు నాయుడు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల చొప్పున రూ. 3,000 కోట్లు, లోక్‌సభా నియోజకవర్గాల్లో సుమారు అంతకు మూడు రెట్లు- అంటే రూ. 9000 కోట్లు ఖర్చు చేశారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కొడుక్కి నేర్పిన సంస్కారం ఇదేనా బాబూ! :
టీడీపీ మహానాడులో మరణించిన మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మృతి చెందిన వ్యక్తిని తూలనాడరాదన్న కనీస విచక్షణ కూడా కోల్పోయి మాట్లాడారని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ విదేశీ చదువు కోసం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలను ముంచి ఉండొచ్చు కానీ వై‌యస్ఆర్ ఏనాడూ అలా ఆలోచించలేదని ఆమె ‌తెలిపారు. మహానేత వైయస్‌ఆర్ తన కుమారుడు శ్రీ జగన్ ఏ విధంగా ఎంబీఏ చదువుకున్నారో అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని అందరికీ ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారని ‌పద్మ గుర్తుచేశారు.

శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తన ప్రసంగాల్లో చంద్రబాబు గారూ.. అనే సంబోధించారని, సంస్కారం తప్పి మాట్లాడలేదని, అది వైయస్ఆర్ తన కుమారుడికి నేర్పిన సభ్యత సంస్కారాలని ‌వాసిరెడ్డి పద్మ చెప్పారు. ‌మహానేత వైయస్ఆర్,‌ శ్రీ జగన్ గురించి మహానాడులో లోకే‌శ్ మాట్లాడిన తీరు చూస్తే అది ఏ తరహా సభ్యతో, ఏం సంస్కారమో‌ అని పద్మ ప్రశ్నించారు. ఇదేనా చంద్రబాబు తన కుమారునికి నేర్పిప సభ్యత, సంస్కారం అని చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

Back to Top