టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు

నంద్యాలః అధికార టీడీపీ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని వైయస్సార్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రజలకు భరోసానిచ్చారు. టీడీపీకి ఓటేయకపోతే పెన్షన్, రేషన్ , ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామన్న ప్రభుత్వ బెదిరింపులను ఎవరూ పట్టించుకోవద్దన్నారు. ఎవరు రద్దు చేసినా వాటిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నూటికి నూటపాళ్లు నాదేనని హామీనిచ్చారు. ప్రజలకు న్యాయం చేసేందుకు అవసరమైతే కోర్టుకైనా వెళతానని స్పష్టం చేశారు. నంద్యాల ఉపఎన్నిక చివరి రోజు ప్రచారంలో భాగంగా గాంధీచౌక్ లో శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే....

భూమా నాగిరెడ్డి ఎలక్షన్ల ముందు పదివేల ఇళ్లు ఉచితంగా కట్టిస్తానని మాటిచ్చాడు. ఇవాళ 13 వేల ఇళ్లు ఆరు లక్షలకు ఇవ్వాలని చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి లక్షన్నర ఇస్తారట. మిగిలిన మూడు లక్షలు ప్రతి నెల రూ. 3వేల చొప్పన 20 సంవత్సరాలు ప్రజలు కట్టాలట.  ఆ రోజు ఉచితమని చెప్పారు. ఇవాళ డబ్బులడుగుతున్నారు. మరో సంవత్సరంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మన ప్రభుత్వం వచ్చాక 3 సెంట్ల స్థలం, ఉచితంగా ఇళ్లు కట్టించబోతున్నాం. నంద్యాలలో రౌడీయిజం, దొంగతనం జరగకుండా సీసీ కెమెరాలు, విద్యార్థులకు వైఫై అంటూ భూమా నాగిరెడ్డి  ప్రచారం చేశారు. ఎక్కడైనా కనిపిస్తున్నాయా..? ప్రజలను మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నారు. మళ్లీ ఇవాళ మొదలుపెట్టారు. 2కి.మీ. మేర రోడ్డు విస్తరణ చేపడితే అదేనా అభివృద్ధి. అవసరమైతే జైపూర్, మధ్యప్రదేశ్ పోయి ఫ్యాక్టరీలు తీసుకొస్తామన్నారు. వచ్చాయా? ఫ్యాక్టరీలు యూనివర్సిటీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తే అబివృద్ధి  అంటారు. రోడ్డు పక్కన పగలగొట్టిన బిల్డింగ్ లకు పరిహారం ఇచ్చారా...? నేను గెలిస్తే సిటీ కేబుల్ తక్కువ రేటుకు తీసుకొస్తానని మాట ఇచ్చాను. ఆ రోజు కేబుల్ 260 నుంచి రూ. 350 పెంచే క్రమంలో శిల్పా కేబుల్ తీసుకొచ్చి....ఓడిపోయినా రూ.130లకే ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం. ఓ వ్యక్తిని, కులాన్ని, మతాన్ని ఏరోజు నేను విమర్శించలేదు. టీడీపీ మైనారిటీ నాయకులు అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. వ్యక్తిగత ప్రతిష్ట దిగరజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముస్లింలే నా ప్రాణం, ఊపిరి. నేనున్నంతకాలం వారికి సేవ చేస్తానని చెబుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడికి అన్యాయం జరిగినా ఆప్తుడిగా అండగా ఉంటా. 

2004 ఎలక్షన్లకు ముందు మంచినీళ్లకు ఇబ్బందులు పడేవాళ్లం. ట్యాంకుల దగ్గర క్యూ ఉండేవాళ్లు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేశా. ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి వసతులు, శిల్పా సేవా సమితి ద్వారా వడ్డీలేని రుణాలు, పేదవాళ్లకు పెళ్లిళ్లు చేసే కార్యక్రమాలు, పది సరకుల వరకు తక్కువ రేటుకు ఇవ్వడం,  రైతులకు ఫెస్టిసైడ్స్ ఇవ్వడం లాంటి వాటితో సేవ చేస్తున్నాం. నేను ఓడినా గెలిచినా చేస్తానే ఉన్నా. రిజిస్టర్ అయి పదిమందికి సాయం చేస్తున్న శిల్పా సేవా సమితి, మహిళా సహకార్, శిల్పా సహకార్ చట్టవ్యతిరేకమని బాబు మాట్లాడుతున్నారు. రూ. 5వేల లోపు వడ్డీలేకుండా, 5వేల పైన అర్ధరూపాయి వడ్డీకి చేస్తుంటే మూసేస్తామంటున్నారు. డబ్బు కట్టొద్దంటున్నారు. మహిళలంటే నాకు అభిమానం, గౌరవం ఉంది. వాళ్లు సేవా సమితిని ఆదర్శంగా ముందుకు నడిపిస్తారని మనవి చేస్తున్నా. పొదుపు సంఘాలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరు ఓటేస్తే కోడ్ నంబర్ తెలుస్తుంది, టీడీపీకి ఓటేయకపోతే ఇబ్బంది పెడతామని బెదిరిస్తున్నారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన వాళ్లకే ఓటు వేయండని మనవి చేస్తున్నా. అనాథ పిల్లను ఆదరించమని ముఖ్యమత్రి చెబుతున్నాడు. భూమా బ్రహ్మానందరెడ్డికి తల్లి ఉంది. 35,38 ఏళ్లు ఉంటే ఆయన చిన్నపిల్లాడట. భూమా నాగిరెడ్డి వల్ల అనాథలైన పిల్లల సంగతేమిటని ముఖ్యమంత్రిని అడుగుతున్నా..?  మాయమాటలతో వస్తున్నారు. ఆలోచన చేయండి. ఎల్లుండి జరగబోయే ఎలక్షన్ లో నంద్యాల శాంతియుతంగా ఉండాలన్నా, ప్రతి ఒక్కరూ బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. 

Back to Top