పేదల ఆరోగ్యానికి అనారోగ్యం..!

() నిరు పేదల ఆరోగ్యంతో చెలగాటం

() మొదట నుంచి ఆరోగ్య శ్రీ అమలు మీద నిర్లక్ష్యం

() తూట్లు పొడిచేందుకు పక్కా వ్యూహం

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటనకు వెళ్లి వచ్చినప్పటి
నుంచి చైనా సామెతల్ని వంట పట్టించుకొన్నారు. ఒక కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద
పిచ్చిది అన్న ముద్ర వేయాలన్నది సామెత. గత ప్రభుత్వాల హయంలో ప్రాచుర్యం పొందిన
పథకాలకు తూట్లు పొడిచేందుకు ఇదే ప్రణాళికను అమలు చేస్తున్నారు. తాజాగా ఆరోగ్య శ్రీ
(ఎన్టీయార్ ఆరోగ్య సేవలు) పథకాన్ని అటక ఎక్కించేందుకు స్కెచ్ ను అమలు
చేస్తున్నారు.

నిరుపేదల పాలిటి పెన్నిధి

       నిరుపేదల ఆరోగ్య అవసరాలు
తీర్చేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేసిన పథకం
ఆరోగ్య శ్రీ. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అనారోగ్యం కల్గితే
ఆరోగ్య బీమా పథకం కింద చికిత్స చేయించారు. దీని కింద రాష్ట్రంలో లక్షల మంది
నిరుపేదలకు ఆరోగ్య బీమా కల్గింది. ఈ పథకంతో దివంగత వైఎస్సార్ ను నడిచే దేవుడుగా
ప్రజలు కొలవ సాగారు. సహజంగానే చంద్రబాబుకి ఇది కంటకింపుగా మారింది.

అధికారంలోకి వచ్చాక స్కెచ్ లు

ఈ పథకంతో వచ్చే లబ్దిని దారి మళ్లించాలంటే ముందుగా పేరుమార్చాలని నిర్ణయించారు.
ఆరోగ్య శ్రీ పథకం కాస్తా ఎన్టీయార్ వైద్య సేవలుగా మార్చారు. ఇందులో అమలయ్యే
వైద్యసేవల సంఖ్యను పెంచారు. అంత వరకు బాగానే ఉంది కానీ, నిధుల కేటాయింపుని మాత్రం
గణ నీయంగా తగ్గించేశారు. దీంతో రోగులు చేయించుకొంటున్న చికిత్సలకు సంబంధించి
ఆసుపత్రుల చెల్లింపులకు గండి పడింది. దీంతో చాలా చోట్ల ఆసుపత్రులు ఈ వైద్య
సేవల్ని నిరుత్సాహ పరుస్తున్నాయి. క్రమంగా ఈ పథకాన్ని అటక ఎక్కించేస్తారు అనే
ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

తాజా వివాదం

ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపుల్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం
చేస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటి దాకా రూ. 350 కోట్ల మేర చెల్లింపులు బకాయిలు పడ్డట్లు సూపర్
స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నాయకులు చెబుతున్నారు. పదే పదే వినతులు చేసినా ప్రభుత్వం
పట్టించుకోక పోవటంతో ఆసుపత్రులు గట్టి నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు.
బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవల్ని నిలిపివేస్తామని వెల్లడించారు. అటు వైద్య
మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం దీన్ని చాలా తేలిగ్గా తీసుకొంటున్నారు. వచ్చే
నెల 15 లోగా బిల్లుల చెల్లింపు జరగుతుందని, వైద్య సేవలు కొనసాగతాయని ప్రకటించారు.
అటు రోగుల పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా తయారైంది.

వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం కోరుకొంటున్నది కూడా ఇదే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత మహానేత వైఎస్సార్ కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పథకం కాబట్టే దీనికి తూట్లు పొడుస్తున్నారన్న వాదన ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో కోత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటివి అందులో భాగమేనని తెలుస్తోంది. అంతిమంగా పేదలకు ఈ పథకం మీద నిరాశ, నిరుత్సాహం కలిగేలా చేయటమే లక్ష్యంగా అర్థం అవుతోంది. తాజా పరిణామాల్ని చూస్తే చంద్రబాబు చైనా సామెతను ఎందుకు వాడుకొంటున్నారో తేలిగ్గా గ్రహించవచ్చు. 


To read this article in English:   http://goo.gl/n0O1Pv 

 

Back to Top