పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి

()పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి
()మహానేత ప్రారంభించిన ప్రాజెక్ట్ లను తక్షణమే పూర్తిచేయాలి
()ప్రభుత్వం దిగిరాని పక్షంలో ప్రాజెక్ట్ ల యాత్ర చేపడుతాం
()గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నేతలకు గట్టు సూచన

హైదరాబాద్: రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే సీఎం కేసీఆర్.. రైతుల విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించటం లేదని ఆరోపించారు. 

వర్షాలు సకాలంలో పడనందున రైతులు విత్తిన విత్తనాలు మొలకెత్తలేదని, కొన్ని చోట్ల అరకొరగా మొలకెత్తినా అకాల వర్షాలకు నీట మునిగిపోయాయని తెలిపారు. అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారని, ఇలా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఎకరాకి రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2004 తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులనూ ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే త్వరలో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలవారీగా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలి..
జిల్లాల అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, ప్రధాన కార్యదర్శులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇకపై అందరూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. సకాలంలో గ్రామ స్థాయి కమిటీలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, జి.మహేందర్‌రెడ్డి, మతిన్, కె.రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి(మహబూబ్‌నగర్), గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి(మెదక్), బెంబడి శ్రీనివాస రెడ్డి(రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్‌రెడ్డి(గ్రేటర్ హైదరాబాద్), ఎం.శాంతకుమార్(వరంగల్), అక్కెనపల్లి కుమార్(కరీంనగర్), నాయుడ్ ప్రకాశ్(నిజామాబాద్), తుమ్మలపల్లి భాస్కర్ (నల్లగొండ), మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Back to Top