నీళ్లు కావాలంటే సీఎంనో..చీఫ్ విప్ నో అడగాలా?

అమరావతి: ఏపీ అసెంబ్లీలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని, నీళ్లు కావాలంటే సీఎంనో, చీఫ్ విప్ నో అడగాలని చెబుతున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. నవ్యాంధ్రలోని  కొత్త అసెంబ్లీ ఎంత గొప్పగా, అద్భుతంగా ఉందంటే..ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాగడానికి నీళ్లు కావాలని నాలుగు సార్లు అడిగారు. ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా అడుగుదామంటే కనీసం ఓ అటెండర్‌ కూడా అందుబాటులో లేడు. చివరికి బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకుందామంటే లోపలికి తీసుకెళ్లకూడదంటున్నారు. బయటి నుంచి నీళ్లు తెచ్చుకోకూడదు, లోపల నీళ్లు ఇవ్వరని చీఫ్ విప్ చెబుతున్నారు..ప్రతిపక్ష నేత గారు మీకు నీళ్లు కావాలంటే మమ్మల్ని అడగండి కూల్‌డ్రింక్స్‌ ఇప్పిస్తామంటున్నారు. అంటే మాకు నీళ్లు కావాలంటే సీఎంనో, చీఫ్ విప్నో అడగాలంటా? ఇంత గొప్పగా, ఇంత ఘనంగా, అద్భుతంగా అసెంబ్లీ నిర్వాహకులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఎద్దేవా చేశారు. 

చెరుకు రైతుల కష్టాలు కనపడలేదా?
చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం బ్రహ్మాండంగా జీడీపీ పెరిగిందని చెప్పుకోవడం సిగ్గు చేటని, ఇదేనా మీ జీడీపీ పెరుగుదల అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. చెరుకు రైతుల సమస్యలపై ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. చెరుకు రైతుల కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. చెవిరెడ్డి ఏమన్నారంటే..చంద్రబాబు పుట్టిన చిత్తూరు జిల్లా గాజులమన్యం షుగర్‌ ఫ్యాక్టరీలో 89 వేల టన్నుల చెరుకును 2014–2015వ సంవత్సరంలో తోలుకొని, ప్రభుత్వం క్యాష్‌ చేసుకుంది. 3500 మంది రైతులకు ఇప్పటి వరకు ఒక్క నయాపైసా కూడా చెల్లించలేదు. రూ.13.50 కోట్లు బాకీ ఉన్నారు. రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. తరువాత చెరుకు తోలుకునేందుకు వీలు లేకుండా ఫ్యాక్టరీనే మూసివేశారు. ఈ ఫ్యాక్టరీలో 270 మంది ఉద్యోగులు 2015 నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వడం లేదు. రూ.4.50 కోట్ల జీతాల బకాయిలు ఉన్నాయి. చాలా మంది రిటైర్డ్‌ బెనిఫిట్లు, పింఛన్‌ బెనిఫిట్లు ఇవ్వడం లేదు. అలాగే చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీ రెండున్నర లక్షల టన్నుల నుంచి 3 లక్షల టన్నుల చొప్పున ఏడాదికి చెరుకు క్రసింగ్‌ జరుగుతోంది. అక్కడ కూడా రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ.38 కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగులకు 33 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 2003లో ఇదే చంద్రబాబు రూ.73 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేయించారు. రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించారు. చిత్తూరు జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలను లాభాల బాటలో నడిపించారు. మళ్లీ బాబు వచ్చాక ఈ రోజు బకాయిలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు రూ. 38 కోట్ల బకాయిలు ఉన్నాయి..ఇవి రూ.70 కోట్లకు చేరగానే మళ్లీ మూసివేస్తారు. ఇదేనా జీడీపీ రేటు. రైతులు కోర్టుకు వెళ్తే ఆక్వాబ్‌ రుణం ఇస్తుందని, ఆ రుణంతో మీ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏడాది గడిచినా ఆ రుణం ఏమైందో తెలియడం లేదు. చంద్రగిరి, తిరుపతి, నగరి, కాళహస్తీ రైతులు బకాయిల కోసం ప్రభుత్వం చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రైతులు కనిపిస్తే తప్పించుకొని తిరుగుతున్నాం. రైతులకు సాయం చేయకున్నా పర్వాలేదు. వారికి రావాల్సిన సాయం అందించండి చాలు. 
Back to Top