బిల్లుకు అవకాశం ఇవ్వండి

స్పీకర్‌కు వైవీ సుబ్బారెడ్డి లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తన ప్రైవేటు మెంబరు బిల్లు ఈ సెషన్‌లోనే వచ్చేలా చూడాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌  పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఒక లేఖ అందజేశారు. ‘చాలా బాధ, అసంతృప్తితో నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2016 శీర్షికతో ఉన్న నా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టేందుకు గతేడాది జూలై నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈ బిల్లు గత ఏడాది జూలై 27, నవంబర్‌ 18, డిసెంబర్‌ 16, ఈ ఏడాది ఫిబ్రవరి 3 తేదీల్లో లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో చోటు చేసుకున్నప్పటికీ.. ప్రతీ సందర్భంలో అటు కాంగ్రెస్‌ గానీ, ఇటు అధికార పక్షం గానీ గందరగోళం సృష్టిస్తుండడం తో సభ వాయిదా పడుతూ వచ్చింది.

నా బిల్లు లిస్టయిన సందర్భం లోనే ఇలా జరుగుతూ వచ్చింది. ఇందులో ఏదో మతలబు ఉందని నాకు అర్థమైంది. ఈ నేపథ్యంలో మీరు మీ అధికారాన్ని ఉపయోగించి ఈ సమావేశాల్లోనే ప్రైవేటు మెంబర్‌ బిజినెస్‌ లేని రోజైనా సరే ఈ బిల్లును నేను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వగలరు. అంతేకాకుండా 64వ నిబంధన ద్వారా ఈ బిల్లును గెజిట్‌లో ప్రచురించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.

ప్యాకేజీకి కేబినెట్‌ నోట్‌ తయారుకాలేదు
హైదరాబాద్‌: ఏపీకి  కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అభి వృద్ధి సహాయం (ఆర్థిక ప్యాకేజీ)కు సంబంధించిన కేబినెట్‌ నోట్‌ను ఇంకా రూపొందించే స్థాయిలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. రాజ్యసభలో వైయస్సార్‌సీపీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్యాకేజీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందా? ఆమోదంలో జాప్యానికి కారణాలున్నాయా? విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం పనులు కూడా ఈ ప్యాకేజీలోకి వస్తాయా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపర్చి ఉన్నాయి కనుక అవి ప్రత్యేక ప్యాకేజీలో అంతర్భాగం కావని మంత్రి మేఘ్వాల్‌ స్పష్టం చేశారు.
 
Back to Top