కోడెల పదవికి రాజీనామా చేయాలి

డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలిచానని కోడెల అంగీకరించాడు
నేరం ఒప్పుకున్నందున కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే, స్పీకర్ అయిఉండి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు
శ్మశానాలు, మరుగుదొడ్లలో కూడా డబ్బులు కాజేస్తున్నారు
కోడెల శివప్రసాదరావు కు పదవిలో కొనసాగే అర్హత లేదు: అంబటి

హైదరాబాద్ః  శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లిలో రూ.11 కోట్ల 50 లక్షలు డబ్బులు వెదజల్లి గెలిచానని స్వయంగా కోడెల శివప్రసాదరావే నేరం అంగీకరించినందున తక్షణమే ఆయనపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు. కోడెల వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం అసెంబ్లీ సభ్యత్వానికి పోటీ చేస్తున్న వ్యక్తి రూ. 28 లక్షలకు మించకూడదని , ఎంపీలు రూ. 78 లక్షలకు మించి ఖర్చుచేయకూడదని అంబటి అన్నారు.  హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా, చట్టాన్ని అతిక్రమించి సత్తెనపల్లిలో 924 ఓట్లతో  గెలిచినట్లు కోడెల నేరం ఒప్పుకున్నందున.... సుమోటోగా పరిగణించి ఎన్నికల కమిషన్ ఆయనపై  యాక్షన్ తీసుకోవాలన్నారు. ఒకవేళ ఏదైనా తాత్సారం జరిగితే రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసి చట్టప్రకారం కోడెలపై చర్యలు తీసుకునేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. ఆయనపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నామన్నారు. ఎన్నికల్లో అధికంగా ఖర్చు పెట్టిన వారిపై సుమోటోగా గతంలో చర్యలు తీసుకున్న దాఖలాలు ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేగా, స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా డబ్బులు వెదజల్లి గెలిచానని నేరం ఒప్పుకున్నారు కాబట్టి సాక్షాధారాలు కూడా అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు.  ఆదర్శప్రాయుడ్ని, నీతి వంతుడినని చెప్పుకునే కోడెల తన పదవికి రాజీనామా చేసి నిజాయితీని  నిరూపించుకోవాలన్నారు.  

 రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు పెట్టి రూ. 1100 కోట్లు సంపాదించుకోవచ్చని సత్తెనపల్లి, నరసారావు పేట నియోజకవర్గంలో అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిని పెట్టి ....రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాదరావు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని అంబటి నిప్పులు చెరిగారు. అక్కడ అవినీతి ఎంత దారుణంగా జరుగుతుందంటే... మలవిసర్జాల కోసం కట్టే మరుగుదొడ్లలో కూడా కమీషన్ తీసుకొని డబ్బులు సంపాదించాలన్న నీచమైన సంస్కృతికి కోడెల కూతురు, కుమారుడు దిగజారారని విమర్శించారు. శవాల మీద బొగ్గులు ఏరుకున్న చందాన స్వర్గపురి పేరుతో నిర్మించే శ్మశానాల్లో కూడా డబ్బులు కాజేయాలన్న నీచమైన కార్యక్రమం చేస్తున్నారని కోడెల శివప్రసాదరావుపై ధ్వజమెత్తారు.  డిస్పూటెడ్ ల్యాండ్ లలో ఒకరి పక్షాన చేరి పోలీసులను ఉపయోగించి అలాంటి భూములను కూడా కోడెల ఆక్రమించుకుంటున్నారని అంబటి ఫైర్ అయ్యారు. అన్ని డిపార్ట్ మెంట్ లలో కమీషన్ లు తీసుకొని రూ. 1100 కోట్లు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో కోడెల ఉండడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. 
Back to Top