దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి

పామర్రు: రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలనే ఆ పార్టీకి రాజీనామాలు చేసి వైయస్సార్‌సీపీలో చేరి ఎమ్మెల్యేని గెలిపించుకున్న మమ్మల్ని మీరు వివర్శించడం దయ్యాలువేదం వల్లించినట్లున్నదని మండల వైయస్సార్‌సీపీ అధ్యక్షులు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, దాసు గంగాధరరావులు టీడీపీ నేతల వ్యాఖ్యలపై మండి పడ్డారు. సోమవారం స్థానిక పార్టీకార్యాలయంలో పార్టీనేతలతో కలిసి మాట్లాడుతూ మా పార్టీ మాండెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేచే రాజీనామా చేయించి టీడీపీ తరపున పోటీ చేయించి గెలిపించండని సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలో 2009,2014 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోలేని అసమర్ధులైన మీరా మమ్మల్ని విమర్శించేదని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. వర్ల రామయ్య నియోజకవర్గంలో అభివృద్ది చేయలేక పోవడం వలన అభివృద్ది పేరిట మీరు మా వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేని కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. ఇటీవల అభివృద్ది కోసమే పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులతో ఏఏ గ్రామాలు అభివృద్ది చేసారో స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నీరు–చెట్టు పథకం క్రింద నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరిపిన తర్వాత టీడీపీ నాయకులు అభివృద్ది చెందారా లేక గ్రామాలు అభివృద్ది చెందాయా ప్రజలకు తెలియజెప్పాలన్నారు. వైయస్సార్‌సీపీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేను భుజాన వేసుకుని టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడం మీ కుసమస్కారానికి నిదర్శనం కాదా అని దుయ్య బట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి పెయ్యల రాజు,వార్డు మెంబరు మల్లెల బాబూరావు, పార్టీ నాయకులు తాడిశెట్టి శ్రీనివాసరావు, బొమ్మారెడ్డి అప్పిరెడ్డి, దునుకు దర్గా ప్రసాద్, ఎల్‌ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top