చంద్రబాబుని క్షమించకూడదు..!

() బాబు పాలన అంతా మోసం..మోసం..మోసం..

() కరువు మీద చర్యల్లేవ్

() ప్రజల గొంతు
వినిపించకూడదనే ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు

() మాచర్ల ధర్నాలో బాబు మీద
మండిపడిన వైఎస్ జగన్

మాచర్ల) చంద్రబాబు వంటి
వ్యక్తిని ఏమాత్రం క్షమించకూడదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్
జగన్ అభిప్రాయ పడ్డారు. ప్రజల గొంతు వినిపించకూడదనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను
కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని
పిలుపు ఇచ్చారు.

          కరువు, తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, రైతాంగ సమస్యలు వంటి
తీవ్ర ఇబ్బందుల్ని పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి
ప్రదర్శిస్తోంది. ఇందుకు  నిరసనగా,
ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే విధంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిరసనలు
చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్ల లో జన నేత వైఎస్ జగన్ ధర్నా
చేపట్టారు. వెల్లువలా తరలి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైఎస్
జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

          ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల కన్నా ఎక్కువ గా
మండుతున్నప్పటికీ ఇక్కడ ఎవ్వరూ లెక్క చేయటం లేదు. బాగా ఆలస్యం అవుతున్నప్పటికీ
పట్టించుకోవటం లేదు. ఏ ఒక్కరి ముఖంలో చికాకు కనిపించటం లేదు. కడుపు నిండా బాధను
పెట్టుకొని చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆత్మీయతను, ప్రేమానురాగాల్ని
చూపిస్తున్నారు. మీ అందరి అభిమానం, ఆత్మీయతలకు శిరస్సు వంచి, చేతులు జోడించి
ధన్యవాదాలు తెలుపుతున్నాను.

          ఇవాళ రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. తాగటానికి నీళ్లు లేవు.
పంటలు ఎండిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నా పట్టించుకొనే దిక్కు లేదు.
నీళ్లు లేక పశువులు చనిపోతున్నాయి. పశుగ్రాసం దొరకటం లేదు. ప్రభుత్వం నుంచి స్పందన
ఏమాత్రం లేదు. కరువు తాండవిస్తోంది. రైతాంగానికి అండగా ఉందాం, పేదలకు అండగా ఉందాం
అనే ఆలో చన ఏమాత్రం  ఈ దిక్కుమాలిన
ప్రభుత్వానికి రావటం లేదు.

          ఇటువంటి సమయంలో రైతులకు అందించాల్సిన ఇన్ ఫుట్ సబ్సిడీ  వెయ్యి కోట్లకు గాను ఒక్క రూపాయి కూడా
ఇవ్వలేదు. రైతులు, పేదలకు అండగా నిలవటం లేదు. ముఖ్యమంత్రి కావటానికి ముందు
ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు రైతులకు చాలా చెప్పారు. మూడు తుఫాన్లు, కరువు వచ్చాయి.  వీటికి గాను అందరినీ ఆదుకొంటానని హామీలు
ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే రైతులు, బీదలకు పంగనామాలు మొదలెట్టారు. ఒక్క
కలంపోటుతో రూ. 1640 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ కి ఎగనామం పెట్టారు. ఒక్క రూపాయి కూడా
ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

          2014..15 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 15 వందల కోట్ల రూపాయిల
మేర నష్టం వాటిల్లిందని లెక్క గట్టారు. తర్వాత అధికారులు వడపోతలు చేపట్టి దాన్ని
రూ. వెయ్యి కోట్లకు తెచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని 692
కోట్లు చేశారు. అదయినా పూర్తిగా ఇచ్చారా అంటే అదీ లేదు. అక్కడ కూడా వంద కోట్లు
ఇంకా ఇప్పటికీ ఇవ్వనే లేదు.

          2015...16 లో కరువు వచ్చింది. అకాల వర్షాల తో వరదలు వచ్చాయి.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మేర నష్టం వాటిల్లిందని చంద్రబాబు ప్రభుత్వమే
కేంద్రానికి లెక్కలు చెప్పింది. లేఖలు రాసింది. కానీ ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా
ప్రజలకు ఇచ్చిన పాపాన పోలేదు. 2015..16 పూర్తయి 2016..17 మొదలైనా సాయం ఏమాత్రం
అందించలేదు. 

చెప్పిందేమిటి..చేస్తున్నదేమిటి..!

కరువు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి
గా ఉన్న చంద్రబాబు చేయాల్సిందేమిటి. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సమీక్షలు
నిర్వహించాలి. ఎన్నిచోట్ల కరవు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది, సమ్మర్ స్టోరేజీ
ట్యాంకుల పరిస్థితి ఏమిటి అన్నది అధికారుల నుంచి వివరాలు తెప్పించుకోవాలి. మార్చి
నెలకల్లా కార్యాచరణ రూపొందించుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి వెళ్లి
తాగునీటి సహాయక చర్యలు సమగ్రంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. కానీ చంద్రబాబు ఏం
చేశారు. ఫిబ్రవరిలో ఒకసారి సమీక్ష జరిపారు. తర్వాత పట్టించుకోలేదు. కరువు పేరు
చెప్పి ఒక్క దమ్మిడీ కూడా సాయం చేయలేదు. కరువు తాండవిస్తున్నప్పుడు రైతులు, రైతు
కూలీలు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితిలో జనం ఉన్నారు. బతికే దారి లేక ప్రజల
వలసలు వెళ్లిపోతున్నారు.

          కరువు, దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి
హామీ పథకం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. దీనికి డబ్బులు కేటాయించాలి. కానీ
చంద్రబాబు ఏం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ పథకానికి రూ. 4,500 కోట్లు కేంద్రం
ఇచ్చింది. ఇందులో వెయ్యి కోట్లను చంద్రబాబు సిమెంట్ రోడ్లకు వాడేసుకొన్నారు. 2,500
కోట్లను నీరు..చెట్టు కార్యక్రమానికి వాడుకొన్నారు. అంత మాత్రానా సిమెంట్ రోడ్లు
వద్దనో, నీరు చెట్టు వద్దనో చెప్పడం లేదు. కానీ, ఉపాధి హామీ పథకం నిధుల్ని పక్క
దారి పట్టించవద్దని చెబుతున్నాం. కరువుతో అల్లాడిపోతుంటే పేదలకు కడుపు నిండా తిండి
పెట్టే నిధుల్ని కత్తిరించేస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం కింద చేపట్టే పనుల్లో
శ్రమ జీవుల వాటా 60శాతానికి పైగా ఉండాలి. అప్పట్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్
రెడ్డి ఈ పథకం కింద శ్రమ జీవుల పనులకు 97.5 శాతం కేటాయించేవారు. ఇప్పుడు ఉపాధి
హామీ పథకం పనుల్ని శ్రమ జీవులకు ఇవ్వక పోవటం కారణంగా పేదవారు వలసలు పోతున్నారు. ఇంతకన్నా
దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా..

          మనం ఉన్న చోట నుంచి దగ్గరలోనే నాగార్జున సాగర్ ఉంది. అయినా
సరే, మనకు నీళ్లు దొరకని పరిస్థితి. (ఖాళీ బిందె చూపుతూ) ఇదీ మన పరిస్థితి. అటు
చూస్తే నాగార్జున సాగర్ ఎండిపోతోంది. ఇవాళ ఒక్కసారి నీటి విషయం చూసుకొంటే శ్రీశైలం
నిండితే తప్ప నాగార్జున సాగర్ కు నీరు రాదు. అటు తుంగభద్ర నుంచి నీళ్లు రావటం
లేదు. రైతుల పరిస్థితి అగమ్య గోచరం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు ఎలా
ఇవ్వాలి, ఎలా తేవాలి అని చంద్రబాబు ఆలోచించటం లేదు. మహారాష్ట్ర, కర్నాటక ల నుంచి
నీరు మహబూబ్ నగర్ కు రావాలి. అక్కడ నుంచి శ్రీశైలం కు రావాలి. అక్కడ నుంచి దిగువగా
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు రావాల్సి ఉంటుంది.
కానీ, మహబూబ్ నగర్ నుంచి 115 టీఎమ్సీల నీటిని తోడుకొని పోయేందుకు రంగం సిద్ధం
చేస్తున్నారు. అయినా సరే, చంద్రబాబు అడిగే పరిస్థితి లేదు. ఎందుచేత కేసీయార్ ను
చంద్రబాబు అడగటం లేదు. ఎందుకంటే కోట్ల రూపాయిల బ్లాక్ మనీ తో తెలంగాణ లో
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో సహా కొనుగోలు చేస్తూ
దొరికిపోయారు కాబట్టి, అటువంటివి అడిగితే కేసీయార్ జైలుకి పంపిస్తారు అన్న భయంతో
రైతుల జీవితాలతో చెలగాటం ఆఢుతున్నారు.

          రైతులు, పేదల్ని మోసం చేసిందీ ప్రభుత్వం. బ్యాంకుల్లో పెట్టిన
బంగారం బయటకు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రైతుల రుణాలన్నీ
బేషరతుగా మాఫీ చేయాలంటే చంద్రబాబు సీఎం కావాలి అన్నారు. మీరంతా చెప్పండి.. రైతుల
రుణాలు మాఫీ అయ్యాయా.. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ అయ్యాయా.. మాఫీ కావటం
మాట అటుంచి చంద్రబాబు ఇస్తున్న డబ్బులు వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోవటం లేదు.
బ్యాంకుల్లో బంగారాన్ని వేలం వేస్తున్నారు.

          చంద్రబాబు పాలన అంతా మోసం.. మోసం..మోసం . చంద్రబాబు జీవితమంతా
వెన్నుపోట్లు, మోసం, దగా. చంద్రబాబు వంటి వ్యక్తిని ఏమాత్రం క్షమించకూడదు. రైతులు,
పేదలు అవస్థలు పడుతుంటే ఆ బాధల్ని వినిపించాల్సిన గొంతు ప్రతిపక్షానిది. రుణమాఫీలో
మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళల గొంతు వినిపించకూడదని, ఉద్యోగం అల్లాడుతున్న
విద్యార్థుల గొంతు వినిపించకూడదని సంత లో గొర్రెల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను
కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఇందుకోసం అందరం ఒక్కటవుదాం. చంద్రబాబు
ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రయత్నిద్దాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు.
ఇంకా గట్టిగా పోరాడుదాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇక్కడకు వచ్చి న వారందరికీ
పేరు పేరునా ధన్యవాదాలు.

          అని వైఎస్ జగన్ ప్రసంగించారు. 


Back to Top