కొత్త అసెంబ్లీనైనా సక్రమంగా నిర్వహించండి

  • ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం మా బాధ్యత
  • ప్రతిపక్షాన్ని తిట్టించడం స్పీకర్‌ ఇకనైనా మానుకోవాలి
  • సభ నుంచి ఏదో రకంగా పారిపోవాలని ప్రభుత్వమే చూస్తోంది
  • చట్ట విరుద్ధులను వెధవలనక మరేమనాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: నూతన భవనంలోనైనా అసెంబ్లీ సమావేశాలు సభా సాంప్రదాయాలకు అనుగూణంగా జరిగే విధంగా చూడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సీఎం, స్పీకర్ లకు సూచించారు. సభలో ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం, అధికార పార్టీ నేతలకు గంటల సమయాన్ని కేటాయించి ప్రతిపక్ష సభ్యులను తిట్టించడం స్పీకర్‌ ఇకనైనా మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా..ప్రజలకు ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టలేకపోవడం దురదృష్టమన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క రోజు కూడా ప్రతిపక్ష పార్టీని ప్రజా సమస్యలపై సవ్యంగా మాట్లాడించిన పాపాన పోలేదని ఆరోపించారు. బీఏసీ మీటింగ్‌లలో వివిధ రూపాల్లో ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన అంశాలను కూడా ప్రస్తావనకు తీసుకురాలేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్దతిలోఅధికార పార్టీ చేస్తున్న తప్పులను సభలో నిలదీయడం ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత అని సూచించారు. అలాంటిది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిర్ధాక్ష్యిణ్యంగా అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. కొత్త కొత్త సెక్షన్‌లను సృష్టించుకొని తమ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్‌ చేసిన తీరు చూస్తుంటే హైదరాబాద్‌లో ఒక్క రోజు కూడా అసెంబ్లీ జరగలేదనే బాధ వైయస్‌ఆర్‌ సీపీలో ఉందన్నారు. కొత్త అసెంబ్లీ భవనంలోనైనా సభను ప్రజలకు ఉపయోగపడే విధంగా సక్రమంగా నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ప్రభుత్వాన్ని నిలదీయకుండా భజన చేయాలనే విధానాన్ని అధికార పార్టీ నేతలు మార్చుకోవాలన్నారు. 

చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలి
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు, రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సీడీ, రుణమాఫీ వంటి ప్రధాన అంశాలపై చర్చించనున్నామన్నారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి 30 శాతం గ్రోత్‌ రేటు అని చంద్రబాబు అంటున్న మాటలు, ఏ రకంగా రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తాగునీరు దొరకండం లేదు కానీ, బీరు మాత్రం ఎక్కడైనా దొరుకుతుందన్నారు. తాగునీటి సమస్య, ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్టుల అంచెనాల పెంపుపై చర్చించనున్నామన్నారు. అదే విధంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన సమస్యగా మారిన ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని కడిగేయనున్నట్లు చెప్పారు. మహిళా సాధికారత పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలపై చేస్తున్న దాడులు, మహిళా  భద్రత, పార్టీ ఫిరాయింపులు, జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై నిలదీస్తామన్నారు. అదేవిధంగా హంగు, ఆర్భాటాల కోసం కోట్ల రుపాయల దుబారా..ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, దుర్మార్గంగా నిర్మించిన ఇంటిని అధికార నివాసంగా మార్చుకున్న అరాచకాలపై, స్విస్‌ ఛాలెంజ్, దేవుడు భూములు ఏ రకంగా అక్రమణ చేస్తున్నారో.. అగ్రిగోల్డ్‌ సమస్య, రాష్ట్రంలో పడకేసిన ఆరోగ్య, వైద్య సమస్యలపై మాట్లాడనున్నట్లు స్పష్టం చేశారు. నోట్ల రద్దు తరువాత వస్తున్న తొలి సమావేశం కాబట్టి ఆ అంశంపై కూడా మాట్లాడుతామని చెప్పారు. వీటన్నింటిపై సభలో మాట్లాడటానికి ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష అంశాలపై సమాదానం చెప్పడానికి సిద్ధంగా రావాలని సూచించారు. హైదరాబాద్‌లో సభను నిర్వీర్యం చేసినట్లుగా కొత్త సభలో చేయోద్దని, సభను చట్టసభ మాదిరిగా ఉంచాలి కానీ దుశ్సాసన సభగా మార్చొదని చంద్రబాబును, స్పీకర్‌ను కోరారు. 

కొత్త సాంప్రదాయానికి తెరలేపిన స్పీకర్‌
దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే జరుగుతున్నాయని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీ సభ్యులను సభలో మాట్లాడనివ్వకుండా అధికార పార్టీ నేతలతో గంటలు, గంటలు తిట్టించే కొత్త సాంప్రదాయినికి స్పీకర్‌ తెరలేపారని దుయ్యబట్టారు. సభను హుందాగా నడిపించే బాధ్యత స్పీకర్, ముఖ్యమంత్రిలపై ఉందన్నారు. వారిద్దరే సభను నిర్వీర్యం చేయాలని, సభ నుంచి ఏదో రకంగా పారిపోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నిర్వాహణ ఖర్చుకంటే చంద్రబాబు విదేశీ పర్యటనలకు, తాత్కాలిక సదస్సులకు, సభకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్‌ సదస్సులు అని చెప్పి బాబు భజన చేసే వారికి మైకులు ఇచ్చి పొగిడించుకోవడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. నిజంగా ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష పార్టీని సభలో మాట్లాడనివ్వాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన సరిగ్గాలేదని బాబుకు అనుమానం కలిగితే ఎదురుదాడి చేస్తూ సభను సక్రమంగా జరగనివ్వకుండా చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

రూ. 260 కోట్లు దిగమింగారు
రైతుల పేరు చెప్పి అవినీతికి పాల్పడడం బాబు పాలనలో తప్ప దేశ చరిత్రలోనే ఎక్కడా జరిగివుండదని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రెయిన్‌ గన్‌లతో కరువును తరిమేశామని చంద్రబాబు సర్కార్‌ డ్రామాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్‌ గన్‌లకు రూ. 260 కోట్లు కేటాయించిన డబ్బును కూడా టీడీపీ నేతలు దిగమింగారని విమర్శించారు. రైతులంతా పంటలు పండక ఉపాధి కోసం వలసలు వెళ్తుంటే వ్యవసాయం బ్రహ్మాండంగా ఉందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రెయిన్‌గన్‌లతో పంటలను కాపాడమని చెబుతున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలను కాపాడారో చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయరంగం కుంటుపడిపోయిందని చెప్పారు. 

వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్న బాబు
చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్క వ్యవస్థను కూడా వారి పనిని వారు సక్రమంగా పనిచేసుకోనివ్వకుండా చేస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నేతలు అధికారులపై దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. నిజాయితీగా పనిచేసే అధికారులను బదిలీల పేరుతో బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాయితీగా పనిచేసే అధికారులంటే వైయస్‌ఆర్‌ సీపీకి అపారమైన గౌరవం ఉందన్నారు. కానీ చట్ట ప్రకారం నడుచుకోకుండా అధికార పార్టీకి అనుకూలమైపోయి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న అధికారులను వెధవలు అనక మరేమనాలని ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్‌ అధికారులే ఓటర్లను టీడీపీ క్యాంపు కార్యాలయాలకు అప్పగించే డ్యూటీ చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రజాస్వామ్య దేశంలో ఇంత దుర్మార్గమా అని పోలీస్‌ వ్యవస్థను ప్రశ్నించారు. అధికారులకు ప్రభుత్వం నుంచి చట్టవిరుద్ధంగా ఎలాంటి ఒత్తిడులు వచ్చినా నిలదీయాలని మీ వెన్నంటే అనునిత్యం వైయస్‌ఆర్‌ సీపీ ఉంటుందని విజ్ఞప్తి చేశారు.  అసెంబ్లీ, రెవెన్యూ, పోలీస్‌ వ్యవస్థను ప్రభుత్వం సొంతానికి వాడుకోవడం సమంజసమా.. ఏ చిన్న పని చేసిన కోట్లాది రూపాయల పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి పని జరగడం లేదని దుయ్యబట్టారు.  
Back to Top