చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపించాలి

అవినీతిపరుడ్ని కేంద్రంలో ఎలా కొనసాగిస్తారు
బాబుపై ప్రధాని విచారణకు ఆదేశించాలి
టీడీపీని అవినీతి, ప్రజాద్రోహుల పార్టీగా మార్చాడు
బాబుకు తగిన శాస్తి జరుగుతుందిః లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌:  చంద్రబాబుపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. ఎన్‌టీ రామారావు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ ఘాట్‌లో లక్ష్మిపార్వతి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని మాట్లాడిన చంద్రబాబు, ఇప్పుడు ఈ విషయంపై ఒక్కసారి కూడా ప్రధానిని అడగకపోవడం దారుణమన్నారు. 

అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఫైరయ్యారు. పనామా లీక్స్‌లో చంద్రబాబు కుటుంబ సంస్థకు చెందిన హెరిటేజ్‌ ఫుడ్‌ డైరెక్టర్‌ వరప్రసాద్‌ పేరు బయటకు రావడంతో చంద్రబాబు హుటాహుటినా విదేశాలకు వెళ్లి అకౌంట్లు సెటిల్‌ చేసుకున్నారని విమర్శించారు.  ప్రధాని నరేంద్ర మోదీ తన రెండేళ్ల పాలనపై మాట్లాడుతూ... దేశంలో అవినీతి రహిత పాలన సాగిస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్నారని, కానీ అసలు అవినీతి పరుడు చంద్రబాబును మాత్రం తన మిత్రపక్షంగా చేర్చుకున్నారని విమర్శలు గుప్పించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయింది వాస్తవం కాదా..? రాజధానిలో భూదురాక్రమణకు పాల్పడింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. అలాంటి అవినీతిపరుడ్ని ఎలా కేంద్రంలో కొనసాగిస్తారని ప్రధానిని నిలదీశారు. తక్షణమే చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని ఆమె చెప్పారు. 

నాడు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్‌టీ రామారావు తెలుగు దేశం పార్టీని ప్రారంభించారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఆయన మరణాంతరం చంద్రబాబు పార్టీని.... అవినీతి పార్టీ, ప్రజా ద్రోహుల పార్టీగా మార్చారని మండిపడ్డారు. టీడీపీకి శాశ్వతమైన కళంకాన్ని తీసుకువచ్చిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. అతనికి త్వరలోనే తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు.

Back to Top