భూకబ్జాలపై కనీస విచారణ జరగకపోవడం దుర్మార్గం

  • నీ హస్తం లేకపోతే విచారణ జరిపించు బాబూ?
  • విశాఖ భూకబ్జాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం
  • పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, మేధావులు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
విశాఖ: విశాఖపట్నం భూకబ్జాలపై  వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబం హస్తం లేకపోతే విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.  భూకబ్జాలపై వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బొత్స, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ల్యాండ్‌ పూలింగ్‌ భూములు కొల్పోయిన వారికి పరిహారం ఇవ్వకుండా టీడీపీ నేతలు వారి చుట్టాలకు, కార్యకర్తలకు డబ్బులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ఆర్డీఓ పోస్టు గురించి టీడీపీ నేతల మధ్య పెద్ద గొడవ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి టీడీపీ కార్యకర్తల వరకు డబ్బులపై, ఆస్తులపై మమకారం పెరిగింది కాబట్టే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దోపిడీని అరికట్టేందుకు కార్యచరణ రూపొందించాలన్నారు. మేధావులంతా కలిసి సీఎస్‌ను, డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.. ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నిద్దామన్నారు. అదే విధంగా ప్రజాపోరాటాలు చేద్దామని అన్నారు. ప్రభుత్వ అధికారులపై ఎవరికీ నమ్మకం లేదని, వాళ్ల ప్రోద్భలంతోనే ఈ దోపిడీలు జరుగుతున్నాయని బొత్స అభిప్రాయపడ్డారు. 

జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది?
పక్కరాష్ట్రం తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులను అరెస్టులు చేస్తుంటే మన రాష్ట్రంలో కనీసం విచారణ కూడా జరకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భూములు కబ్జాలకు గురవుతున్నాయని చెబుతుంటే మరో పక్క కలెక్టర్‌ మరో విధంగా స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారన్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుంటే జిల్లా యంత్రాంగం ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నారా అని అని నిలదీశారు. ఏదిఏమైనా విశాఖ భూములను పరిరక్షించుకోవాలన్నారు. ఇలాంటి భూదందాలను, దోపిడీలను అరికట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు అక్రమాలకు, దోపిడీలకు పాల్పడినప్పుడే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి చిత్తశుద్ధితో భూకుంభకోణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండి, వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు

తాజా వీడియోలు

Back to Top