ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలు కాదు..పని కల్పించే కంపెనీలు కావాలి

విజయవాడ: ప్రజల ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలు కాకుండా పది మందికి ఉద్యోగం కల్పించే కంపెనీలను ఏర్పాటు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. కావలి నియోజకవర్గంలో అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన మండిపడ్డారు. కావలి నియోజకవర్గంలో రామయ్యపట్నం కేంద్రంగా పోర్టు ఏర్పాటు చేస్తామన్నామని చంద్రబాబు చెప్పారని, దానికి ఇంత వరకు అతిగతి లేదన్నారు. అదే విధంగా ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని చెప్పారు కానీ దాన్ని ఎక్కడ ప్రారంభిస్తారో కూడా చెప్పడం లేదన్నారు. పచ్చటి పొలాలను నాశనం చేసి అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌కు కొరత లేదని, మళ్లీ అణువిద్యుత్‌ కేంద్రం ఏంటని ప్రశ్నించారు. ప్రమాదకరమైన అణువిద్యుత్‌ కేంద్రాన్ని కావలి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top