ఆళ్ల‌గ‌డ్డ‌లో అధికార పార్టీకి షాక్‌

  • వైయస్సార్సీపీలోకి గంగుల ప్రభాకర్ రెడ్డి
  • త్వరలో ఆళ్లగడ్డలో భారీ బహిరంగసభ
  • నేడు వైయస్ జగన్ ను కలవనున్న గంగుల
  క‌ర్నూలు:  ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగు దేశం పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ పార్టీ అధినేత తీరు న‌చ్చ‌క టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు.  ఆళ్లగడ్డలో రాజకీయంగా బలమైన గంగుల కుటుంబం టీడీపీని వీడటం సంచ‌ల‌నం క‌లిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో  రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల , ఉయ్యాలవాడ, దొర్నిపాడు,  ఆళ్లగడ్డ   మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గుంగుల కుటుంబ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. బుధ‌వారం వారు హైద‌రాబాద్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌నున్నారు.

టీడీపీకి డిపాజిట్లు గ‌ల్లంతు
ఆళ్ల‌గ‌డ్డ నియోజకవర్గంలో రెండు విడతల ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అలాంటి సమయంలో గంగుల ప్రభాకర్‌రెడ్డి పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలతో పాటు మూడు మండలాల్లో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగలిగారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిపాలైనా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. అయితే పార్టీలోకి వలస నేతల రాకతో గంగుల కుటుంబాన్ని చంద్రబాబు దూరం పెట్టడం మొదలైంది. ఆయన వర్గానికి ఎలాంటి పనులు దక్కకుండా మరో వర్గం అడ్డుకోవడం.. కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్‌ లేకపోవడం ఆ కుటుంబాన్ని బాధించింది. భూమా వర్గానికి చెందిన ఓడిపోయిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండటాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మూడు నెలల నుంచి కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం గంగులను మనస్థాపానికి గురిచేసింది.
 
వలస నేతలకే ప్రాధాన్య‌త‌
గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు నాని ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ వచ్చారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులొచ్చినా తామున్నామంటూ భరోసానిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన నేతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి, ఎన్టీఆర్‌ గృహాలు, పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలో ఆ వర్గానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం గంగుల కుటుంబాన్ని ఆలోచనలో పడేసింది. మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా గంగుల వర్గానికి చెందిన రాఘవరెడ్డి పేరు ఖరారయిందని.. రేపోమాపో ప్రకటన వస్తుందన్న తరుణంలో భూమా వర్గానికి చెందిన బి.వి.రామిరెడ్డి పేరును ప్రకటించడం గంగుల కుటుంబం పార్టీ వీడేందుకు కారణమైంది.రాజకీయాల్లో తల పండిన గంగుల కుటుంబం వైయ‌స్‌ఆర్‌సీపీలో చేరనుండటంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది.

త్వ‌ర‌లోనే ఆళ్ల‌గ‌డ్డ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌
గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సంద‌ర్భంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో త్వ‌ర‌లోనే భారీ బ‌హిరంగ స‌భ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. గంగుల త‌న స‌త్తా చూపించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా అధికార పార్టీలో అంత‌ర్‌మ‌ధ‌నం మొద‌లైంది. మంగళవారం ఆళ్ల‌గ‌డ్డ‌లోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నాయకులు మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయత లేని తెలుగుదేశం పార్టీలో ఉండలేమని.. తామంతా మీ వెంటే ఉంటామని ముక్తకంఠంతో గంగుల‌కు మాట ఇచ్చారు. ఎన్ని కష్టనష్టాలైనా ఎదుర్కొంటామని.. ముందుండి నడిపిస్తే టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చ‌రించారు.
Back to Top