శోభమ్మ నాకు అక్క ప్రేమను పంచింది: వైఎస్ జగన్

ఆళ్లగడ్డ: తనకు షర్మిల అనే చెల్లెలే కాదని, శోభమ్మ అనే అక్క కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. శోభా నాగిరెడ్డి ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ శోభమ్మ భౌతికంగా లేకపోయినా.. అందరి హృదయాల్లో ఉన్నారన్నారు.  

తాను జైలులో ఉన్నప్పుడు కోర్టుకు హాజరు పరిచిన సందర్భంగా తన అమ్మ, తన భార్య భారతితో పాటు శోభమ్మ కూడా వచ్చారని, ఆ సందర్భంగా ఆమె తన చేయి పట్టుకుని, 'నీకే ఇన్ని సమస్యలు ఎందుకుని' బాధపడిందని, ఆ సమయంలో తమ్ముడి కోసం పడుతున్న బాధను శోభమ్మ కళ్లల్లో చూశానని వైఎస్ జగన్ అన్నారు. శోభమ్మను పోగొట్టుకోవటం ఆ కుటుంబంతో పాటు, అందరికీ తీరని నష్టమన్నారు.

ఇక రాజకీయాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారని,అయితే మంచి ఎమ్మెల్యేల కోవలో శోభా నాగిరెడ్డి ముందుంటారన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని రుజువు చేశారని అన్నారు. అనంతరం వైఎస్ జగన్.. శోభా నాగిరెడ్డిపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు.
Back to Top