నెల రోజుల్లో శివాజీ నగర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి

నెల్లూరు: నెల రోజుల్లో శివాజీ నగర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయిస్తానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 31, 32వ డివిజన్‌లలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ నగర్‌ ప్రజలు బ్రిడ్జి లేక తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు కాలవలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ..బ్రిడ్జి నిర్మాణం శివాజీ నగర్‌ వాసుల చిరకాల కోరిక అన్నారు. ఇందు కోసం ఆరు నెలలుగా తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు, ఎట్టకేలకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కోటాలో ఈబ్రిడ్జి సాధించామని తెలిపారు. 30 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లుగా ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే శక్తికి మించి పోరాటం చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని తెలిపారు.  

Back to Top