షికారులా సాగుతున్న బాబు పాదయాత్ర: భూమన

హైదరాబాద్, 26 ఏప్రిల్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర షికారులా సాగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఎటువంటి స్థానమూ లభించదని ఆయన స్పష్టంచేశారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రతో మీకోసం వస్తున్నా యాత్రను పోలుస్తూ ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మహానేత నిప్పులు చెరిగే ఎండలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నడిచారని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఉదయం సాయంత్రం సమయాలను ఎంచుకుంటూ మిగిలిన సమయాల్లో ఏసీ బస్సులో సేదదీరుతూ నడుస్తున్నారని వివరించారు. చంద్రబాబు యాత్ర అంతులేని విషాద యాత్రగా మిగలడం ఖాయమని పేర్కొన్నారు.
ప్రతి దినం లక్షలాదిమంది ప్రజలు చేసే ఉదయ, సాయంత్ర వ్యాహ్యాళి మాదిరిగా చంద్రబాబు నడుస్తున్నారని చెప్పారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తాను నిద్రపోనూ.. మిమ్మల్ని నిద్రపోనివ్వను అని అంటుండే వారనీ, ఆయనకు ఎలాగూ నిద్ర రాదు కనుక అర్ధరాత్రి వరకూ పాదయాత్ర చేస్తారన్నారు. ఈ సమయంలో ఎండిన పొలం కనిపిస్తుందా.. పేదల కష్టాలు తెలుస్తాయా వారి కన్నీళ్ళు కనిపిస్తాయా అని వ్యగ్యంగా ప్రశ్నించారు.

దివంగత మహానేత చేపట్టిన ప్రజా ప్రస్థానం ప్రజలతో మమేకం కావడానికి ఉద్దేశించారన్నారు. ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని వారికి భరోసా కల్పించాలనే లక్ష్యంతో సాగిందన్నారు.  అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాదయాత్రని భూమన చెప్పారు. ఓదార్చడానికి ప్రజలు ఎవరూ లేని సమయంలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నారన్నారు. పైగా ప్రతి వంద కిలోమీటర్లకు టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే చొప్పున 16మంది ఇప్పటివరకూ జారిపోయారని తెలిపారు. ప్రతి ఐదు వందలు, వెయ్యి కిలోమీటర్లకు ఒక పైలాను చొప్పున చంద్రబాబు ఎందుకు ఆవిష్కరిస్తున్నట్లని నిలదీశారు.

తొమ్మిదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. ఇప్పుడు ఆయన ఒక తిరస్కరించబడ్డ వ్యక్తిగా మిగిలిపోయారనీ.. మిగిలిపోతారనీ భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top