వలసకూలీల వెతలు అడిగి తెలుసుకున్న షర్మిల

మహబూబ్‌నగర్: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి ‌షర్మిల మూలమళ్ల  గ్రామ శివారులో ఉన్న వలస కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆత్మబంధువులా పలకరించిన శ్రీమతి షర్మిల ప్రేమకు వలసకూలీలు పొంగిపోయారు. తమ కష్టాలు చెప్పుకున్నారు. తమ ప్రాంతం అయిజ మండలంలో చేసేందుకు పనులు లేక వరికోతల కోసం తామంతా మూలమళ్ళకు వచ్చినట్లు మహిళలు వివరించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తయితే తమకు ఇలా వలస వచ్చి పనులు చేసుకునే పరిస్థితి తప్పుతుందని తెలిపారు.

వారి బాధలు విన్న షర్మిల చలించిపోయారు. జిల్లాలో ఎక్కడికి వెళ్లినా మహిళలు తాగునీటి సమస్యలే చెబుతున్నారన్నారు. కనీసం తాగునీటి ఇబ్బందులు తీర్చలేని ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లని నిలదీశారుర. జిల్లా రైతాంగం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆత్మకూరు మండలంలో 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు జెన్‌కో ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి నిధులు కేటాయిస్తే వాటిని కూడా సకాలంలో ఖర్చుచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను ఎండిగడుతూ ప్రజలకు భరోసా ఇచ్చారు. జగనన్న నేతృత్వంలో రాజన్నరాజ్యం వస్తుందని, అన్ని సమస్యలు తీరుతాయని అందుకు రానున్న ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రాజీవ్ భీమా ప్రాజెక్టు నిర్మాణానికి డాక్ట‌ర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి జీవం‌పోసి 2004 సెప్టెంబర్ 24న మక్త‌ల్‌లో మొదటిదశ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దాదాపు రూ.2100 కోట్లు కేటాయించి రూ.1700 కోట్లు ఖర్చుచేసి 85 శాతం పనులు పూర్తిచేస్తే మిగిలిన 15 శాతం పనులను ఈ ప్రభుత్వం మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు.

ఈ ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కుటుంబ జీవనం సాగేందుకు పాఠశాలలకు వెళ్ళాల్సిన పిల్లలను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు కూలిపనులకు తీసుకెళ్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చదివిస్తుందన్న భరోసా లేకపోవడంతో మరి కొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఇబ్బందులను ముందే గుర్తించిన‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చదువుకోలేని పేద‌ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ‌అమలుచేసిన వైనాన్ని గుర్తుచేశారు. ఈ పథకాన్ని అమలు చేయకుండా ప్రస్తుత పాలకులు పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని శ్రీమతి షర్మిల మండిపడ్డారు.
Back to Top