షర్మిల యాత్రలో మరో మైలురాయి

పెడన(కృష్ణా జిల్లా) 03 మార్చి 2013:

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారంనాడు మరో మైలు రాయి చేరుకుంది. అక్టోబరు 18న ప్రారంభమైన పాదయాత్ర డిసెంబరు 14న రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డినగర్లో శ్రీమతి షర్మిల మోకాలి గాయం కారణంగా నిలిచిపోయిన సంగతి, ఫిబ్రవరి ఆరున ప్రారంభమైన విషయమూ తెలిసిందే. ఇప్పటివరకూ ఆమె కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తిచేసి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో నడుస్తున్నారు. ఆమె ఇప్పటివరకూ 50 నియోజకవర్గాల్లోని 800 గ్రామాలలో యాత్ర సాగింది. వైయస్ఆర్ జిల్లాలో 83 కి.మీ, కర్నూలులో 195, అనంతపురంలో 186, మహబూబ్ నగర్లో 293, రంగారెడ్డి జిల్లాలో 67, నల్గొండ జిల్లాలో 151, గుంటూరు జిల్లాలో 365.4 కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీమతి షర్మిల పాదయాత్ర వందరోజులు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో హుస్సేనిపురానికి వచ్చినందుకు శ్రీమతి షర్మిలకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. 1500 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేసినందుకు అభినందనలు అందజేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలునుంచి బయటకి వస్తే రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందని తాము నమ్ముతున్నట్లు వారు చెప్పారు. జగనన్న సీఎం కావాలి.. రాజన్న రాజ్యం రావాలి... అంటూ వారు గొంతెత్తి నినదించారు. భారత దేశంలో ఏ మహిళా చేయని కార్యాన్ని శ్రీమతి షర్మిల పూర్తిచేశారన్నారు. ఇది గిన్నిస్ రికార్డవుతుందన్నారు. శ్రీమతి షర్మిలకు అంతా జేజేలు పలకాలని పిలుపునిచ్చారు. నూట పది రోజులలో శ్రీమతి షర్మిల ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా దృఢదీక్షతో పాదయాత్ర చేశారన్నారు. కొన్ని వేల మంది సమస్యలు విన్నారు.. బాధలు తెలుసుకున్నారు.. ఎంతోమందిని అక్కున చేర్చుకుని ఓదార్చారన్నారు. మరెంతోమందికి భరోసా కల్పించారని తెలిపారు. పాలక, ప్రదాన ప్రతిపక్షాల కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, ఘాటుగా విమర్శిస్తూ సాగారు.

Back to Top