షర్మిల మరో ప్రజాప్రస్థానం ప్రారంభం

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను బుధవారం ఉదయం 11 గంటలకు పునః ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని ఎస్‌ఎస్‌ఆర్‌ గార్డెన్సు నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ, రాష్ట్రంలోని పలు ఇతర జిల్లా నుంచి కూడా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, శ్రీ వైయస్‌ జగన్‌ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారంతా కూడా శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె వెంటే నడుస్తున్నారు. ఈ రోజున శ్రీమతి షర్మిల మొత్తం 15.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం అక్కేడ ఆమె రాత్రికి బసచేస్తారు.

అధికార, ప్రధాన ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ, అష్టకష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తూ కొనసాగుతున్న శ్రీమతి షర్మిల పాదయాత్రలో వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల వదిన, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సతీమణి శ్రీమతి భారతిరెడ్డి, శ్రీమతి షర్మిల భర్త బ్రదర్ అనిల్, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రంగారెడ్డి జిల్లా పార్టీ కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి, పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
Back to Top