షర్మిలకు మళ్లీ తీవ్రమైన మోకాలి నొప్పి

రెడ్డిగూడెం (గుంటూరు జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు మోకాలు నొప్పి మళ్ళీ తీవ్రమైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెడ్డిగూడెం నుంచి దూళిపాళ్ల వైపు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రగా వస్తుండగా ఒక వ్యక్తి ఆమెతో కరచాలనం చేసేందుకు జనం మధ్యలోంచి దూసుకొచ్చాడు. ఆ తొందరపాటులో శ్రీమతి షర్మిల కాళ్లకు అడ్డం పడ్డాడు. ఈ హఠాత్సంఘటనతో శ్రీమతి షర్మిల ముందుకు తూలారు. ఆ సందర్భంలో ఆమెకు ఇంతకు ముందు శస్త్ర చికిత్స జరిగిన కాలికి మళ్లీ తీవ్రమైన నొప్పి వచ్చింది. బాధ ఎక్కువగా ఉండడంతో శ్రీమతి షర్మిల కొద్దిసేపు నడవలేకపోయారు. ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె తన పాదయాత్రను మళ్ళీ ప్రారంభించారు.

కాగా, మోకాలి నొప్పి మళ్ళీ తీవ్రం కావడంతో శ్రీమతి షర్మిల ఆదివారంనాటి పాదయాత్ర షెడ్యూల్‌ను కొద్దిగా కుదించినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ ‌కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.
Back to Top