షర్మిలకు గోడు చెప్పుకున్న మామిడి రైతులు

సంద్రాల (కృష్ణా జిల్లా), 14 ఏప్రిల్‌ 2013: మామిడి పంట దెబ్బతిని తాము ఆర్థికంగా బాగా నష్టపోయామంటూ రైతులు శ్రీమతి షర్మిల వద్ద వాపోయారు. మరో ప్రజాప్రస్థానం 120వ రోజు ఆదివారంనాడు కృష్ణా జిల్లా సంద్రాలలో మామిడి రైతులు శ్రీమతి షర్మిలను కలుసుకున్నారు. శ్రీమతి షర్మిల ఆదివారంనాటి తన పాదయాత్రను సంద్రాల నుంచే ప్రారంభించారు. తమ వెతలను ఆమెతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల సమీపంలోని మామిడి పంటను పరిశీలించారు. రైతుల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.

మంగు తెగులుతో మామిడి పంటకు అంతా నష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెగులు కారణంగా మామిడి టన్నుకు రూ. 5 వేలు కూడా ధర పలకడంలేదని వారు విచారం తెలిపారు. మామిడి పంటను నమ్ముకున్న తమకు కనీసం కూలి ఖర్చులు కూడా రావడం లేదని వారు చెప్పారు. పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం రుణాలు గాని, పరిహారం కాని ఇవ్వడం లేదని శ్రీమతి షర్మిల ముందు వారు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు శ్రీమతి షర్మిల డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ ‌జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని సంద్రాలలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాగా, ఆదివారంనాడు శ్రీమతి షర్మిల పాదయాత్రలో మహిళలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పాల్గొంటున్నారు.
Back to Top