షర్మిలకు ఘ(జ)నస్వాగతం

మాల్(నల్లగొండ):

దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన  శ్రీమతి షర్మిలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నుంచి జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గంలోని మాల్‌ గ్రామానికి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన మహిళలు, అభిమానుల నుంచి పూలతో ఆమెకు ఘన స్వాగతం లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున త రలివచ్చిన అశేష జనవాహినితో గ్రామ వీధులు కిక్కిరిసిపోయాయి. ఏ దిక్కు చూసినా జన సందోహమే కనిపించింది.
      
జిల్లా సమస్యలపై షర్మిల సమర శంఖం
     అక్కడ జరిగిన బహిరంగ సభలో జిల్లా సమస్యలపై షర్మిల సమరశంఖం పూరిం చారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధిని కొనియాడారు. 70 ఏళ్లుగా జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ మహమ్మారి నుంచి విముక్తి కల్పించేందుకు ఆయన కృష్ణా జలాలను తెచ్చారని గుర్తుచేశారు. మహానేత జీవించి ఉంటే ఈ పాటికి ఎస్‌ఎల్‌బీసీతో జిల్లాలో మూడు లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమయ్యేదన్నారు.

సీఎం, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు
     సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరులపై శ్రీమతి షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం కిరణ్ పాలన చంద్రబాబు-2 పాలనను తలపిస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన మోకాలు గాయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు గాయం కాలేదని నిరూపించాలని సవాలు విసిరారు. సీఎం కిరణ్, చంద్రబాబు దొంగ నాటకాల గురించి మాట్లాడిన ప్రతిసారీ సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

నూతనోత్తేజం నింపిన రాజన్న తనయ
     జిల్లాలో షర్మిల పాదయాత్రకు మొదటి రోజు అనూహ్య స్పందన లభించింది. జిల్లా నలుదిక్కుల నుంచి వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. దేవరకొండ, మునుగోడు, ఆలేరు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు.  పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పాదయాత్ర సభలో ప్రారంభోపన్యాసం చేశారు.

బోనాలు, బతుకమ్మలతో స్వాగతం

చింతపల్లి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజలు భారీగా స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ముగించుకొని జిల్లాకు వస్తున్న ఆమెకు మహిళలు, బోనాలు, బతుకమ్మలతో ఎదురేగారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, పూలు చల్లారు. ఐదు కిలోమీటర్లు ఎదురేగి జిల్లాకు తోడ్కొని వచ్చారు.

     ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు, బతుకమ్మలతో వచ్చారు. స్థానిక మార్కెట్ కార్యాలయం నుంచి బహిరంగ సభాస్థలి వరకు పూలను రోడ్డుపై చల్లి షర్మిలను స్వాగతిం చారు. నల్లవెల్ల గేటు వద్ద పార్టీ బీసీ సెల్ మండల కన్వీనర్ జమ్ముల జంగయ్య షర్మిలకు నాగలిని బహూకరించారు.
స్వాగతం పలికింది వీరే..
     షర్మిలకు స్వాగతం పలికిన వారిలో పార్టీ దక్షిణ తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి జిట్టా బాలకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పాదూరి కరుణ, సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, జిల్లా సమన్వయకర్త బండారు మోహన్‌రెడ్డి, జిల్లా పరిశీలకురాలు బాలమణెమ్మ, నిజామాబాద్ జిల్లా పరిశీలకులు గాదె నిరంజన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యకుమారి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అలక శ్రవణ్‌కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఇరుగు సునీల్‌కుమార్, నాయకులు రమావత్ సురేష్‌కుమార్ నాయక్, ఎంఏ సిరాజ్‌ఖాన్, తిప్పర్తి రుక్మారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, అల్గుబెల్లి రవీందర్‌రెడ్డి, ఎర్నేని వెంకటరత్నం (బాబు), శ్రీకళారెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, ఎరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, గూడూరు సరళారెడ్డి, బోయపల్లి అనంతకుమార్, కర్నాటి శ్రీనివాస్, దొంతం బాలరాజు తదితరులున్నారు.

Back to Top