షర్మిలకు ఆబాలగోపాలం స్వాగతం

ముప్పాళ్ళ:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు ఆబాలగోపాలం స్వాగతం పలుకుతున్నారు. ఆమెను చూడాలనీ, ఆమెతో చేయికలపాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పంటపొలాల మీదుగా సాగుతుండగా ఓ రైతు ఆమెకు తన పొలంలోని చెరకు గెడలను అందించారు. శ్రీమతి షర్మిల రైతునుంచి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వచ్చిన షర్మిలకు దమ్మాలపాడు అడ్డరోడ్డు ఒంటెలపై పార్టీ జెండాలను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వీటిని ఏర్పాటు చేయించారు. ఇరుకుపాలెం ఎస్టీ కాలనీలో నెలకొల్పిన వైయస్ఆర్ చిత్ర పటానికి షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్టీ కాలనీ వాసులు, నిర్వాహకులు పాలపర్తి శామ్యూల్, వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు.
చిన్నారికి నామకరణం
     ఇరుకుపాలెంలో కాండ్రకొండ రాణి కుమారుడికి మురళీధర్‌గా షర్మిల నామకరణం చేశారు. మహానేత తనయ తన కుమారుడికి నామకరణం చేయడంపై రాణి ఆనందం వ్యక్తం చేసింది. పాదయాత్రలో పాల్గొన్న అభిమానులకు పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోజన, మంచినీటి వసతి కల్పించారు. మాదల అడ్డరోడ్డు వద్ద ఎస్టీ కాలనీ వాసులు తమకు ఇళ్ళ స్థలాలు లేవని షర్మిలకు వివరించారు. భవిష్యత్తులో రాజన్న రాజ్యం వస్తుందని వారికి షర్మిల భరోసా ఇచ్చి ముందుకు సాగారు. మహానేత తనయ షర్మిలకు పార్టీ నేత ఎస్‌కేఎం హుస్సేన్ తన సతీమణి షాబీరా నాగలి బహుకరించారు. హుస్సేన్, షాబీరాల కుమార్తెను షర్మిల ముద్దాడటంతో వారు ఆనందంలో మునిగిపోయారు.

Back to Top